Telangana: ఈ దొంగల రూటే సపరేటు.. ఏం ఎత్తుకెళ్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో అక్టోబర్ 20వ తేదీన భారీ మొత్తంలో సిగరెట్ల కార్టన్ల చోరీ సంచలనం రేపింది. శ్రీరాంనగర్ కాలనీలో ఐటీసీ ఉత్పత్తులు విక్రయించే విజ్ఞేశ్వర ఏజెన్సీలో ఈ దొంగతనం జరిగింది.
ఎన్నో రకాల దొంగతనాలు చూశాం… బంగారం, నగదు, విలువైన వస్తువులపై కన్నేసిన కేటుగాళ్ళ గురించి విన్నాం. కానీ సిగరెట్ల దొంగలు కూడా ఉంటారంటే వినడానికి సిల్లీగా ఉంది కదూ..! సిగరెట్లే కదా ఒకటి రెండు మహా అయితే ఓ మూడు నాలుగు డబ్బాలు కావొచ్చు అనుకుంటున్నారా… కానీ అలా కాదు.. ఇదో పెద్ద ముఠా. వందలు, వేలు కాదండోయ్.. లక్షల రూపాయల చోరీ కహానీ ఇది.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో అక్టోబర్ 20వ తేదీన భారీ మొత్తంలో సిగరెట్ల కార్టన్ల చోరీ సంచలనం రేపింది. శ్రీరాంనగర్ కాలనీలో ఐటీసీ ఉత్పత్తులు విక్రయించే విజ్ఞేశ్వర ఏజెన్సీలో ఈ దొంగతనం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో బొలేరో వాహనంలో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు, దర్జాగా దొంగతనానికి తెగబడ్డారు. డబ్బులు ఇచ్చి సరుకులు కొన్న మాదిరిగానే బొలెరో వాహనం తీసుకువచ్చి విలువైన 31 సిగరెట్ల కార్టన్లను లోడ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఉదయం ఏజెన్సీ సిబ్బంది వెళ్లి చూసేసరికి అవాక్కయ్యారు. దీంతో సీసీ కెమెరాలను పరిశీలిస్తే దొంగల ఘనకార్యమంతా రికార్డు అయ్యింది.
ఇక చోరీ ఘటనపై యజమాని మణికాంత్ జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే జడ్చర్ల వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఒక గుర్తు తెలియని వాహనంలో ముగ్గురు వ్యక్తులు సిగరెట్ల లోడుతో అడ్డంగా దొరికిపోయారు. వారిని విచారించగా జడ్చర్ల, హైదరాబాద్, కీసర తదితర ప్రాంతాలలో చోరీల చిట్టా విప్పారు.
బతుకుదెరువు కోసం వచ్చి చోరీల బాట..!
నిందితులు రాజస్థాన్ రాష్ట్రం బయవార్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. మాణిక్ చంద్ కుమావత్, కైలాష్ కుమార్, దినేష్, గణపతి నలుగురు నిందితులు చోరికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. వీరిలో దినేష్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.21.75 లక్షల నగదు, 18 కార్టన్ల సిగరెట్లు, చోరికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రధాన నిందితులు మాణిక్ చంద్ కుమావత్, కైలాష్ కుమార్ హైదరాబాద్ పరిధిలో ఇదే విధంగా సిగరెట్ల కార్టన్ల చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు.
వీరిపై ఇప్పటికే అల్వాల్, మోండా మార్కెట్, లంగర్ హౌస్, కీసర, జడ్చర్ల లలో కేసులు సైతం నమోదయ్యాయి. నిందితులు రాజస్థాన్ నుంచి బతుకుదెరువు కోసమని హైదరాబాదుకు వచ్చి కిరాణా షాపులలో పనిచేశారు. ఇలా షాపులలో ఇంత కష్టపడి పనిచేసిన లక్షల్లో డబ్బులు సంపాదించాలని పథకం పన్నారు. తరచూ వచ్చే సిగరెట్ల కార్టన్లపై కన్నేశారు. పెద్ద మొత్తంలో ఈ చోరీలకు సిగరెట్ల కార్టన్ల చోరీలకు ప్లాన్ వేశారు. చివరకు జడ్చర్ల పోలీసులకు దొరికిపోయి కటకటాపాలయ్యారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..