kashmir pandit killed: జమ్ముకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కశ్మీర్ పండిట్ దారుణ హత్య..
kashmir pandit killed: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు కశ్మీర్ పండిట్లపై మళ్లీ పంజా విసిరారు. బుడ్గాంలో టెర్రరిస్టుల కాల్పుల్లో రాహుల్‌భట్ అనే కశ్మీర్ పండిట్ చనిపోయాడు.
kashmir pandit killed: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు కశ్మీర్ పండిట్లపై మళ్లీ పంజా విసిరారు. బుడ్గాంలో టెర్రరిస్టుల కాల్పుల్లో రాహుల్‌భట్ అనే కశ్మీర్ పండిట్ చనిపోయాడు. జమ్ముకశ్మీర్‌లో కశ్మీర్ పండిట్లను ఉగ్రవాదులు మళ్లీ టార్గెట్ చేశారు. బుడ్గాంలో కశ్మీర్ పండిట్ రాహుల్‌భట్‌ను కాల్చిచంపారు ఉగ్రవాదులు. రాహుల్‌భట్ పనిచేస్తున్న తహసిల్ కార్యాలయంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కార్యాలయం లోకి వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో రాహుల్‌భట్ గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించినప్పటికి లాభం లేకుండాపోయింది. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగిని కాల్చిచంపడం కశ్మీర్‌లో తీవ్ర కలకలం రేపింది.
జమ్మూలోని బడ్గామ్ జిల్లాలో చదూరా గ్రామంలోని ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. రాహుల్‌భట్‌ని పాయింట్ బ్లాక్ రేంజ్‌లోనే గురిపెట్లి కాల్చివేశారు. ఇద్దరు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ ఘటన తరువాత జమ్ముకశ్మీర్‌లో పండిట్లు ఆందోళనకు దిగారు. జమ్ముశ్రీనగర్ హైవేపై వాళ్లు ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడ్డ వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. కాంగ్రెస్ , నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల నేతల ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. జమ్ముకశ్మీర్‌లో పండిట్లకు రక్షణ కల్పించినట్టు కేంద్రం ప్రగ్భలాలు పలుకుతోందని , కాని ఇప్పుడే టెర్రరిస్టుల దాడులు పెరిగాయన్నారు మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా.
ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన రాహుల్‌భట్‌కు భార్య , కూతురు ఉన్నారు. ఈ దాడి తరువాత ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాహుల్‌భట్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్‌ను చేపట్టాయి. పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కశ్మీరీ పండిట్‌లు, వలస కార్మికులను లక్ష్యంగా చేసుకొని గతకొన్ని నెలలుగా అక్కడ దాడులు ఎక్కువైనట్లు నివేదికలు వస్తున్నాయి. ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు చెందిన వారిపై ముష్కరులు ఇటువంటి దాడులకు తెగబడుతున్నారనే వార్తలు ఎక్కువయ్యాయి. అయితే, జమ్మూ కశ్మీర్‌లో దాదాపు 168 మంది ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తుండగా.. వారిలో 75 మందిని ఈ ఏడాది హతమార్చినట్లు పోలీసులు ఓ నివేదికలో పేర్కొన్నారు.