Make In India: ఆయుధాల తయారీలో దూకుడు మీదున్న భారత్.. దిగుమతులు తగ్గి.. లోకల్ మేకింగ్ మెరుగుదల

మేక్ ఇన్ ఇండియా పేరిట సూది నుంచి పెద్ద జంబో జెట్ల దాకా మన దేశంలోనే తయారు చేయాలన్న ప్రతిపాదన ముందుకు తెచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇందులో చాలా వరకు సానుకూల…

Make In India: ఆయుధాల తయారీలో దూకుడు మీదున్న భారత్.. దిగుమతులు తగ్గి.. లోకల్ మేకింగ్ మెరుగుదల
Indian Wepons Supply
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 18, 2021 | 4:50 PM

Make in India giving great results in weapons production: ఆత్మ నిర్భర్ భారత్… అంతకు ముందు మేక్ ఇన్ ఇండియా.. జన బాహుళ్యంలోకి బాగా చొచ్చుకుపోయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవచించిన పదబంధాలివి. స్వతంత్రం వచ్చిన తర్వాత దశాబ్ధాల పాటు మన దేశాన్ని అభివ‌ృద్ధి చెందుతూ వున్న దేశంగానే సంబోధించేవారు. ఈ దశను దాటి.. ఎప్పటికి అభివృద్ధి చెందిన దేశంగా మన భారతం పేరు పొందుతుందా అని వేచి చూసిన వారిలో ఎంతో కొంత ఆశ రేకెత్తించిన నినాదాలివి. మేక్ ఇన్ ఇండియా పేరిట సూది నుంచి పెద్ద జంబో జెట్ల దాకా మన దేశంలోనే తయారు చేయాలన్న ప్రతిపాదన ముందుకు తెచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇందులో చాలా వరకు సానుకూల ఫలితాలు సాధించారని చెప్పేందుకు మన దేశంలో సొంతంగా తయారు చేసుకుంటున్న ఆయుధాల శాతం పెరగడమే నిదర్శనం.

నిజానికి ప్రపంచ దేశాల్లో ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. అయితే, దేశీయంగా మిస్సైళ్ళ దగ్గర్నించి తుపాకుల దాకా వరల్డ్ క్లాస్ ఉత్పత్తి సంస్థలకు మన దేశం నుంచే విడి భాగాలు వెళుతూ వుంటాయి. అంతే మన దేశం పంపే విడి భాగాలతో మిస్సైళ్ళు, జెట్ ఫ్లైట్స్, రైఫిళ్ళు వంటివి తయారు చేసి మనకే విక్రయించేవి కొన్ని దేశాలు. అసాల్ట్‌ రైఫిల్‌ నుంచి బాలిస్టిక్‌ మిసైల్స్‌ వరకు ప్రపంచంలోని అత్యుత్తమ ఆయుధ వ్యవస్థలకు భారతీయ పరిశ్రమలు విడి భాగాలను సరఫరా చేస్తుంటాయి. ఈ క్రమంలో ఆయుధరంగంలో స్వావలంభన సాధించడం కోసం మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించాలని నరేంద్ర మోదీ నిర్ణయించారు. దీని కోసం ఆయుధ దిగుమతుల నిబంధనలను కఠినతరం చేశారు. ఈ చర్యతో దేశీయంగా ఆయుధాల తయారీ ఊపందుకుంది. అదే సమయంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయుధాలు 33 శాతం తగ్గిపోయాయి.

సాయుధ దళాల నవీనీకరణకు గత ఐదేళ్లలో 304 ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ఇందులో 190 ఒప్పందాలు దేశీయ సంస్థలతోనే జరిగినట్లు మోదీ ప్రభుత్వం ఈమధ్యే రాజ్యసభలో ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. గత సంవత్సరం ఆగస్టులో 101 రకాల ఆయుధాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న ఏడేళ్లలో దేశీయ ఆయుధ పరిశ్రమలతో కేంద్రం 4 లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదిరే అవకాశం వుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఆయుధాల విలువ ఒక లక్షా 30 వేల కోట్ల రూపాయల చొప్పున ఉండగా, నౌకాదళానికి చెందిన ఆయుధాల విలువ ఒక లక్షా 40 వేల కోట్ల రూపాయలుంటుందని అంఛనా.

అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధకాలంలో భారత్ రష్యాతో ఎక్కువగా స్నేహ సంబంధాలు నెరిపినందువల్ల మన దేశానికి ముఖ్య ఆయుధ సరఫరాదారుగా ఆ దేశం వుండేది. ఆ తర్వాత అమెరికాతోను సఖ్యత నెలకొన్న తర్వాత ఇరు దేశాల నుంచి మన దేశం ఆయుధాలను కొనుగోలు చేసేది. అయితే.. గత అయిదేళ్ళుగా దేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రభావం పెరిగిపోవడంతో.. ఆయుధాల సరఫరా తగ్గి.. రష్యా ఆయుధ మార్కెట్‌పై పెను ప్రభావం పడింది. ఈ విషయాన్ని రష్యా ఆయుధ మార్కెట్‌ని అనాలిసిస్ చేసిన స్వీడన్ సంస్థ స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐపీఆర్‌ఐ) నివేదిక వెల్లడించింది. రష్యా ఆయుధాలపై ఆధార పడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకోవడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటి సంక్లిష్ట నిబంధనల కారణంగానే రష్యా నుంచి భారత్‌ ఆయుధ దిగుమతులు 54 శాతం వరకు తగ్గిపోయాయని స్టాక్‌హోం నివేదిక పేర్కొంది. అదే సమయంలో ఫ్రాన్స్ నుంచి భారత్‌కు ఆయుధాల ఎగుమతులు పెరిగాయని స్టాక్‌హోం నివేదికలో పేర్కొన్నారు. భారత్‌ 2019లో రక్షణ రంగానికి 71.1 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు ఎస్‌ఐపీఆర్‌ఐ 2020 ఏప్రిల్‌లో వెల్లడించింది. దీంతో రక్షణరంగ వ్యయంలో అమెరికా, చైనా తరువాత భారత్‌ మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది.

ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ అంశాన్ని కూడా స్టాక్‌హోం తాజా నివేదికలో వెల్లడించింది. గత పదేళ్ళ కాలంలో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా తన వాటాను 32 నుంచి 37 శాతానికి పెంచుకున్నట్లు పేర్కొంది. 2016-20 మధ్య అమెరికా 96 దేశాలకు కీలక ఆయుధాలను ఎగుమతి చేసినట్లు వివరించారు. మొత్తం ఎగుమతుల్లో 47 శాతం మధ్య ఆసియా దేశాలకే జరిగాయి. అమెరికా ఆయుధ ఎగుమతుల్లో ఒక్క సౌదీ అరేబియా వాటానే 24 శాతం ఉన్నట్లు స్టాక్‌హోం రిపోర్టు పేర్కొంది. అమెరికా ఆయుధ ఎగుమతులు భారీగా వృద్ధి చెందడంతో ప్రధాన పోటీదారు అయిన రష్యాకు అందనంత ఎత్తుకు చేరుకుంది. అదే సమయంలో రష్యా, చైనా ఆయుధ ఎగుమతులు భారీగా క్షీణించినట్లు ఈ నివేదిక వివరించింది.

2016-20 మధ్య కాలంలో రష్యా ఆయుధ ఎగుమతులు 20 శాతం వరకు తగ్గిపోయాయి. దీనికి ప్రధాన కారణం రష్యా నుంచి భారత్‌ ఆయుధ దిగుమతులు 54 శాతం వరకు తగ్గిపోవడమేనని నివేదిక తెలిపింది. చైనా, అల్జీరియా, ఈజిప్ట్‌ దేశాలకు రష్యా ఆయుధ ఎగుమతులు పెరిగినప్పటికీ భారత్‌లో తగ్గిపోయిన మార్కెట్‌ను అవి పూరించలేకపోయాయని ఎస్‌ఐపీఆర్‌ఐకు చెందిన ఆయుధ, సైనిక వ్యయ పరిశీలకుడు అలెగ్జాండర్‌ క్విమోవ్‌ పేర్కొన్నారు. మరో కీలక ఆయుధ ఎగుమతిదారు అయిన ఫ్రాన్స్‌ 2016-20 మధ్య ఎగుమతుల్లో 44% వృద్ధి సాధించిందని నివేదిక వెల్లడించింది. దీంతో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో ఫ్రాన్స్‌ వాటా 8.2 శాతానికి చేరుకుందని తెలిపింది. ఫ్రాన్స్‌ ఆయుధ ఎగుమతుల్లో 59 శాతం భారత్, ఈజిప్ట్, ఖతార్‌ దేశాలకే జరిగాయని స్టాక్‌హోం నివేదిక వెల్లడించింది.

రక్షణ విభాగంలో భారత పబ్లిక్, ప్రైవేట్‌ రంగ సంస్థలు:

# హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌): యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, వాటి ఇంజన్ల డిజైన్, డెవలప్‌మెంట్, ఉత్పత్తి, మరమ్మతుల పనులు చూస్తుంది. # భారత్‌ ఎల్రక్టానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌): రక్షణ రంగం, పారామిలిటరీ విభాగాలు వినయోగించే సున్నితమైన ఎల్రక్టానిక్‌ విభాగాల ఉత్పత్తి, డిజైన్, అభివృద్ధి పనులను చేపడుతుంది. # భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌): రక్షణ శాఖ కోసం వివిధ రకాల ప్రత్యేకతలతో కూడిన భారీ వాహనాలను తయారు చేస్తుంది. # మజగావ్‌ డాక్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌): భారత నౌకా దళం కోసం జలాంతర్గాములు, మిసైల్‌ బోట్స్, నౌకలను ధ్వంసం చేసే ఆయుధాలు, ఫ్రిగేట్స్‌లు తయారు చేస్తుంది. # గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ (జీఆర్‌ఎస్‌ఈ): భారత నౌకాదళం కోసం యుద్ధ నౌకలు, వాటిని అనుబంధంగా ఉండే సహాయక ఓడలు తయారీ, మరమ్మతుల పనులు చేపడుతుంది. # భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌): మిసైల్స్, టార్పెడోల దాడిని అంచనా వేసే సిస్టంలను తయారు చేస్తుంది. # మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిథాని): ఏరోనాటిక్స్, అంతరిక్ష వాహకనౌకలు, మిలటరీ, నేవీ వాహనాలకు కావాల్సిన విడిభాగాలను రూపొందిస్తుంది. # టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏఎస్‌): వాయుసేనకు సంబంధించిన విమానాల విడిభాగాల ఉత్పత్తి, మిలిటరీ ఆయుధాలు, మిలిటరీ వాహనాల్లోని ఆయుధాలకు కావాల్సిన అప్లికేషన్స్‌ను అభివృద్ధి చేస్తుంది. # లార్సన్‌ అండ్‌ టూబ్రో: భూతలం, యుద్ధనౌకలపై నుంచి వాడే మిసైల్స్‌ డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి చేస్తుంది. # మహీంద్ర డిఫెన్స్‌ సిస్టమ్స్‌: తేలికపాటి యుద్ధ వాహనాలు, ఆయుధాలు, చిన్నసైజు ఆయుధాల ఉత్పత్తితో పాటు మందుగుండు సామగ్రిని తయారు చేస్తుంది.

2015-19 మధ్య భారత్‌ దిగుమతి చేసుకున్న ఆయధాలను పరిశీలిస్తే.. డెన్మార్క్ నుంచి స్కాంటర్ 6000 నావల్ సర్వెల్లెన్స్ రాడార్లను మన దేశం దిగుమతి చేసుకుంది. బ్రెజిల్ నుంచి 145 ఎంబ్రేర్‌ ఈఆర్‌జే జెట్లు, జర్మనీ నుంచి ఏసీటీఏఎస్‌ సోనార్‌ సిస్టమ్స్‌, ఇటలీ నుంచి సూపర్‌ ర్యాపిడ్‌ 76 ఎంఎం నావెల్‌ గన్స్‌, దక్షిణ కొరియా నుంచి కే9 థండర్‌ 155 ఎంఎం ఆర్టిలరీ గన్స్‌‌ను మన దేశం 2015 – 2019 మధ్య కాలంలో దిగుమతి చేసుకున్నట్లు స్టాక్ హోం నివేదిక పేర్కొంది.

2014-18 మధ్య ప్రపంచ ఆయుధ దిగుమతును పరిశీలిస్తే.. గల్ఫ్ కంట్రీ సౌదీ అరేబియా అగ్రస్థానంలో కనిపిస్తుంది. ఆ తర్వాత స్థానం మన దేశానిదే. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 12 శాతం సౌదీ అరేబియాకు జరుగుతుంటే 9.5 శాతం ఇండియాకు దిగుమతి అవుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో ఈజిప్ట్ (5.1 శాతం) వుంది. ఆస్ట్రేలియా 4.6 శాతం, అల్జీరియా 4.4 శాతం, చైనా 4.2 శాతం, యూఏఈ 3.7 శాతం, ఇరాక్‌ 3.7 శాతం, దక్షిణ కొరియా 3.1 శాతం, వియత్నాం 2.9 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాయి.

ALSO READ: అమరావతి భూకేటాయింపులు ఆసక్తికరం.. రేట్లలో వ్యత్యాసంపైనే అందరి ద‌ృష్టి.. తేడాలెందుకని ప్రశ్న

ALSO READ: ఆసక్తి రేపుతున్న తిరుపతి బై-ఎలక్షన్.. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు.. ఇక ప్రచార సంరంభం