వల వేశారంటే.. రూ.లక్షలు, రూ.కోట్లు ఖతమే..! మీరు ఊహించనంత నెక్స్ట్ లెవెల్
భయం. భయమే నేరగాళ్ల పెట్టుబడి. అది కూడా ఎలాంటి భయం చూపిస్తారో తెలుసా. ఎమోషన్స్‌తో ముడిపెట్టి భయపెడతారు. ఓ రియల్ ఇన్సిడెంట్ చెబుతా వినండి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న మాల్తీ వర్మ అనే మహిళకు ఓ వీడియో కాల్ వచ్చింది.
ఒకనాడు.. దారి కాచి దోపిడీ చేసేవాళ్లు. దండయాత్రలు చేసి కొల్లగొట్టేవాళ్లు. ఇళ్లల్లో పడి దోచుకెళ్లే వాళ్లు. తరువాత.. ట్రెండ్‌కు తగ్గట్టుగా డెబిట్‌కార్డులు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు.. లేటెస్ట్‌గా యూపీఐలతో మోసం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడైతే.. మరీ అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారు. పీకమీద కత్తిపెట్టరు. ఆయుధాలతో బెదిరించరు. మీ ఇంటికి రారు.. నగానట్రా దోచుకెళ్లరు. జస్ట్.. ముచ్చెమటలు పట్టించి కోట్లు కొట్టేస్తారు. ఎదుటి వాళ్లను ఉన్నచోటే ఉంచి.. వాళ్ల అకౌంట్లలోని డబ్బులు మొత్తం ఖాళీ చేస్తారు. దానికంటే ముందు డిజిటల్ అరెస్ట్ చేస్తారు. ఈమధ్య బాగా పాప్యులర్ అయిన క్రైమ్.. ఈ ‘డిజిటల్ అరెస్ట్’. ఒక్కో డిజిటల్ అరెస్ట్‌ది ఒక్కో స్టోరీ. వింటే.. ఔరా అనాల్సిందే. అలా ఉంటాయవి. ఇంతకీ, ఎలా చేస్తారీ డిజిటల్ అరెస్ట్..?
భయం. భయమే నేరగాళ్ల పెట్టుబడి. అది కూడా ఎలాంటి భయం చూపిస్తారో తెలుసా. ఎమోషన్స్‌తో ముడిపెట్టి భయపెడతారు. ఓ రియల్ ఇన్సిడెంట్ చెబుతా వినండి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న మాల్తీ వర్మ అనే మహిళకు ఓ వీడియో కాల్ వచ్చింది. ‘మీ కూతురు వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.. ప్రస్తుతం జైల్లో ఉంది’ అంటూ కాల్ చేశారు. కన్నకూతురుపై ఎంత నమ్మకం ఉన్నా సరే.. ఆ క్షణంలో ఆలోచన కోల్పోతారనుకుంటా. ‘ఏమో చేయని తప్పుకు ఇలా ఇరికిస్తున్నారేమో.. అక్రమంగా కేసులు పెడుతున్నారేమో.. అందుకే జైల్లో పెట్టారేమో’ అని క్షణకాలంలోనే ఇన్ని ప్రశ్నలూ వెంటాడుతుంటాయి. పైగా ఒక తల్లికి ఇంతకంటే షాకింగ్ న్యూస్ మరొకటేం ఉంటుంది. వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి.. తన కూతురు గురించి కాలేజ్ వివరాలు, ఉంటున్న ఏరియా, ఆధార్ డిటైల్స్ చెప్పి భయపెడుతుంటే తల్లడిల్లిపోయింది ఆ తల్లి. ‘వెంటనే లక్ష రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేస్తావా.. లేకపోతే మీ కూతురు, మీ కుటుంబం పరువును బజారుకీడ్చమంటావా’ అని బెదిరించారు. కనీసం ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వలేదు. ‘వెంటనే కావాలి, లక్ష రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయాలి, లేదంటే వీడియో సోషల్‌మీడియాలో పెడతాం’ అంటూ వెంటాడారు. ఆ భయానికి ఆ తల్లి గుండె పగిలింది. గుండెపోటుతో కుప్పకూలిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో జరిగింది డిజిటల్ అరెస్టే. కనీసం ఆలోచించుకునే సమయం ఇవ్వరు. ఎమోషన్స్‌తో ఆడుకుంటారు. ఫోన్‌లోనే భయపెడతారు. కాల్ కట్ చేయడం కాదు కదా, పక్కకు వెళ్లేంత ఛాన్స్ కూడా ఇవ్వరు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకునేంత వరకు కాల్ లేదా వీడియో కాల్‌లో అలా బంధించి ఉంచుతారు. ఈ డిజిటల్ అరెస్టులు ఎంతో కాలంగా జరుగుతున్నప్పటికీ.. ఆగ్రాలో ఓ తల్లి గుండె ఆగడంతో మరింత సెన్సేషనల్‌గా మారింది. అందుకే, సాక్షాత్తు ప్రధాని మోదీనే ఈ డిజిటల్ అరెస్టుల గురించి మాట్లాడారు. మన్ కీ బాత్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ దేశ ప్రజలను అలర్ట్ చేశారు. ఎందుకంటే.. అలాంటి కాల్స్‌ని అంత ఈజీగా అరికట్టలేమని ప్రధానికి కూడా తెలుసు. సో, ముందుగా చేయాల్సింది ప్రజల్లో అవగాహన తీసుకురావడమే. సైబర్ నేరగాళ్ల ఆటకట్టించాలంటే ముందుగా ప్రజలను అలర్ట్ చేయాలి. అదే పనిచేశారు ప్రధాని మోదీ.
మరో రియల్ స్టోరీ చూద్దాం. దీన్ని డిజిటల్ అరెస్ట్ అని మాత్రమే కాదు సెల్ఫ్ కస్టడీ అని కూడా అనాలేమో. అంటే.. ఎవరో వచ్చి తాళ్లతో కుర్చీకి కట్టేయక్కర్లేదు. వాళ్లకు వాళ్లే బంధీ అయిపోవడం అన్నమాట. ఇంట్లోనే ఉంటారు.. కానీ భయంభయంగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడరు. అడుగు బయటపెట్టరు. నాలుగు గోడల మధ్యే నలిగిపోతుంటారు. జస్ట్.. వచ్చిన కాల్స్‌ను లిఫ్ట్ చేయడం తప్ప మరేదీ చేయలేదు. ఆ ఫోన్ కాల్‌లో ఎదుటివాళ్లు ఏం చెబితే అది చేస్తుంటారు. అలాక్కూడా జరుగుతుందా అంటే.. జరిగింది కాబట్టే చెబుతున్నాం. వాకాటి నారాయణ తెలుసుగా. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఏకంగా ఆరు రోజుల పాటు వాకాటిని సెల్ఫ్ కస్టడీ చేశారు. అంతకంటే ముందు డిజిటల్ అరెస్ట్ చేశారు. ‘మీరు థాయ్‌లాండ్‌కు పంపించిన ఓ ప్యాకెట్‌లో డ్రగ్స్ ఉన్నాయ్’ అని మొదలుపెట్టారు. డ్రగ్స్ మాత్రమే కాదు ఫారెన్స్ కరెన్సీ కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. అలాంటిదేం లేదని సమాధానం ఇస్తున్నా సరే.. ఓ నెంబర్ చదివి వినిపించి ‘ఇది మీ ఆధార్ నెంబరే కదా’ అన్నారు. అది వాకాటి ఆధార్ నెంబరే. థాయ్‌లాండ్‌కు ఎలాంటి పార్సిల్ పంపలేదని వాకాటి నారాయణకు కూడా తెలుసు. కాకపోతే.. ఎక్కడో అనుమానం. ఆధార్ నెంబర్ చెప్పారు కాబట్టి.. తన ఆధార్‌తో ఇంకెవరైనా ఈ పనిచేసి ఉండొచ్చన్న అనుమానం. అందులోనూ.. ఫోన్ చేసిన వాళ్లు ఎలాంటి సలహా ఇచ్చారో తెలుసా.. వెంటనే ముంబై సైబర్ క్రైమ్‌కు కంప్లైంట్ ఇవ్వాలని సూచించారు. ముంబై నుంచే సైబర్ క్రైమ్ ఆఫీసర్లు కాంటాక్ట్‌లోకి వస్తారు.. అప్పటి వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని దబాయించారు. తాము ఫలానా అధికారిని అంటూ ఒక్కోసారి ఒక్కో వ్యక్తి వీడియో కాల్ చేసి.. డిటైల్స్ తీసుకోవడం, కేసులు బుక్ అవుతాయని చెప్పడం చేశారు. పైగా వాకాటిపై అప్పటికే సీబీఐ కేసులు ఉన్నాయి. కొన్ని బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి. ఆ ఫ్రీజ్ అయిన బ్యాంక్ అకౌంట్ల నెంబర్లనే వీళ్లూ చెప్పడం మొదలుపెట్టారు. సో, ఎక్కడో అనుమానం ఉన్నా.. ఎదుటి వాళ్లు తన డిటైల్స్ అన్నీ చెప్పేస్తుండడంతో ఆరు రోజుల పాటు ఏమీ చేయలేకపోయారు. ఓ ఫైన్ డే.. ’15 కోట్లు ఇస్తే ఈ కేసు లేకుండా చేస్తాం’ అన్నారు. అప్పుడు అనుమానం వచ్చింది వాకాటి నారాయణకు. నిజంగా పోలీసులే అయితే.. ఇలా డబ్బు డిమాండ్ చేయరని అర్ధమైంది. వెంటనే నెల్లూరులోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. పేరుమోసిన రాజకీయ నాయకుడికే ఇలా జరిగితే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి చెప్పండి.
ఆడవాళ్లూ… మీరు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రతీసారి డబ్బులు దోచేందుకే ఇలా డిజిటల్ అరెస్ట్ చేస్తారని చెప్పడానికి లేదు. ‘న్యూడ్ డిజిటల్ అరెస్ట్’ అనేది చాలా మంది విని ఉండరు. ఈమధ్య న్యూడ్ డిజిటల్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి. సపోజ్.. మీ కొడుకు లేదా కూతురు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారనో, సెక్స్ రాకెట్‌లో దొరికారనో చెప్పి.. వాళ్లు చదువుతున్న స్కూల్ లేదా కాలేజ్ డిటైల్స్ చెప్పి, ఇన్‌స్టిట్యూట్ ఐడీ కార్డ్ చూపించి బెదిరిస్తారు. వెంటనే ‘తానేం చేయాలో చెప్పండి’ అనే ఆన్సర్ వస్తుంది ఆ తల్లి నుంచి. ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా లేరా అనే వివరాలు తీసుకుని, ఎవరెవరు ఎప్పుడొస్తారో తెలుసుకుని.. ఆట మొదలుపెడతారు. ఆ వీడియో కాల్‌లోనే.. మహిళలను దుస్తులు విప్పాలని బెదిరిస్తారు. వివస్త్రలను చేసి, ఆ విజువల్స్ రికార్డ్ చేసి, అప్పుడు మరోరకంగా బెదిరించడం మొదలుపెడతారు. ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లోని ఓ యువతికి కూడా ఇదే తరహా కాల్ వచ్చింది. ‘న్యూడ్ డిజిటల్ అరెస్ట్’ చేసేలా అవతలివాళ్లు బెదిరించడంతో.. ఆ ఎత్తుగడను పసిగట్టిన ఆ యువతి వెంటనే సైబర్ క్రైమ్‌కి రిపోర్ట్ చేసింది. సో, డిజిటల్ అరెస్ట్ అంటే కేవలం డబ్బుల కోసమే అనుకోడానికి కూడా వీళ్లేదు.
