G20 Summit 2023: భారత్ వేదికగా జరిగిన జీ-20 సదస్సుతో మనకు ఏమైనా ఒరిగిందా..? దేశానికి లాభమా.. నష్టమా..?

G20 Summit 2023: జీ-20 ప్రెసిడెన్సీ మనం ఏం చేశామన్నదే లోకం గుర్తు పెట్టుకుంటుంది అన్నట్టుగా పనిచేసింది. దేశంలోని 60 నగరాల్లో సుమారు 200 సమావేశాలను నిర్వహించింది. జీ-20 సభ్యదేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాల ప్రతినిధులకు భారత్‌లోని సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని కలిగిన నేల ఇది అని ప్రపంచ దేశాలకు గుర్తుచేసింది. మిగతా ఖండాల్లో నాగరికత ఇంకా అభివృద్ధి చెందక ముందే ఎంతో..

G20 Summit 2023: భారత్ వేదికగా జరిగిన జీ-20 సదస్సుతో మనకు ఏమైనా ఒరిగిందా..? దేశానికి లాభమా.. నష్టమా..?
G20 Summit 2023
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Sep 12, 2023 | 1:23 PM

G20 Summit 2023: గత ఏడాది జీ-20 ప్రెసిడెన్సీ బాధ్యతలను ఇండోనేషియా నుంచి భారత్ అందుకున్నప్పుడు దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఇది భారత్‌కు లభించిన సువర్ణావకాశం అని కొందరు, రొటేషన్‌ ప్రకారం భారత్‌కు అధ్యక్ష బాధ్యతలు వచ్చాయి తప్ప అందులో ఏముంది గొప్ప అంటూ పెదవి విరిచినవారు మరికొందరు. ఇలా అందరూ విభిన్నరీతుల్లో తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం మాత్రం ఎవరి మాటలను లెక్కచేయకుండా.. ప్రెసిడెన్సీ ఎలా వచ్చిందన్నది కాదు.. ఆ అధ్యక్ష బాధ్యతల్లో మనం ఏం చేశామన్నదే లోకం గుర్తు పెట్టుకుంటుంది అన్నట్టుగా పనిచేసింది. దేశంలోని 60 నగరాల్లో సుమారు 200 సమావేశాలను నిర్వహించింది. జీ-20 సభ్యదేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాల ప్రతినిధులకు భారత్‌లోని సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని కలిగిన నేల ఇది అని ప్రపంచ దేశాలకు గుర్తుచేసింది. మిగతా ఖండాల్లో నాగరికత ఇంకా అభివృద్ధి చెందక ముందే ఎంతో పక్కాగా అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత కల్గిన దేశం భారత్ అని వారికి తెలియజెప్పింది. ఇదంతా ఒకెత్తయితే.. వర్తమాన ప్రపంచంలో భారత్ శక్తి, సామర్థ్యాలు ఏంటన్నది ఈ జీ-20 అధ్యక్ష బాధ్యతల ద్వారా చాటి చెప్పింది. వాటిలో మచ్చుకు ఓ 5 కీలకాంశాలను గమనిస్తే..

ప్రపంచ వేదికపై పెరిగిన ఆదరణ..

