Kongu Nadu: దేశంలో మరోసారి తెరపైకి రాష్ట్ర విభజన అంశం.. తమిళనాట రాజకీయ రచ్చ

Kongu Nadu: దేశంలో మరోసారి రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చింది. అది కూడా బాషా వాదంతో ఐకమత్యం మెండుగా ఉన్న తమిళగడ్డపై.. గతంలో దక్షిణ తమిళనాడులో రెండో రాజధాని కావాలంటూ డిమాండ్ వినిపించినా ఆ వాదనకు పెద్దగా మద్దతు లభించిన పరిస్థితి లేదు.

Kongu Nadu: దేశంలో మరోసారి తెరపైకి రాష్ట్ర విభజన అంశం.. తమిళనాట రాజకీయ రచ్చ
Kongunadu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 12, 2021 | 10:58 AM

(మురళి చెన్నూరు, టీవీ9 ప్రత్యేక ప్రతినిధి)

దేశంలో మరోసారి రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చింది. అది కూడా బాషా వాదంతో ఐకమత్యం మెండుగా ఉన్న తమిళగడ్డపై.. గతంలో దక్షిణ తమిళనాడులో రెండో రాజధాని కావాలంటూ డిమాండ్ వినిపించినా ఆ వాదనకు పెద్దగా మద్దతు లభించిన పరిస్థితి లేదు.. తాజాగా అదే తమిళనాడు నుంచి కొత్త విభజన వాదం పురుడుపోసుకుంది. అదే కొంగునాడు.. పశ్చిమ తమిళనాడు ప్రాంతమైన కొంగు నాడు ఇపుడు ప్రత్యేక రాష్ట్రం కాబోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. దీనికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండగా నిలవడంతో తమిళనాట రాజకీయ రచ్చ నడుస్తోంది. ప్రత్యేక రాష్ట్రంపై జరుగుతున్న రాజకీయ రచ్చ ఎక్కడకు దారితీస్తుంది? ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్.

38 జిల్లాలు.. 39 లోక్ సభ స్థానాలు, 234 అసెంబ్లీ సీట్లు.. ఇక్కడ రాజకీయాలు ద్రవిడ సిద్ధాంతం అన్న వాదంతోనే నడుస్తుంటాయి. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే జాతీయ పార్టీలైనా ద్రవిడ పార్టీల పంచన చేరాల్సిందే. ఇది చరిత్ర చెప్పిన మాటేకాదు.. అక్కడి ఓటర్లు ప్రతి ఎన్నికల్లో ఇస్తున్న తీర్పు ద్వారా తేట తెల్లమైన విషయం. ఇటీవలి ఎన్నికల ద్వారా అన్నాడీఎంతో జట్టుకట్టి బరిలో నిలిచిన బిజెపి గట్టి ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.. అయితే 4 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని ఓటు బ్యాంక్ ను పెంచుకోగలిగింది..

తమిళనాడులో  పది జిల్లాల కొంగునాడు ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించేం ప్రయత్నాలు మొదలైందా? అంటే తాజా పరిణామాలు అవుననే వాదనకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఇటీవల కేంద్ర కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకున్న బీజేపీ తమిళనాడు మాజీ రాష్ట్రాధ్యక్షుడు ఎల్.మురుగన్‌ను తమిళనాడు కొంగునాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అధికారిక ప్రకటనల్లో కేంద్రం చూపడం వివాదానికి కారణమయ్యింది. రాష్ట్రంలో విభజన వాదాన్ని తెరమీదకు తీసుకొచ్చే కుట్రతోనే ఆయన్ను కొంగునాడుకు చెందిన వ్యక్తిగా కేంద్రం రికార్డుల్లో చూపుతోందని సోషల్ మీడియా వేదికగా బీజేపీపై విరుచుకపడ్డారు. దీంతో కొంగునాడును , ప్రత్యేక రాష్ట్రంగా లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్న చర్చ మొదలైంది.. ఆ చర్చ రాజకీయ రచ్చగా మారింది.. రాజకీయ వ్యూహకర్తలు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కొంగునాడు తమిళనాడు నుంచి విడిపోవడం ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

