Anti-Conversion Bill: మతమార్పిడి నిరోధక బిల్లుపై కర్ణాటకలో రగడ.. వ్యతిరేకంగా మైనారిటీ సంఘాలు భారీ ర్యాలీ!
Karnataka Protests: కర్ణాటకలో బలవంతపు మతమార్పిడి నిరోధక బిల్లుపై వివాదం కొనసాగుతోంది. మంగళవారం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కర్ణాటక ప్రభుత్వం. గురువారం అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరుగుతుందని స్పీకర్ తెలిపారు.
Karnataka Protests: కర్ణాటకలో బలవంతపు మతమార్పిడి నిరోధక బిల్లుపై వివాదం కొనసాగుతోంది. మంగళవారం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కర్ణాటక ప్రభుత్వం. గురువారం అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరుగుతుందని స్పీకర్ తెలిపారు. అయితే కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బెల్గాంలో జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మైనారిటీలను టార్గెట్ చేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బెంగళూర్‌లో మతమార్పిడి నిరోధక బిల్లుకు వ్యతిరేకంగా క్రైస్తవ సంఘాలు , లెఫ్ట్ పార్టీలు నిరసన చేపట్టాయి. బిల్లును వెనక్కి తీసుకోవాలని క్రైస్తవ మతపెద్దలు డిమాండ్ చేశారు. తమ వర్గాన్ని టార్గెట్ చేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు.
మరోవైపు, ఇప్పటికే కర్ణాటకలో చర్చిలపై దాడులు పెరిగాయని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈ బిల్లును తెచ్చారని ఆరోపించారు. అసెంబ్లీలో ఈ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. బిల్లు ప్రతులను సభలోనే చింపేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే శివకుమార్. అయితే బీజేపీ మాత్రం బిల్లను పూర్తిగా సమర్ధించింది. బలవంతపు మతమార్పిడిలను నిరోధించేందుకే ఈ బిల్లును తెచ్చామని తెలిపారు సీఎం బస్వరాజ్ బొమ్మై. బిల్లుతో ఎవరిని టార్గెట్ చేయడం లేదన్నారు. బలవంతప మతమార్పిడిలు నిరోధించేందుకు ఈ బిల్లును తెచ్చినట్టు స్పష్టం చేశారు. మత స్వాతంత్య్ర సంరక్షణ హక్కు చట్టం 2021 ముసాయిదాలో బలవంతపు మతమార్పిడిలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ప్రతిపాదించారు. ఎస్సీ ,ఎస్టీ , ,మైనర్లు , మహిళలను బలవంతంగా మతమార్పిడి చేస్తే గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానాను వేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ఇతర వర్గాల వారిని బలవంతంగా మతం మారిస్తే…3 నుంచి 5 ఐదేళ్లవరకు జైలుశిక్ష. 25 వేల రూపాయల జరిమానా విధిస్తారు. ఇక సామూహికంగా మత మార్పిడులు చేస్తే… 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించేలా బిల్లు రూపొందించారు.