ఇండియా.. భారతదేశం.. అంటే పేదరికం, వెనుకబాటుతనం, అవిద్య, అనారోగ్యం.. ఇన్నాళ్లుగా అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలకు మన దేశంపై ఉన్న అభిప్రాయం ఇది. కానీ గత దశాబ్ద కాలంలో ఆ అభిప్రాయం పూర్తిగా మారుతూ వస్తోంది. అలాగని దేశంలో పేదరికం, వెనుక బాటుతనం నిర్మూలించేశామని అర్థం కానే కాదు. ప్రపంచానికి మన దేశంలోని బలహీనతలు మాత్రమే తెలిసే పరిస్థితి నుంచి బలాలను కూడా చాటుకునే స్థితికి చేరుకున్నాం. భారత్ ప్రపంచంలోనే అత్యధిక యువశక్తితో తొణకిసలాడుతున్న దేశం. ప్రపంచ మానవ వనరుల అవసరాలను తీర్చుతున్న దేశం. గణితం, సైన్స్, వైద్యం వంటి రంగాల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే కనిపిస్తున్నారు. కేవలం ఉద్యోగులుగానే కాదు, అసామాన్య నాయకత్వ లక్షణాలను చూపుతూ అనేక మల్టీ నేషనల్ కంపెనీలకు సీఈవోలుగా, అధిపతులుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో అమలు చేసిన సంస్కరణలు, కొత్త పన్ను విధానాల కారణంగా ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడింది. ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ చేరింది. కోవిడ్-19 చైనా సహా ప్రపంచ దేశాలకు శాపంగా మారితే, భారత్ అందులో నుంచి కూడా వరాన్ని వెతుక్కుంది. అప్పటి వరకు ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్ల కోసం కూడా దిగుమతులపైనే ఆధారపడ్డ పరిస్థితి నుంచి అతి తక్కువ కాలంలో దేశీయ అవసరాలు తీరిపోను ఎగుమతులు చేసే స్థితికి చేరుకుంది. అలాగే మన కంటే వెనుకబడిన దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తూ ఆయా దేశాల ఆదారాభిమానాలు చూరగొంది. అనేక ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, సరిగ్గా ఇదే సమయంలో జీ-20 ప్రెసిడెన్సీ భారత్‌కు దక్కడం మరో ఎత్తు. అందివచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంతో పాటు భారత్ తన సత్తాను చాటేందుకు అత్యుత్తమ ప్రపంచ వేదికగా మార్చుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ స్థాయి వేడుకలు, కార్యక్రమాలు నిర్వహించగలిగే సామర్థ్యంతో నిర్మించిన కొత్త ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ‘భారత మండపం’లో శిఖరాగ్ర సదస్సు నిర్వహించడం ఒకెత్తు.. అక్కడ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడం మరో ఎత్తు. శిఖరాగ్ర సదస్సుకు కొద్ది రోజుల ముందే ప్రపంచంలో ఏ దేశమూ అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధృవంపై భారత్ కాలుమోపడం ప్రపంచ పటంపై భారత ఖ్యాతిని మరింత పెంచింది. ఏడాదిన్నరకు పైగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచం రెండుగా చీలిపోయిన స్థితిలో రష్యా, అమెరికా, పాశ్చాత్య దేశాలు ఒక విషయంపై ఏకీభవించాయి. అది భారత్ కారణంగానే జరిగింది. భారత్‌లో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సులోనే జరిగింది. ఢిల్లీ డిక్లరేషన్‌లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సహా అన్ని అంశాలపై ఏకాభిప్రాయం తీసుకురావడం ద్వారా ప్రపంచ రాజకీయాల్లో భారత్ చెరగని ముద్ర వేసింది. భారతదేశం ఇప్పుడు వివిధ అంతర్జాతీయ సమస్యల విషయంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.

భిన్న ధృవాలకు దగ్గరై..

అమెరికా, రష్యా దేశాల మధ్య నెలకొన్న పరోక్ష యుద్ధం ఈనాటిది కాదు. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత అమెరికా, రష్యాలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పరం తీవ్రంగా పోటీపడ్డాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యా వెనుకబడినప్పటికీ.. ఈ రెండు దేశాల మధ్య వైరం మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్‌ను నాటో కూటమిలో చేర్చుకునే ప్రయత్నంతో ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధానికి పరోక్షంగా కారణమైన అమెరికా అంటే రష్యా మండిపడుతోంది. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునేందుకు యుద్ధానికి తెగబడ్డ రష్యా అంటే అమెరికా సహా పాశ్చాత్య దేశాలు అదేస్థాయిలో మండిపడుతున్నాయి. రష్యా వైపున చైనా, కొరియా, బెలారస్ వంటి కొన్ని దేశాలు నిలబడగా.. ప్రపంచంలోని మిగతా దేశాలు ఉక్రెయిన్ పక్షాన అమెరికా వైపున నిలబడ్డాయి. భారత్ మాత్రం ఏవైపునా నిలబడకుండా, ఏ ఒత్తిడికీ తలొగ్గకుండా తన వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పింది. దశాబ్దాలుగా ఆయుధాలు, యుద్ధ విమానాలు సహా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో టెక్నాలజీని సైతం అందజేస్తూ సహకరిస్తూ వచ్చిన రష్యాను భారత్ దూరం చేసుకోవాలని ఎప్పుడూ అనుకోదు. అనుకోలేదు. అలాగే ఐటీ విప్లవం తర్వాత అమెరికాతోనూ దేశానికి సత్సంబంధాలు చాలా కీలకంగా మారాయి. పరస్పరం శత్రుత్వాన్ని కలిగిన అమెరికా – రష్యాలతో ఏకకాలంలో స్నేహం చేయడం భారత్‌కు తప్ప ఎవరికీ సాధ్యం కాలేదు. G-20 గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేసిన ప్రకటన భారతదేశాన్ని అమెరికా, రష్యాలకు మరింత దగ్గర చేసింది. భారత్ ఇప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా రెండు అగ్రరాజ్యాలతో సత్సంబంధాలను కొనసాగించగల్గుతోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు, చమురు, ఎరువులు, రక్షణ ఒప్పందాలు, ఇతర విషయాలపై రష్యాతో వాణిజ్యం ఇప్పుడు భారతదేశానికి మరింత సులభంగా మారింది. అగ్రరాజ్యాలు రెండూ భారతదేశాన్ని సమానంగా విశ్వసించడానికి సిద్ధంగా ఉన్నాయి. శత్రువుకి స్నేహితుడు మనకు శత్రువు కానవసరం లేదన్నట్టుగా అమెరికా, రష్యా – రెండూ భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్

