Gutta Jwala: ‘మీ భార్య ముఖాన్ని ఎందుకు చూడకూడదు అనుకుంటున్నారు’.. ఇచ్చిపడేసిన గుత్తా జ్వాల
వారంలో ఒకరోజు మీకు సెలవు ఎందుకు..? ఆదివారాల్లో ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? అదేదో ఆఫీస్‌లో కూర్చుండి.. ఈ మాటలు ఎవరైనా అంటే ఒళ్లు మండిపోతుంది..! - ఆదివారాలు ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు..? భార్యల ముఖాలు ఏం చూస్తారు? ఈ మాటలు చెప్పినవారిని ఉతికేయాలన్నంత కోపం వస్తుంది..! అయితే ఇలా వారం మొత్తం 90 గంటలపాటు ఉద్యోగులతో గొడ్డుచాకిరీ చేయించాలన్న ఆలోచన L&T చైర్మన్‌కు వచ్చింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
దేశంలో ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన L&Tకి మంచి పేరుంది. గౌరవనీయమైన స్థానం ఉంది. కానీ ఆ సంస్థ చైర్మన్ S.N. సుబ్రహ్మణ్యన్ వివాదాస్పదన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు ఆదివారాలు వద్దే వద్దు అంటున్నారు. దేశంలో ఒకవైపు వారానికి ఐదురోజుల పనిదినాల కల్చర్ వస్తోంది. అంటే వారానికి రెండు వీక్లీ ఆఫ్‌లు అన్నమాట. రెండు కాదు కదా, ఒక వీక్లీ ఆఫ్ కూడా ఎందుకన్నది ఆయన వాదన
శనివారం నాడు కూడా ఉద్యోగులను పనిచేయాలని ఎందుకు అడుగుతున్నారు అని ఆ సంస్థ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ సుమీత్ ఛటర్జీ ఆయన్ను అడిగారు. దీనికి L&T చైర్మన్ చెప్పిన సమాధానం షాకింగ్‌గా ఉంది. ఆదివారాలు ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? భార్యల ముఖాలు ఎంతకని చూస్తారు అని L&T చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఎదురు ప్రశ్నించారు.
పనిగంటల గురించి కొన్నినెలల కిందట పెద్దదుమారం రేగింది. వారానికి 70 గంటల పనిదినాలు కావాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అంటేనే దుమారం రేగింది. కానీ L&T చీఫ్ సుబ్రహ్మణ్యన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ అగ్గిని రాజేశాయి. ఆయన చెప్పిన ప్రకారం ఉద్యోగులు వారమంతా పనిచేయాలి. ఆదివారాలు కూడా వీక్లీ ఆఫ్‌లు ఉండొద్దు. అంటే రోజుకు 12 గంటల 8 నిమిషాలు పనిచేయాలి..
L&T చైర్మన్ గొడ్డుచాకిరీ ఆలోచనా విధానంపై విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ స్పందించారు. ఇలాంటి సీనియర్ పొజిషన్లలో ఉన్న వ్యక్తులు ఇంత దారుణంగా మాట్లాడటం షాకింగ్‌గా ఉందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటు స్పోర్ట్స్ స్టార్ గుత్తాజ్వాల కూడా సుబ్రహ్మణ్యన్‌పై మండిపడ్డారు. ముందు ఆయన తన భార్య ముఖాన్ని ఎందుకు చూడకూడదని అనుకుంటున్నారని ప్రశ్నించారు. కేవలం ఆదివారం మాత్రమే ఆయన తన భార్యను ఎందుకు చూడాలని అనుకుంటున్నారు అని ఆమె ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో కొందరు వ్యక్తులు- మహిళలపై తమ ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని గుత్తా జ్వాల మండిపడ్డారు. ఇలాంటి ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్ద వ్యక్తులు మానసిక ఆరోగ్యం, మానసిక విశ్రాంతిని పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
I mean…first of all why shouldn’t he stare at his wife…and why only on a Sunday!!! its sad and sometimes unbelievable that such educated and people at highest positions of big organisations are not taking mental health and mental rest seriously…and making such misogynistic…
— Gutta Jwala 💙 (@Guttajwala) January 10, 2025
L&T చైర్మన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను కార్పొరేట్ ప్రముఖులు కూడా తప్పుబడుతున్నారు. వృత్తి-వ్యక్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేయడం ఆప్షనల్ కాదనీ, అత్యవసరమని ఆయన Xలో పోస్ట్ చేశారు. సుబ్రహ్మణ్యన్ చెప్పిన ప్రకారం ఆదివారాన్ని సన్‌డే అని కాకుండా, సన్ డ్యూటీ అని పిలవాలేమో అని ఎద్దేవా చేశారాయన. హార్ట్ వర్క్‌ను, స్మార్ట్ వన్‌ను మిళితం చేసి పనిచేయడాన్ని తాను నమ్ముతాననీ, కానీ జీవితాన్ని మాత్రం ఆఫీస్ షిఫ్ట్‌లా మార్చడం సరికాదని హర్ష్ గోయెంకా చెప్పారు.
ఆదివారాలు సెలవులు తీసుకోకుండా, వారానికి 90 గంటలు పనిచేయాలన్న సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలతో దుమారం రేగుతోంది. అయితే L&T సంస్థ- బాస్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. అసాధారణ ఫలితాలు రావాలంటే, అసాధారణ ప్రయత్నాలు చేయాలని ఆ సంస్థ స్టేట్‌మెంట్ ఇచ్చింది. తమ చైర్మన్ వ్యాఖ్యలను విస్తృతార్థంలో చూడాలని తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.