రాష్ట్రంలో పడమర ప్రాంతంగా ఉన్న కొంగు మండలాన్ని కొంగునాడు పేరిట ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణమయ్యాయి. శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ విజయం సాధించి అధికారం చేపట్టిన డీఎంకే కొంగునాడు ప్రాంతంలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేక పోయింది.. దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ హయాం నుంచి కొంగుమండలం అన్నాడీఎంకేకు కంచుకోటగా మారింది.. తాజాగా ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా కొంగునాడులో మాత్రం ఉనికిని చాటుకుంది. రాష్ట్ర పడమర ప్రాంతంగా ఉన్న కొంగు మండలంలో కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, ఈరోడ్‌, నామక్కల్‌, సేలం, ధర్మపురి, నీలగిరి, కరూర్‌, కృష్ణగిరి, దిండుగల్‌ జిల్లాలుండగా, ఈ మండలంలో 10 లోక్‌సభ స్థానాలు, 61 శాసనసభ స్థానాలున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో 40 స్థానాల్లో అన్నాడీఎంకే గెలుచుకోగా, 17 స్థానాల్లో డీఎంకే, ఒక్క స్థానంలో బీజేపీ నిలిచాయి. కొంగుమండలంలో పట్టుకోసం అటు అధికార డీఎంకే, ఇటు బీజేపీలు వ్యూహారచనలో ఉండగా బిజెపి నేతలు పెద్ద స్కెచ్ వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది.

K Annamalai, Tamilnadu bjp president

Tamil Nadu BJP State President K Annamalai

కొంగునాడు అభివృద్ధికి సీఎం స్టాలిన్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు.. అలాగే బిజెపి కూడా ఇక్కడ పట్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.. కొంగునాడుకి చెందిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ కి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించింది.. ఆ జాబితా వివరాలలో కూడా కొంగునాడు అని చూపించడం ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం.. తాజాగా అదే మండలానికి చెందిన అన్నామలైని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. తాజా ఎన్నికల్లో మండలంలో బీజేపీ ఓటు బ్యాంక్‌ పెరగడం, మిత్ర పక్షంగా ఉన్న ఎడిఎంకే కి మంచి పట్టు ఉండడం తో అదే కలిసొచ్చే అంశంగా భావిస్తోంది. ‘కొంగునాడు’ చర్చపైన డీఎంకే ఎందుకు ఆందోళన చెందుతోందని బీజేపీ ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రన్ ప్రశ్నించారు. అంతా తమిళనాడు, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయినా అక్కడి ప్రజల మనోభీష్టం మేరకు తెలంగాణ, యూపీలో రాష్ట్ర విభజన జరిగిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యతగా ఆయన చెప్పుకొచ్చారు.

కొంగునాడు అంశంపై మాట్లాడిన తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి కరు నాగరన్.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే జరిగిందని..తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఓ తార్కాణంగా పేర్కొన్నారు. ‘కొంగునాడు’ అన్న పదజాలాన్ని ఉపయోగిస్తే తప్పేంటని ప్రశ్నించారు.

బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు, లోలోపల జరుగుతున్న అంశాలను నిశితంగా పరిశీలిస్తోంది అధికార డిఎంకె.. తాజా పరిణామాలపై తీవ్రంగా స్పందించారు డిఎంకె నేత కనిమొళి.. అలాంటి ప్రయత్నాలు సాగవని..పూర్తి మెజారిటీ తో ఉన్మామని అది జరిగే పని కాదని గట్టిగా ఖండించారు. ఇక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్ అళగిరి కూడా బిజెపి తీరుపై మండిపడ్డారు.. తమిళనాడు ఒకే రాష్ట్రంగా ఉండాలనేదే ప్రజల కోరిక అన్నారు.

Also Read..

Rajinikanth Returns: తలైవా మళ్లీ వస్తున్నాడు.. రీ ఏంట్రీపై తేల్చేస్తానంటున్న సూపర్ స్టార్

జీవితంలో సమస్యలు చుట్టుముడితే ఏమి చెయ్యాలో చాణుక్యుడు చెప్పిన అద్భుతమైన నీతి కథ..