Karnataka Elections: కర్నాటక కమలంలో కలకలం.. తగ్గేదేలే అంటూ నయా స్ట్రాటజీతో దూసుకెళ్తున్న అధిష్టానం..

కర్నాటక కమలంలో కలకలం చోటుచేసుకుంది. కొత్తవారిని ప్రోత్సహించాలన్న బీజేపీ హైకమాండ్‌ ఆలోచన కర్నాటకలో అసమ్మతి జ్వాలలు రగిలిస్తోంది. తిరుగుబాటు జెండా ఎగరేస్తామని చెప్పిన ఒక్కరిద్దరూ దారిలోకి వచ్చినా మాజీ సీఎం శెట్టర్‌ లాంటి వాళ్లు పెద్ద షాకే ఇచ్చారు. చివరి ఛాన్స్‌ ఇవ్వాలని శెట్టర్‌ చేసిన విజ్ఞప్తిని కమలం..

Karnataka Elections: కర్నాటక కమలంలో కలకలం.. తగ్గేదేలే అంటూ నయా స్ట్రాటజీతో దూసుకెళ్తున్న అధిష్టానం..
Karnataka Elections Bjp
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 16, 2023 | 6:15 PM

కర్నాటక కమలంలో కలకలం చోటుచేసుకుంది. కొత్తవారిని ప్రోత్సహించాలన్న బీజేపీ హైకమాండ్‌ ఆలోచన కర్నాటకలో అసమ్మతి జ్వాలలు రగిలిస్తోంది. తిరుగుబాటు జెండా ఎగరేస్తామని చెప్పిన ఒక్కరిద్దరూ దారిలోకి వచ్చినా మాజీ సీఎం శెట్టర్‌ లాంటి వాళ్లు పెద్ద షాకే ఇచ్చారు. చివరి ఛాన్స్‌ ఇవ్వాలని శెట్టర్‌ చేసిన విజ్ఞప్తిని కమలం పెద్దలు పరిగణనలోకి తీసుకోలేదు. పార్టీని వీడిన నేతలకు కర్నాటక ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్తారని బీజేపీ నేతలు శపిస్తున్నారు.

ఊరందరది ఒకదారి ఉలిపికట్టెది ఒకదారి అన్నట్టుగా ఉంటుంది కర్నాటక రాజకీయం. కేరళ, తమిళనాడు తరహాలోనే ఇక్కడ రాజకీయం రంజుగా ఉంటుంది. 1985 నుంచి ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారాన్ని ఇవ్వలేదు కన్నడ ఓటర్లు. కాని ఈసారి ఆ ట్రెండ్‌ను మార్చాలని కమలం పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో గుజరాత్‌లో అనుసరించిన తరహాలోనే చాలా చోట్ల సిట్టింగ్స్‌కు టికెట్‌ నిరాకరించింది. ఈ ప్రయోగం కారణంగా చాలా నియోజకవర్గాల్లో కమలానికి ఎదురు గాలులు వీస్తున్నాయి.

మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవదికి టికెట్‌ నిరాకరించడం ఆయన వెంటనే కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ పొందడం అంతే వేగంగా జరిగిపోయింది. తాజాగా మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌కు బీజేపీ అధిష్ఠానం టికెట్‌ నిరాకరించింది. పార్టీలో సీనియర్‌నైనా తనకు కనీస గౌరవం దక్కడం లేదని శెట్టర్‌ వాపోయిన పరిస్థితి. ఎమ్మెల్యే పదవికి శెట్టర్‌ రాజీనామా చేశారు. వయస్సు కారణంగా ఆయన టికెట్‌ నిరాకరిస్తున్నట్టు బీజేపీ హైకమాండ్‌ చెప్తోంది. ఆయనకు బదులు ఆయన కుటుంబంలో ఎవరికైనా టికెట్‌ ఇస్తామని నచ్చజెప్పింది. కాని, తన కుటుంబంలోని వారికి రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని, ఇది తన చివరి ఎన్నిక కాబట్టి టికెట్‌ ఇవ్వాలని శెట్టర్‌ కోరారు. కానీ, ఎందుకో బీజేపీ హైకమాండ్‌ ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది.

ఇవి కూడా చదవండి

మరి 76 ఏళ్ల వ్యక్తికి టికెట్‌ ఎలా ఇచ్చారు? తిప్పారెడ్డి వయస్సు 76 ఏళ్లు, తిప్పేస్వామి 76 ఏళ్లు, 72 ఏళ్లు ఉన్న అనేక మంది ఉన్నారు. నా వయస్సు 67 మాత్రమే. నా కంటే పెద్దవాళ్లు చాలా మంది ఉన్నారు. 72, 73, 76 ఏళ్ల వాళ్లను ఎందుకు మార్చలేదు? అనేది శెట్టర్ వాదన. మరో వైపు పార్టీలో, ప్రభుత్వంలో ఎన్నో పదవులిచ్చిన గౌరవించిన శెట్టర్‌, లక్ష్మణ్‌ సవదిని కన్నడ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని సీనియర్‌ నేత యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘కర్నాటక ప్రజలు జగదీశ్‌ శెట్టర్‌, లక్ష్మణ్‌ సవదిని క్షమించరు. నేను వాళ్ల నియోజకవర్గాలకు వెళ్తాను. వాళ్లకు మేము ఏం హామీలిచ్చాం, వాళ్లు ఎందుకు పార్టీని వీడారు. అన్ని విషయాలు నేను ప్రజలకు చెప్తాను. మా వాదనను ప్రజలు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను.’ అని యడ్యూరప్ప అన్నారు.

దక్షిణాదిన బీజేపీకి గట్టి పట్టున్న రాష్టం కర్నాటక ఒక్కటే. దక్షిణ భారతదేశంలో ఈ ఒక్క రాష్ట్రంలోనే బీజేపీ అధికారంలో ఉంది. అందుకే కర్నాటకలో పట్టు సడలిపోకుండా చూసేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ చరిష్మాను గట్టిగా నమ్ముకున్న బీజేపీ.. కర్నాటకలో ప్రయోగాలు చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తోంది. ఇందులో భాగంగానే యువతను ప్రోత్సహించేందుకు వ్యూహరచన చేసింది. ఇందులో భాగంగానే సీనియర్లు, సిట్టింగ్‌లకు టికెట్‌ నిరాకరించింది. 18 స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను బీజేపీ పక్కన పెట్టింది. ఈ ఎన్నికల్లో 67 మంది కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. ఇప్పటి వరకు గెలవని కోస్తా, మల్నాడ్‌ ప్రాంతాల్లో కొత్తవారిని దింపి ప్రయోగం చేయబోతోంది. కొత్త వారిని బరిలోకి దించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవాలన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది.

కర్నాటకలో ఇప్పటికే నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏప్రిల్‌ 20 చివరి తేదీ. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. మరి ముక్కోణపు పోటీలో కన్నడ ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు? అసమ్మతిని కంట్రోల్‌ చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..