డిజిటల్ అరెస్ట్ గురించి ఎన్ని ఉదాహరణలు చెప్పుకున్నా తప్పులేదు. ఎందుకంటే.. ఒక్కోసారి ఒక్కో టైప్‌లో మోసం జరుగుతుంటుంది కాబట్టి. పైగా ప్రజలకు కూడా పూర్తి అవగాహన ఉండి తీరాల్సిన అంశం ఇది. వీడియో కాల్‌లో బెదిరించేవాళ్లు సాధారణ వ్యక్తుల్లా, అల్లాటప్పాగా ఉంటారనుకుంటే పొరపాటే. తాము పోలీసులం అంటారు, సీబీఐ అధికారులమని చెబుతారు. లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఈడీ ఆఫీసర్స్ అని చెప్పుకుంటారు. ఆ వీడియో కాల్ చేసే వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే, అది నిజమైన పోలీస్ స్టేషనే లేదా సీబీఐ ఆఫీసే అనిపించేంతగా సెట్టింగ్ వేస్తారు. యూనిఫామ్స్ వేసుకుంటారు, ఐడీలు పెట్టుకుంటారు, పక్కనే ఇండియన్ ఫ్లాగ్ పెట్టి, టేబుల్ మీద నాలుగు సింహాల బొమ్మపెట్టి, నకిలీ ఐడీ కార్డులు చూపిస్తుంటారు. ఇలాంటి సెట్టింగ్‌తోనే, పోలీస్ యూనిఫామ్ వేసుకునే బెంగళూరులో ఒక వ్యక్తిని మోసం చేశారు. ఏకంగా 20 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ‘డ్రగ్స్ దొరికాయి, మీ పేరు మీద కేసు బుక్ అయింది’ అని భయపెట్టి, సెటిల్ చేసుకోకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఇందాక చెప్పుకున్నట్టు.. ఆ 20 లక్షలు అకౌంట్లో పడేదాకా వదిలిపెట్టరు. వీడియో కాల్ ఆఫ్ చేయనివ్వరు. ఎందుకంటే.. వాళ్ల దగ్గర మన డిటైల్స్ అన్నీ పక్కాగా ఉంటాయి కాబట్టి. అవసరమైతే.. ఆధార్ జిరాక్సులు, పాన్ కార్డు, ఐడీ ప్రూఫ్స్ కూడా చూపిస్తారు. పైగా మాట్లాడుతున్నది నిజమైన పోలీసులే అని బిల్డప్ ఇస్తారు కాబట్టి.. చదువుకున్న వాళ్లు సైతం బోల్తా పడాల్సిందే. అంతలా గడగడలాడిస్తారు. లేకపోతే.. 20 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయడం అంత ఈజీనా చెప్పండి. అలా ట్రాన్స్‌ఫర్ చేసేలా చేయగలిగారంటే ఎంత భయపెట్టి ఉంటారు..?
