Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోకి విదేశీ ఉగ్రవాదులు.. సరిహద్దుల్లో పొంచి ఉన్న ముప్పు..

జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖకు సరిహద్దుగా ఉన్న ఉత్తర కాశ్మీర్ కుప్వారా, బారాముల్లా, బండిపోరా జిల్లాల్లో తిరుగుబాటు-సంబంధిత హింస గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మే నెలలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య అనేకసార్లు కాల్పులు జరిగాయి.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోకి విదేశీ ఉగ్రవాదులు.. సరిహద్దుల్లో పొంచి ఉన్న ముప్పు..
Kashmir Encounter
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 07, 2022 | 8:50 PM

Foreign Terrorists in Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సామాన్య పౌరులను, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు సైతం అప్రమత్తమై.. ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి.. తాజాగా.. మంగళవారం ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఉన్న ఒక విదేశీ ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయని అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో అతని సహచరుడు కూడా చనిపోయాడు. సరిహద్దు కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖకు సరిహద్దుగా ఉన్న చక్తారాస్ కండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన బలగాలు ఈ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. జమ్మూకశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందం అనుమానాస్పద స్థలంలో సెర్చింగ్ నిర్వహించగా.. ఈ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

హత్యకు గురైన వారిలో ఒకరు పాకిస్థాన్‌కు చెందిన తుఫైల్‌గా గుర్తించినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కశ్మీర్) విజయ్ కుమార్ తెలిపారు. రెండో ఉగ్రవాది ఎవరనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు.

ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో ఒక విదేశీ ఉగ్రవాదిని కాల్చి చంపిన 10 గంటలలోపే కాల్పులు ప్రారంభమయ్యాయి. సోపోర్‌లోని జలూరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడ మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిపారు. వారిలో ఒకరు విదేశీయుడు తప్పించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. హతమైన పాకిస్తానీ ఉగ్రవాది నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం.. అతను పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చెందిన హంజల్లాగా గుర్తించారు. అతని వద్ద నుంచి ఒక ఎకె రైఫిల్, 5 మ్యాగజైన్‌లతో పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఉత్తర కాశ్మీర్‌లో విదేశీ ఉగ్రవాదులు పెరగడం, జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా ఆయుధాలను సరఫరా చేయడానికి ప్రయత్నించడం వల్ల ఇండో-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం దెబ్బతిన్నదని వ్యాసకర్త జహంగీర్ అలీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన న్యూస్9 (news9live.com) కు ప్రత్యేక వ్యాసం రాశారు. ఈ సందర్భంగా పలు విషయాలను ప్రస్తావించారు.

జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖకు సరిహద్దుగా ఉన్న ఉత్తర కాశ్మీర్ కుప్వారా, బారాముల్లా, బండిపోరా జిల్లాల్లో తిరుగుబాటు-సంబంధిత హింస గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మే నెలలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య అనేకసార్లు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనల పెరుగుదలను చూస్తుంటే.. ఈ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల బృందం కలపాలు పెరిగినట్లు ఆందోళన వ్యక్తమవుతోంది.

అధికారిక సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో కనీసం 27 మంది విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. కేవలం మే నెలలో జరిగిన 17 ఎన్‌కౌంటర్లలో భద్రతా బలగాలు 27 మంది ఉగ్రవాదులను హతమార్చారు. ఉత్తర కాశ్మీర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్లు చాలా జరిగాయి.

మే 11న, ఉత్తర కాశ్మీర్‌లోని బందిపొరలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కొత్తగా చొరబడిన స్థానిక ఉగ్రవాదిని కాల్చి చంపగా, మరో ఇద్దరు తప్పించుకున్నారు.

మే 13న, బందిపోరా జిల్లాలోని బ్రార్ ప్రాంతంలో ఇద్దరు అనుమానిత విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. వారి గుర్తింపును ఇప్పటివరకు వెల్లడించలేదు.

మే 20న, కుప్వారాలోని తంగ్‌ధర్ సెక్టార్‌లో చొరబాటు ప్రయత్నం విఫలమైంది. ఈ సమయంలో అనుమానిత విదేశీ ఉగ్రవాదిని కాల్చిచంపారు.

మే 25న బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో J&K పోలీస్, ఎలైట్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌లోని ఒక ప్రత్యేక పోలీసు అధికారి కూడా వీరమరణం పొందారు.

మరుసటి రోజు ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.

నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు..

కాశ్మీర్‌లో చొరబడేందుకు భారీగా ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి లాంచ్‌ప్యాడ్‌లపై వేచి ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. అయితే బలమైన చొరబాటు నిరోధక గ్రిడ్ వారిని దాటకుండా నిరోధిస్తోంది.

మే ప్రారంభంలో శ్రీనగర్‌లోని ఆర్మీ వ్యూహాత్మక చినార్ కార్ప్స్ మాజీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్, లెఫ్టినెంట్ జనరల్ DP పాండే.. మాట్లాడుతూ ఈ సంవత్సరం ఒకే ఒక్క చొరబాటు ప్రయత్నం జరిగిందని. దానిని భద్రతా దళాలు విఫలం చేశాయని చెప్పారు.

ఏది ఏమైనప్పటికీ గత నెలలో విజయవంతమైన ప్రతిఘటన కార్యకలాపాలు చొరబాట్లు చురుకుగా ఉన్నాయని సూచిస్తున్నాయి. 2003 కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించేందుకు భారతదేశం, పాకిస్తాన్ సైన్యాలు గత సంవత్సరం చేసిన ప్రతిజ్ఞలు కేవలం డాక్యుమెంటేషన్‌కు మాత్రమే పరిమితమై ఉండవచ్చు.

ఈ ఏడాది మే నెలాఖరు వరకు జమ్మూ కాశ్మీర్‌లో 91 మంది ఉగ్రవాదులు హతమయ్యారని.. వారిలో ఇద్దరు జమ్మూ డివిజన్‌లో మరణించగా, 89 మంది కాశ్మీర్ డివిజన్‌లో హతమయ్యారని అధికారిక సమాచారం. వీరిలో 26 మంది స్థానికేతర ఉగ్రవాదులు కాగా, 65 మంది స్థానికులు ఉన్నారు.

ఈ ఏడాది హతమైన 53 మంది ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబాతో అనుబంధం కలిగి ఉన్నారని, ఆ తర్వాత జైషే మహ్మద్‌తో కలిసి పనిచేస్తున్న 24 మంది ఉగ్రవాదులు, హిజ్బుల్ ముజాహిదీన్‌తో 11 మంది ఉగ్రవాదులు, ఇద్దరు అల్-బదర్ సంస్థకు చెందినవారు ఉన్నారని డేటా చూపుతోంది. అయితే ఒక ఉగ్రవాదికి సంబంధించిన వివరాలను అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు.

చురుకుగా చొరబాటు నిరోధక గ్రిడ్

కాశ్మీర్‌లో ఉగ్రవాదులను నియంత్రించడానికి, భద్రతా వాతావరణాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను చొరబాటు నిరోధక గ్రిడ్ చురుకుగా అడ్డుకుంటున్నదని అధికారులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ.. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దును కూడా హింసాత్మక ఘటనలు ప్రభావితం చేశారు. ఇక్కడ భద్రతా దళాలు అనేక ప్రయత్నాలను విఫలవంతం చేశాయి. పాకిస్తాన్ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సరఫరా చేయడానికి ఏర్పరుచుకున్న సొరంగాలు, డ్రోన్ల వినియోగాన్ని భద్రతా బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయని వ్యాసకర్త జహంగీర్ అలీ పేర్కొన్నారు.

Source Link

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..