‘మహా’ క్యాబినెట్… అజిత్‌కు ఆర్థికం.. ఆదిత్యకు టూరిజం
ఎలాగైతేనేం.. ఇన్ని రోజుల అనంతరం మహారాష్ట్రలో మంత్రులకు శాఖలను కేటాయించారు. 36 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు రోజుల అనంతరం మొత్తం 42 మంది మంత్రుల శాఖలకు సంబంధించిన జాబితాకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆమోదముద్ర వేశారు. అందరూ భావించినట్టుగానే డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు కీలకమైన ఆర్ధిక, ప్లానింగ్ శాఖలు లభించాయి. శివసేన అధినేత, సీఎం ఉధ్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేకు టూరిజం, ఎన్విరాన్ […]
ఎలాగైతేనేం.. ఇన్ని రోజుల అనంతరం మహారాష్ట్రలో మంత్రులకు శాఖలను కేటాయించారు. 36 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు రోజుల అనంతరం మొత్తం 42 మంది మంత్రుల శాఖలకు సంబంధించిన జాబితాకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆమోదముద్ర వేశారు. అందరూ భావించినట్టుగానే డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు కీలకమైన ఆర్ధిక, ప్లానింగ్ శాఖలు లభించాయి. శివసేన అధినేత, సీఎం ఉధ్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేకు టూరిజం, ఎన్విరాన్ మెంట్, ప్రోటోకాల్ శాఖలను కేటాయించారు. ఈ మంత్రిత్వ శాఖల్లో ఎన్సీపీకి పెద్ద పీట వేశారు. ఈ పార్టీకి 16 శాఖలు లభించగా..శివసేనకు 15, కాంగ్రెస్ పార్టీకి 10 బెర్తులు లభించాయి. ఎన్సీపీకి అత్యంత ప్రధానమైన హోం, ఫైనాన్స్, ఇరిగేషన్, హౌసింగ్ శాఖలు దక్కాయి. ఈ పార్టీ నేత అనిల్ దేశ్ ముఖ్ ను హోం శాఖ వరించింది. ఛగన్ భుజ్ బల్ కు ఫుడ్, సివిల్ సప్లయిస్ శాఖలు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీలో బాలా సాహెబ్ థోరట్ కు రెవెన్యూ శాఖ అప్పగించారు. మాజీ సీఎం అశోక్ చవాన్ ప్రజా పనుల శాఖ మంత్రి అయ్యారు. కాగా తనకు క్యాబినెట్ పోస్ట్ దక్కనందుకు అలిగి రాజీనామా చేసిన శివసేన నేత అబ్దుల్ సత్తార్ బీజేపీలో ‘ కొత్త ఆశలు ‘ రేపారు. ఇక ఈ కూటమి ప్రభుత్వానికి ‘ నాంది పడిందని’ కమలం పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. అయితే అబ్దుల్ సత్తార్ ను సీఎం ఉధ్ధవ్ థాక్రే బుజ్జగిస్తారని, సమస్య పరిష్కారమవుతుందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. పార్టీ అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తుంటాయని, త్వరలో అన్నీ సర్దుకుపోతాయని ఆయన పేర్కొన్నారు.