ఎవరో వీడియో కాల్ చేసి బెదిరించినంత మాత్రాన.. 20 లక్షల రూపాయలు అలా ఎలా ఇచ్చేస్తాడు అని అంటారేమో. సరే.. మరో ఎగ్జాంపుల్ చెబుతా. ఈ ఉదాహరణలో ఏకంగా 3 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారొకరు. పైగా ట్రాప్‌లో పడింది ఓ డాక్టర్. వీడియో కాల్ చేసిన ఓ సైబర్ నేరగాడు తాను ట్రాయ్ అధికారిని అంటూ చెప్పుకున్నాడు. మీ మొబైల్ నెంబర్‌తో హవాలా రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు పంపించారని బెదిరించాడు. మరో రెండు గంటల్లో నెంబర్ బ్లాక్ కాబోతోందని హడావుడి చేశాడు. వెంటనే సైబర్ క్రైమ్ ఆఫీసర్‌ను అంటూ మరో కాల్. ఆ తరువాత ఐపీఎస్ అధికారిని అంటూ మరో కాల్. ‘మీపై ఎంక్వైరీకి ఆదేశిస్తూ సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన ఆర్డర్ ఇది’ అంటూ ఓ కాపీ చూపించాడు. ‘మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం’ అని చెప్పి ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరినీ కలవకూడదని బెదిరించారు. అలా 10 రోజుల పాటు వేధించారు. ఏకంగా 3 కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. మోసాలు ఇలా కూడా జరుగుతాయని అప్పటికి ఇంకా ఆ డాక్టర్‌కి తెలియదనుకుంటా. దాన్నే క్యాష్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు వైద్యురాలిని డిజిటల్ అరెస్ట్ చేసి కోట్లు కొల్లగొట్టారు.
ఇందాక చెప్పినట్టు ఎదుటివాళ్ల ఎమోషన్స్‌తో ఆడుకుంటారు సైబర్ నేరగాళ్లు. ‘మీ భర్తను కిడ్నాప్ చేశాం.. కావాలంటే ఆయన ఏడుపు వినండి’ అంటూ ఓ ఏడుపు వినిపిస్తారు. కన్ఫామ్ చేసుకోడానికి వాళ్లాయనకు కాల్ కూడా చేయనివ్వరు. ‘కాల్ కట్ అయిందా.. ఆయన మిగలరు’ అంటూ బెదిరిస్తారు. ఇది రియల్‌గా జరిగింది కూడా. ఓ ఇల్లాలికి ఇలాగే ఫోన్ చేసి, రాత్రంతా వీడియో కాల్‌లోనే ఉంచి, ఎటూ కదలకుండా చేసి, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. నోయిడాకు చెందిన ఓ మహిళను డిజిటల్ అరెస్ట్ పేరుతో దోచుకున్నారు. ‘మీ ఆధార్ కార్డుతో సిమ్ కొన్నారు. దాన్ని ముంబైలో మనీ లాండరింగ్‌కు వాడుకున్నారు’ అని బెదిరించాడు. కేసు, ఎంక్వైరీ అనే సరికి ఆమె గడగడలాడిపోయింది. ఆ భయాన్ని క్యాచ్ చేసిన సైబర్ నేరగాడు.. ఇంకింత రెచ్చిపోయాడు. ఎంక్వైరీ అంటూ కాల్ ట్రాన్స్‌ఫర్ చేసి, మరొకరితో మాట్లాడించాడు. అలా.. ఉదయం తొమ్మిదిన్నరకు మొదలుపెడితే.. రాత్రి 7 గంటల వరకు నాన్-స్టాప్‌గా వీడియో కాల్ చేస్తూనే ఎంక్వైరీ పేరుతో టార్చర్ చూపించాడు. అలా 11 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసుకునే దాకా కాల్ కట్ చేయలేదు. హైదరాబాద్అడిక్మెట్కు చెందిన వృద్ధురాలికి కూడా ఇలాగే కాల్ చేసి ఏకంగా 5 కోట్ల 90 లక్షల రూపాయలు దోచేశారు. ‘డిజిటల్ అరెస్ట్’ చేశామని బెదిరించి.. ఆ వృద్ధురాలి బ్యాంక్ అకౌంట్‌తో పాటు ఎఫ్‌డీలు, పీపీఎఫ్ అకౌంట్లలోని డబ్బును కాజేశాడు. హైదరాబాద్‌లోని ఆర్.సీ.పురంలోని BHEL టౌన్‌షిప్ సమీపంలో ఉండే 80 ఏళ్ల వ్యక్తికి ఇలాగే వీడియో కాల్ చేసి.. 4 కోట్ల 98 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఆ వృద్ధుడిని ఏకంగా నెల రోజుల పాటు వేధించారు. మనీలాండరింగ్ కేసు ఫైల్ చేశామని చెప్పి.. విడతల వారీగా 5 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్ నాచారంలోని ట్రాన్స్‌కో రిటైర్డ్ సీఈని కూడా ఇలాగే మనీలాండరింగ్ పేరుతో బెదిరించి.. 4 కోట్ల 82 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.
అనంతపురం జిల్లాలో కూడా ఓ డిజిటల్ అరెస్ట్ జరిగింది. రైల్వే ఎంప్లాయ్‌ని డిజిటల్ అరెస్ట్ చేసి ఏకంగా 72 లక్షలు దోచేశారు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్‌కు చెందిన షేక్ మహమ్మద్ వలీ.. రైల్వే గార్డ్‌గా పనిచేస్తున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నామని కొందరు, సీబీఐ ఆఫీసర్స్ అని చెప్పి మరికొందరు బెదిరించారు. మీపై కేసు ఫైల్ అయిందంటూ భయపెట్టి.. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ఫోర్స్ చేశారు. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం దాచిన డబ్బులు తీసి మరీ ఆ సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టారు ఆ రైల్వే ఉద్యోగి. ఈమధ్యే
జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ వ్యక్తి నుంచి 88వేలు కొట్టేశారు. వాళ్ల అబ్బాయి ఫారెన్‌లో చదువుతున్నాడు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్చేసి.. తాము సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. ‘మీ అబ్బాయి ఓ అమ్మాయిని యాక్సిడెంట్ చేశాడని’ బెదిరించాడు. గాయపడ్డ వారికి చికిత్సతో పాటు, కేసు లేకుండా ఉండేందుకు 3 లక్షలు డిమాండ్ చేశాడు. కాల్‌కట్ చేస్తే మీ అబ్బాయిని కాల్చేస్తామని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. ఆ భయానికి అకౌంట్లో ఉన్న 88 వేలు పంపించారు. అప్పటి వరకు కాల్ కట్ చేయనీయకుండా డిజిటల్ అరెస్ట్ చేశారు. ఈలోపు.. అతని భార్య కుమారుడికి ఫోన్ చేసింది. ఎలాంటి యాక్సిడెంట్ చేయలేదని చెప్పడంతో మోసపోయామని తెలుసుకున్నారు. సో, డిజిటల్ అరెస్టులు ఆషామాషీగా జరగవు. దాదాపుగా ఎమోషన్స్‌తో ఆడుకోవడమే ఉంటుందక్కడ. అందుకే, చాలా ఈజీగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
ఈ సైబర్ నేరగాళ్లు ఎవరినైనా టార్గెట్ చేశారంటే.. లక్షలు, కోట్లు ఇచ్చేదాకా వదిలిపెట్టరు. వీడియో కాల్‌లో ఎలా హడావుడి చేస్తారంటే.. కనీసం బాత్‌రూమ్‌కి కూడా వెళ్లనివ్వరు. ఒకవేళ బాత్‌రూమ్‌కు వెళ్లినా డోర్ తెరిచే వెళ్లాలంటారు. కాదని కాల్ కట్ చేస్తే.. ఇంటిబయట ఉన్న పోలీసులు లోపలికి వస్తారని, అరెస్ట్ చేసి ముంబై తీసుకొస్తారని బెదిరిస్తారు. ఇలా జరిగింది కూడా. ఇలా డిజిటల్ అరెస్ట్ పేరు చెప్పి.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ దాకా ఏకంగా 120 కోట్ల రూపాయలు కాజేశారు. ఈమధ్యకాలంలో ఈ డిజిటల్ అరెస్ట్ అరాచకాలు మరీ ఎక్కువైపోయాయి. ఇప్పటి వరకు 10వేల 567 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా రోజుకు 6 కోట్ల రూపాయలు కాజేస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. సో, డిజిటల్ అరెస్ట్‌పై ప్రజలు అవగాహనతో ఉండడం తప్ప ప్రస్తుతానికి చేయగలిగిందేం లేదు.