ప్రపంచంలోని అతి పెద్ద వినిమయ మార్కెట్లలో భారత్ ఒకటి. దేశ ఆదాయంలో అత్యధిక భాగాన్ని చమురు దిగుమతులకే ఖర్చు పెడుతున్న భారత్.. తన దేశ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో విక్రయించాలని కూడా కోరుకుంటోంది. జీ-20 అధ్యక్ష బాధ్యతల్లో భారత్ చేసిన ‘భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్’ కారిడార్ ప్రతిపాదన కేవలం మన దేశానికి మాత్రమే కాదు, కారిడార్‌లో ఉన్న అన్ని దేశాలకు విస్తృత ప్రయోజనాలను అందిస్తుంది. భారత్‌ను ఇతర ప్రపంచంతో వాణిజ్యపరంగా అనుసంధానించడంలో ఈ కారిడార్ ఎంతో కీలకం కానుంది. కారిడార్‌లో భాగంగా రైలు, నౌకాశ్రయం, రవాణా, వాయుమార్గాలు, డేటా కేబుల్ తదితర సాంకేతికతల ద్వారా మూడు ప్రాంతాలను అనుసంధానం చేయాలని నిర్ణయించారు. తద్వారా ఉపాధి, పెట్టుబడులు, వ్యాపార రంగాల్లో అపారమైన అవకాశాలు కలుగుతాయని అన్ని దేశాలూ భావిస్తున్నాయి.

రుణాలు మరిత సులభతరం

జీ-20 ఢిల్లీ డిక్లరేషన్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో సంస్కరణలు తీసుకురావాలని గట్టిగా చెబుతోంది. నిర్మాణాత్మక సంస్కరణలతో కొత్త నియమ, నిబంధనలు రూపొందించాలని సూచిస్తోంది. ఈ ఆర్థిక సంస్థల నుండి అభివృద్ధి పనులకు నిధులు పొందడం భారత్‌తో పాటు అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలకు కూడా సులభం కానుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ చెప్పే అంత్యోదయ సిద్ధాంతం మేరకు అట్టడుగున ఉన్న ప్రజలకు కూడా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడానికి ఆస్కారం కల్గుతుంది. రానున్న రోజుల్లో భారత్ మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్కరణలు కీలకంగా మారతాయి. మొత్తంగా భారత్ జీ-20 శిఖరాగ్ర సదస్సు ద్వారా ప్రజలకు అపారమైన అవకాశాలను తెచ్చిపెట్టాలని చూస్తోంది. ప్రపంచ అవసరాలను అర్థం చేసుకుంటూ, అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తే భారతీయ వ్యాపారులు, మానవ వనరులకు అవకాశాలకు కొదవే ఉండదు.

విజయంతో పెరిగిన బాధ్యత

ఒక విజయం తర్వాత బాధ్యత మరింత పెరుగుతుంది. ఇప్పుడు భారత్ విషయంలోనూ అదే జరుగుతోంది. G-20 అద్భుత విజయం ప్రపంచంలో భారతదేశ స్థాయిని పెంచింది. ఇప్పుడు భారత్‌ను ప్రపంచ దేశాలు అగ్రరాజ్యాలతో సమానంగా చూస్తున్నాయి. ఇలాంటప్పుడు భారత్ తన దేశీయ సమస్యలపై ఎలా ముందుకు వెళ్తుందనే అంశాలపై ప్రపంచదేశాల నిశిత పరిశీలన ఉంటుంది. అది అంతర్గత ప్రజాస్వామ్యం లేదా వైవిధ్యంతో కూడిన బహుళ సంస్కృతి.. ఏ అంశమైనా సరే.. ప్రభుత్వ విధానాలు, చర్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తాయి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో