Sahitya Academy Award: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన.. తెలుగులో నిఖిలేశ్వర్‌కు దక్కిన పురస్కారం..
Kendra Sahitya Academy Awards: కేంద్ర సాహిత్య అకాడమీ.. అవార్డులకు ఎంపికైన వారి పేర్లను ప్రకటించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు - 2020 కు సంబంధించిన జాబితాలో తెలుగు రచయిత..
Kendra Sahitya Academy Awards: కేంద్ర సాహిత్య అకాడమీ.. అవార్డులకు ఎంపికైన వారి పేర్లను ప్రకటించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2020 కు సంబంధించిన జాబితాలో తెలుగు రచయిత నిఖిలేశ్వర్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘అగ్నిశ్వాస’ కవితా సంపుటికి ఈ అవార్డు వరించింది. దేశవ్యాప్తంగా 20 అధికార భాషల్లో రచయితలకు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించింది. తెలుగులో నిఖిలేశ్వర్‌కు ఈ పురస్కారం దక్కింది. ఆయనతోపాటు ఆంధ్రప్రదేవ్‌కు చెందిన మానస ఎండ్లూరి ‘మిళింద’ (లఘు కథ)కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కగా, కన్నెగంటి అనసూయ ‘స్నేహితులు’ (లఘు కథ) కు బాల సాహిత్యం విభాగంలో అవార్డు వరించింది.
నిఖిలేశ్వర్ ప్రస్థానం.. నిఖిలేశ్వర్ అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ఆయన స్వస్థలం యాదాద్రి జిల్లా వీరవల్లి గ్రామం. 82 ఏళ్ల నిఖిలేశ్వర్ దిగంబర కవితోద్యమ సారథుల్లో ఒకరు. ఏనాటికైనా ఈ అగ్నిశ్వాస నా అంతరంగ భాష.. శ్రమ జీవన పోరాటాల శ్వాస అంటూ నిఖిలేశ్వర్ సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై ‘అగ్నిశ్వాస’ కవితలు రాశారు. నిఖిలేశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, బీఈడీ, హిందీ భూషణ్ కోర్సులు పూర్తి చేశారు. గోల్కొండ పత్రికలో సబ్-ఎడిటర్‌గా కూడా పనిచేశారు. యాదవరెడ్డిగా తెలుగు సాహితీ లోకంలో అడుగుపెట్టిన ఆయన.. 1965లో ఆరుగురు దిగంబర కవుల్లో ఒకరిగా నిఖిలేశ్వర్ పేరుతో కవితా సృజన ప్రారంభించారు. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా కూడా నిఖిలేశ్వర్ వ్యవహరించారు.
వీరప్ప మొయిలీకి.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీకి కన్నడ కేటగిరీలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఆయన రచించిన ‘శ్రీ బహుబలి అహింస దిగ్విజయం’ పుస్తకానికి ఈ పురస్కారం వరించింది. ప్రముఖ రచయిత్రి అరుంధతి సుబ్రమణ్యం రాసిన ‘వెన్ గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్’కు ఇంగ్లీష్‌లో పురస్కారం లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన వారికి రూ.లక్ష బహుమతితోపాటు జ్ఞాపికను అందిస్తారు. దీంతోపాటు యువ, బాల సాహిత్యం విభాగంలో అవార్డులు పొందిన వారికి రూ.50 వేలు బహుమతిని అకాడమీ నుంచి ఇవ్వనున్నారు.
Also Read: