ఒక్క కోతికి రూ. 600.. ఎన్ని పట్టుకుంటే అంత డబ్బు.. ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్
మహారాష్ట్రలో ఈ మధ్య కాలంలో కోతుల బెడత పెరిగిపోయింది. రాష్ట్రంలో చాలా నగరాల్లో ఈ కోతులు సృష్టిస్తున్న బీభత్సానికి ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. కొతులను పట్టుకునే వారికి మనీ ప్రైజ్ ప్రకటించింది. ఒక్కో కోతి రూ.600 బహుమతిని ఇవ్వనున్నట్టు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మహారాష్ట్రలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పల్లెల్లోనూ వీటి సంచారం విపరీతంగా పెరిగింది. పొలాల్లో రైతులు పండించిన పంటలను నాశనం చేస్తూ ఎనలేని నష్టాలను మిగులుస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి వస్తువులను పాడుచేయడంతో పాటు కొన్నిసార్లు దాడులకు పాల్పడుతుండటంతో ఈ సమస్య జటిలంగా మారింది. దీంతో స్థానికులు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.
కోతుల బెడదను తగ్గి్ంచేందుకు వాటిని పట్టుకొని అటవీ ప్రాంతాలకు తరలించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కోతులను పట్టుకునేందుకు మనీ ప్రైజ్‌ను ప్రకటించింది. ఒక్కో కోతికి రూ.6వందలు చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే నగదు ఇస్తున్నారు కదా అని ఇష్టానుసారంగా ఈ మూగజీవాలను పట్టుకోవడానికి వీల్లేదు. వలలు, బోనులు వంటి సురక్షితమైన పరికరాలను మాత్రమే ఉపయోగించి వాటిని బంధించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి గాయాలు కాకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. క్రూరమైన పద్ధతులను వాడితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
బంధించిన ప్రతి కోతికి సంబంధించిన పూర్తి వివరాలను అటవీ శాఖ అధికారులకు సమర్పించాలి. ఫోటో ఆధారాలతో సహా వాటిని నమోదు చేసిన తర్వాతే ప్రకటించిన మొత్తాన్ని అందజేస్తారు. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు. సరైన ఆధారాలు చూపిస్తేనే ఆరు వందల రూపాయల ప్రోత్సాహకం చేతికి అందుతుంది.
పట్టుకున్న వాటిని ఎక్కడ పడితే అక్కడ వదిలేయడానికి అటవీ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. జనావాసాలకు కనీసం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే వీటిని సురక్షితంగా వదిలిపెట్టాలి. ఇలా చేయడం వల్ల అవి మళ్లీ తిరిగి గ్రామాల్లోకి వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఈ తరలింపు కొనసాగుతుంది.
ఈ విధానం వల్ల ఒకవైపు ప్రజలకు ఈ బెడద నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది. మరోవైపు వాటిని పట్టుకున్న వారికి కొంత ఆర్థిక ఉపాధి కూడా దొరుకుతుంది. గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కకపోవడంతో ఇప్పుడు ఈ సరికొత్త పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇది వంద శాతం విజయవంతం అయితే మిగతా జిల్లాల్లోనూ అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
మొత్తంగా చూసుకుంటే సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం స్థానికుల్లో ఆనందాన్ని నింపుతోంది. వ్యవసాయాన్ని కాపాడుకోవడంతో పాటు సామాన్యుల భద్రతకు ఇది ఒక మంచి పరిష్కారంగా కనిపిస్తోంది. పక్కడ్బందీగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళితే త్వరలోనే వానరుల దాడుల నుంచి పూర్తి స్థాయిలో ఉపశమనం లభించడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
