Bihar: ఎన్నికల వేళ డ్రై స్టేట్ బిహార్‌లో లిక్కర్‌తో పాటు పెద్ద మొత్తంలో డ్రగ్స్ సీజ్
బిహార్‌లో అంతే, బిహార్‌లో అంతే మరి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ కరెన్సీ, లిక్కర్ మాత్రమే కాదు, అంతకంటే స్పెషల్ ఇంకోటి సిద్ధంగా ఉంది. ఓటర్లను దార్లో పెట్టుకోడానికి డ్రగ్స్‌ని కూడా ప్రయోగిస్తున్నాయి అక్కడి పొలిటికల్ పార్టీలు. అప్‌డేటవ్వడం అంటే ఇదేమరి.

బిహార్‌లో నామినేషన్ల పర్వం మొదలయ్యీ కాగానే, ప్రలోభాల పంపిణీ వేగం పుంజుకుంది. సాధారణంగా వస్తువులు, మద్యం, నగదు మాత్రమే ఓటర్లకు పంపిణీ చెయ్యడానికి పోటీ పడతారు నేతలు. కానీ, బిహార్‌లో మాదకద్రవ్యాలు కూడా సిద్ధం చేయడం ఆసక్తికకరంగా మారింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటినుంచి స్పెషల్ పికెట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఇప్పటివరకూ ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న 64 కోట్ల 13 లక్షలు సీజ్ చేశారు. ఇందులో 23.41 కోట్ల విలువైన మద్యం, 14 కోట్ల విలువైన వస్తువులు, 4.19 కోట్ల నగదు ఉన్నాయి. వీటితో పాటు 16.88 కోట్ల విలువైన డ్రగ్స్ కూడా దొరికాయి. పదేళ్లుగా బిహార్‌లో మద్యపాన నిషేధం అమలవుతున్నప్పటికీ, ఓటర్లను ప్రలోభపెట్టడానికి పొరుగురాష్ట్రాల నుంచి లిక్కర్ తరలిస్తున్నాయి పొలిటికల్ పార్టీలు.
ఇదిలా ఉంటే, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 753 మందిని అరెస్ట్ చేశారు. 13 వేల 587 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. వివరాలన్నిటినీ పాట్నాలో మీడియాకు షేర్ చేశారు అధికారులు. ఇండీ, ఎన్‌డీఏ కూటముల మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు. వచ్చేనెల ఆరున, 11న రెండుదశలుగా పోలింగ్ జరిగే బిహార్ ఎన్నికల్లో 14న ఫలితాలొస్తాయి. బిహార్‌లో అవినీతి రహితంగా ఎన్నికలు నిర్వహించాలని ఎక్సైజ్, ఐటీ, కస్టమ్స్, రెవెన్యూ, ఈడీ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈసీ.




