AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Accident: రైలు ప్రమాదం తర్వాత నైతిక బాధ్యతవహిస్తూ.. పదవికి రాజీనామా చేసిన రైల్వే మంత్రులు వీరే

ఇప్పుడు కూడా అలాంటి ఘోర రైలు ప్రమాదం ఒడిశాలో జరిగింది. గత ఘటనల తరహాలోనే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఘటనకు నైతిక ప్రాతిపదికన ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దేశంలో రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన మంత్రులపై చర్చ జరుగుతోంది.

Train Accident: రైలు ప్రమాదం తర్వాత నైతిక బాధ్యతవహిస్తూ..  పదవికి రాజీనామా చేసిన రైల్వే మంత్రులు వీరే
Railway Ministers
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2023 | 5:27 PM

Share

భారత రాజకీయ రంగంలో రాజీనామాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రత్యేకించి నైతిక బాధ్యతల విషయానికి వస్తే అది మరింత తక్కువనే చెప్పాలి. సంఘటన తీవ్రతను బట్టి ఆయా పదువుల్లోని కీలక నేతలు రాజీనామా చేయటం అనేది కోల్పోయిన జీవితాల పట్ల నిజమైన నివాళిగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణ, భయంకరమైన ప్రమాదం తరువాత జవాబుదారీతనం లేకపోవడం అధికారుల నుండి తక్షణ ప్రతిస్పందనను ఆశించిన పౌరులలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం తూర్పు ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో వందలాది మంది మృత్యువాతపడ్డారు. ఇంకా గాయపడిన వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఈ ఘటన అనంతరం భారత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ యావత్‌ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ప్రజలు తమ డిమాండ్‌తో హోరెత్తిస్తున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇలాంటి రెండు సందర్భాలను ప్రజలు గుర్తు చేసుకున్నారు. విపత్తుల కారణంగా ఇద్దరు రైల్వే మంత్రులు రాజీనామా చేసిన ఉదాంతాన్ని ప్రజలు గుర్తుచేస్తున్నారు.

లాల్ బహదూర్ శాస్త్రి: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఒక దశాబ్దం లోపే, అప్పటి మద్రాసులోని అరియలూరులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 142 మంది చనిపోయారు. రైలు ప్రయాణిస్తున్న వంతెన కూలిపోవడంతో అనేక కోచ్‌లు నదిలో పడిపోయాయి. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ నాటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ జవాబుదారీ చర్యతో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుండి శాస్త్రి ప్రశంసలందుకున్నారు. దేశప్రజలందరూ అతని చిత్తశుద్ధిని కొనియాడారు. తత్ఫలితంగా శాస్త్రికి జనాదరణ పెరిగింది. ‘రాజ్యాంగ నైతికత’ ఆధారంగా శాస్త్రి రాజీనామాను ఆమోదించాలని నెహ్రూ ఆలోచన ప్రారంభించారు. కాగా, శాస్త్రిని వదులుకోవద్దంటూ 30 మంది ఎంపీలు విజ్ఞప్తి చేశారు. శాస్త్రి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరికి నెహ్రూ తన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ప్రస్తుతం అప్పటి శాస్త్రి రాజీనామా లేఖ కాపీని కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

నితీష్ కుమార్: లాల్ బహదూర్ శాస్త్రి నిష్క్రమణ తర్వాత 43 ఏళ్ల తర్వాత రైల్వే మంత్రి నుండి రెండవ రాజీనామా వెలువడింది. ఆగస్ట్ 1999లో అస్సాంలో గైసల్ రైలు ప్రమాదంలో దాదాపు 290 మంది ప్రాణాలు కోల్పోయారు. సంఘటన అనంతరం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు.

మమతా బెనర్జీ: 2000 సంవత్సరంలో మమతా బెనర్జీ అదే సంవత్సరంలో జరిగిన రెండు రైలు ప్రమాదాల తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పటి ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి ఆమె రాజీనామాను తిరస్కరించారు.

సురేష్ ప్రభు: 2016లో నాలుగు రోజుల వ్యవధిలో కైఫియత్ ఎక్స్‌ప్రెస్, పూరీ-ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ అనే రెండు రైళ్లు పట్టాలు తప్పినందుకు నైతిక బాధ్యత వహిస్తూ 2017 ఆగస్టు 23న రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సురేష్ ప్రభు ప్రతిపాదించారు. వేచిచూడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరగా, ఆ తరువాతి నెలలో ప్రభుత్వానికి రాజీనామా చేశారు. కాన్పూర్ సమీపంలో పాట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ 14 కోచ్‌లు పట్టాలు తప్పడంతో 150 మంది చనిపోయారు. 1999 తర్వాత ఇది అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటి.

ఇప్పుడు కూడా అలాంటి ఘోర రైలు ప్రమాదం ఒడిశాలో జరిగింది. గత ఘటనల తరహాలోనే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఘటనకు నైతిక ప్రాతిపదికన ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..