Karnataka: ‘గాలి’ ఇంట రసవత్తర రాజకీయం.. రాబోయే ఎన్నికల్లో వదినా, మరిది మధ్య పోటీ..!
ఒకే కుటుంబసభ్యులు వేరు వేరు పార్టీల్లో ఉండటం సహజమే. కానీ ఒకే చోట పోటీ చేయాల్సి వస్తే.. త్వరలో రాబోయే ఎన్నికల్లో కర్నాటకలోని బళ్లారిలో ఇదే జరగబోతోంది.
ఒకే కుటుంబసభ్యులు వేరు వేరు పార్టీల్లో ఉండటం సహజమే. కానీ ఒకే చోట పోటీ చేయాల్సి వస్తే.. త్వరలో రాబోయే ఎన్నికల్లో కర్నాటకలోని బళ్లారిలో ఇదే జరగబోతోంది. గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబసభ్యుల మధ్యే ఈ ఫ్యామిలీ పాలిటికల్ సీన్స్ చూడబోతున్నాము. వదినా, మరిది మధ్య హైవోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయక్కడ.
ఆసక్తిగా మారిన బళ్లారి రాజకీయం..
గాలి జనార్ధన్ రెడ్డి.. కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పేరు ఇది. బీజేపీలో కొనసాగుతున్న ఈయన అనూహ్యంగా సొంత పార్టీ పెట్టి అందరికీ షాక్ ఇచ్చారు. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీ పెట్టారో లేదో.. అంతే దూకుడు కొనసాగిస్తున్నారు. ఎలక్షన్‌కు ఏడాది ముందు నుంచే అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు గాలి జనార్ధన్ రెడ్డి. అందులో మొదటగా.. ఆయన భార్య అభ్యర్ధిత్వాన్నే ప్రకటించారు. బళ్లారి నుంచి అరుణ లక్ష్మీ పోటీ చేయబోతుందని చెప్పేశారు.
ఇండిపెండెంట్‌గా అయినా వదిన మీద పోటీ చేస్తా..
బళ్లారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా గాలి జనార్ధన్ రెడ్డి తమ్ముడు సోమశేఖర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పుడు తమ్ముడి మీద పోటీగా.. తన భార్యను దింపబోతున్నారు గాలి జనార్ధన్ రెడ్డి. అయితే గాలి జనార్ధన్ రెడ్డి తమ్ముడు.. గాలి సోమశేఖర్ కూడా తగ్గేదే లే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి తానే పోటీ చేస్తానంటున్నారు. ఒకవేల బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా అయినా వదిన మీద పోటీ చేస్తాననడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు హరపనహళ్లిలో మరో సోదరుడు గాలి కరుణాకరరెడ్డి, చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరులో గాలికి అత్యంత ఆప్తుడైన బి. శ్రీరాములు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో జనార్ధనరెడ్డి ఎవరిని బరిలోకి దింపుతారనేది ఆసక్తిని రేపుతోంది.
విజయానికి అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులు..
కోర్టు ఆదేశాల కారణంగా బళ్లారి జిల్లాలోకి ప్రవేశించడానికి అనుమతి లేకపోవడంతో.. పక్కనే ఉన్న కొప్పల్ జిల్లా కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. అయితే తన పార్టీ ఎవరిపైనా పగ తీర్చుకోవడానికి కాదనీ. విజయానికి అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామని తేల్చిచెప్పారు గాలి జనార్ధన్ రెడ్డి. అంతే కాకుండా త్వరలోనే పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తామని, పార్టీ అభ్యర్థులను నిలబెట్టే నియోజకవర్గాలను కూడా నిర్ణయించబోతున్నారు. కొప్పళ జిల్లా ఆనెగుండిలో పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
ఉత్తర కర్ణాటకలోని పలు నియోజకవర్గాల్లో పర్యటన..
కర్ణాటకలో 2008లో బీజేపీ అధికారంలోకి తీసుకురావడంలో గాలి జనార్ధన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయ్యాక దశాబ్ద కాలం పాటుక్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత నెలలో సొంత పార్టీ స్థాపించిన గాలి జనార్ధన్ రెడ్డి.. తన పార్టీ పునాదిని బలోపేతం చేసుకునేందుకు ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. సొంత కుటుంబసభ్యుల మధ్యే పోటీ ఏర్పడే అవకాశాలు ఉండటంతో కన్నడ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..