JK Encounter: జమ్ముకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు శనివారం నుంచి ఆపరేషన్ ప్రారంభించాయి. శ్రీనగర్‌లోని ఖన్యార్, అనంత్‌నాగ్ జిల్లా లర్నూలో ఉగ్రవాదులపై భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా, నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
జమ్ముకశ్మీర్ మరోసారి వరుస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతోంది. శ్రీనగర్ లోని కన్యర్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఓ విదేశీ ఉగ్రవాది ఉన్నట్లు అధికారులు తెలిపారు. నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదులు నక్కిన ఇంటిని సైన్యం స్వాధీనం చేసుకుంది. మరోవైపు అనంత్‌నాగ్‌లో కూడా ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో కూడా ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. హల్కర్‌గల్లీ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. అయితే ఆర్మీ వెంటనే కూంబింగ్ చేపట్టింది. ఇద్దరు విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
కాశ్మీర్ డివిజన్‌లోని రెండు చోట్ల భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కశ్మీర్ డివిజన్‌లోని శ్రీనగర్ జిల్లా ఖన్యార్‌లో తెల్లవారుజాము నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 1-2 మంది ఉగ్రవాదులు దాగి ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీనగర్ ఖన్యార్ నివాస ప్రాంతం, అందువల్ల భద్రతా దళాలు ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి.. దీని ఫలితంగా ఆపరేషన్ సమయం తీసుకుంటోందని పేర్కొంటున్నారు. రెండో ఎన్‌కౌంటర్ దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని లార్నూలో జరిగింది.. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ ధృవీకరించింది. ఈ విధంగా మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
సెంట్రల్ కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగిన ఘటన తర్వాత బందిపొరలో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలోని మాగంలో ఉగ్రవాదులు గత రాత్రి ఇద్దరు వలస కార్మికులపై దాడి చేసి గాయపరిచారు.. దీని ఫలితంగా దాడి చేసిన వారిని పట్టుకునేందుక ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
స్పందించిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్..
జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తరువాత ఉగ్రదాడులు పెరిగిపోవడంపై స్పందించారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్. సరిహద్దుల్లో పరిస్థితి పూర్తిగా అదుపు లోనే ఉందన్నారు. ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నట్టు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సందర్శించారు రాజ్‌నాథ్. అధునాతన ఆయుధాల తయారీని ఆయన పరిశీలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..