అందుకే, మొన్న ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో చాలా క్లియర్‌గా చెప్పారు. అసలు భారతీయ చట్టాల్లో ‘డిజిటల్ అరెస్ట్’ అన్న పదమే లేదని చాలా స్పష్టంగా చెప్పారు మోదీ. పోలీసులం అని చెప్పి, సీబీఐ-ఈడీ అధికారులం అంటూ ఎవరైనా కాల్ చేస్తే అస్సలు భయపడొద్దని స్వయంగా ప్రధానే చెప్పారు. ఒక్కక్షణం వివేకంతో ఆలోచించాలి తప్పితే.. వాళ్లు అడిగిన సమాచారం అంతా ఇవ్వకూడదన్నారు. అనుమానం వచ్చిన వెంటనే కాల్ కట్ చేయడమో, ఇంట్లోని వాళ్లకు చెప్పడమో చేయాలని, ఆ తరువాత పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పారు. మరో ప్రధానమైన విషయం కూడా చెప్పారు ప్రధాని మోదీ. సాధారణంగా ప్రభుత్వ అధికారులు గానీ, సంస్థలు గానీ.. వీడియో కాల్ చేసి బెదిరించటం, భయపెట్టటం, విచారణ చేయడం జరగదు అన్నారు. చట్టం అందుకు ఒప్పుకోదన్నారు. సో, కాల్ చేసి బెదిరిస్తున్నారంటే అది కచ్చితంగా ఫ్రాడ్ అని గుర్తుపెట్టుకోవాలన్నారు. అవసరమైతే.. పోలీస్ స్టేషన్‌కే వస్తామని ఎదురు చెప్పాలని సలహా ఇచ్చారు.
ఏదేమైనా.. ముందుగా ప్రజల్లో అవగాహన వస్తేనే చాలా వరకు క్రైమ్స్ తగ్గిపోతాయి. అలాగని ప్రభుత్వం కూడా ఊరికేం ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ అరెస్టులు, సైబర్ క్రైమ్స్‌పై హైలెవెల్ కమిటీ వేసింది. ఒక్కో క్రైమ్‌ని కచ్చితంగా ఛేదించేలా ఆదేశాలిచ్చింది. కేవలం డిజిటల్ అరెస్టుల రూపంలోనే కాదు.. డిజిటల్ ట్రేడింగ్, డేటింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరు చెప్పి కోట్లకు కోట్లు దోచేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా 1,776 కోట్లు కాజేశారు. పైగా ఈ సైబర్ నేరాల్లో సగం మూడు దేశాల నుంచే ఆపరేట్ అవుతున్నాయి. మయన్మార్, లావోస్, కంబోడియాకు చెందిన సైబర్ నేరగాళ్లు.. భారతీయులే టార్గెట్‌గా దోచేస్తున్నారు. ఈ ఏడాది ట్రేడింగ్ స్కామ్‌లలో 1,420 కోట్లు, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో 222 కోట్లు, డేటింగ్ స్కామ్‌లలో 13 కోట్లు కొల్లగొట్టారు. సో, ఎవరేం అడిగినా సమాచారం ఇవ్వొద్దు. ఆధార్, పాన్, ఏటీఎం, క్రెడిట్ కార్డ్ డిటైల్స్‌తో పాటు ఓటీపీలు చెప్పొద్దు. మెసేజ్‌లు, వాట్సాప్‌లలో వచ్చే లింక్‌లను క్లిక్ చేయడం, తెలియని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం చేయొద్దు. ఒకవేళ మోసపోతే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్‌కి కంప్లైంట్ చేస్తే పోయిన డబ్బు రాబట్టుకోవచ్చు కూడా. సో, ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని చట్టాలు చేసినా.. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మాత్రం చేయగలిగిందేం లేదు.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.