AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Presidential Elections: యశ్వంత్ సిన్హాకు షాక్.. ఎన్డీయే అభ్యర్థి ముర్ముకు మద్దతు తెలిపిన మరో రెండు విపక్ష పార్టీలు..

దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకు విపక్ష కూటమితో కలిసి ఉన్న పార్టీలు సైతం ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలుపుతుండటం గమనార్హం. తాజాగా మరో రెండు పార్టీలు ముర్ముకు మద్దతునిస్తూ ప్రకటించాయి.

Presidential Elections: యశ్వంత్ సిన్హాకు షాక్.. ఎన్డీయే అభ్యర్థి ముర్ముకు మద్దతు తెలిపిన మరో రెండు విపక్ష పార్టీలు..
Presidential Elections
Shaik Madar Saheb
|

Updated on: Jul 15, 2022 | 12:29 PM

Share

Presidential Elections 2022 – Droupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలకు మూడు రోజులే సమయం ఉంది. దీంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్ష కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇప్పటికే తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ ముందుకువెళ్తున్నారు. ఈ తరుణంలో దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకు విపక్ష కూటమితో కలిసి ఉన్న పార్టీలు సైతం ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలుపుతుండటం గమనార్హం. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయి.. శివసేన తిరుబాటు షిండే వర్గం – బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు ఏపీలోని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా ముర్ముకు మద్దతు తెలపడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ కూడా ముర్ముకే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. రెండు పార్టీలు కూడా ద్రౌపది ముర్ము ప్రచార సభల్లో వేర్వేరుగా పాల్గొని.. మద్దతిస్తున్నట్లు ప్రకటించాయి. అంతకుముందు ఒడిశాలోని అధికార బీజేడీ సైతం ముర్ముకు మద్దతునిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ముర్ము విజయం దాదాపుగా ఖారారైనట్లు పేర్కొంటున్నారు బీజేపీ నేతలు..

మరో రెండు పార్టీల మద్దతు..

ఈ క్రమంలోనే విపక్షాల అభర్థి యశ్వంత్ సిన్హాకు మరో షాక్ తగిలింది. మరో రెండు ప్రధాన విపక్ష పార్టీలు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతునిస్తున్నట్లు ప్రకటించాయి. ముర్ముకు మద్దతిస్తున్నట్లు జార్ఖాండ్ అధికారపార్టీ జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం ప్రకటించింది. గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన ముర్ము ఇటీవల రాష్ట్రంలో పర్యటించి అధికార పార్టీ JMM మద్దతు కోరారు. ఈ సమయంలో ఆమె JMM అధ్యక్షుడు శిబు సోరెన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కలిసి మాట్లాడారు. అయితే.. జార్ఖండ్‌లో కాంగ్రెస్ మద్దతుతో జేఎంఎం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. అటు కాంగ్రెస్‌తో జతకడుతూనే జేఎంఎం ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలపడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. యూపీలోని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ మిత్రపక్షమైన ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పార్టీ నాయకులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భర్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ శాసనసభలో SBSPకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలకు మూడు రోజుల సమయం ఉంది. ఈ సమయంలో కూడా యశ్వంత్ సిన్హాకు పలు విపక్ష పార్టీలు షాకిస్తుండం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..