AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కీలక ఆపరేషన్‌ మొదలుపెట్టిన భారత్‌! ఇప్పటికే 100 మందికి పైగా..

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడంతో, ఇరాన్‌లో చిక్కుకున్న 10,000 మంది భారతీయులను రక్షించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. గగనతలం మూసివేయబడటంతో, భూమార్గాల ద్వారా అర్మేనియా చేరుకుని, అక్కడి నుండి విమానాల ద్వారా భారతదేశానికి తరలించే ప్రణాళికను రూపొందించింది. భారత రాయబార కార్యాలయం, సురక్షిత ప్రదేశాలకు తరలింపు, హెల్ప్‌లైన్ నంబర్లను అందించడం ద్వారా సహాయం అందిస్తోంది.

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కీలక ఆపరేషన్‌ మొదలుపెట్టిన భారత్‌! ఇప్పటికే 100 మందికి పైగా..
Netanyahu And Pm Modi And K
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jun 17, 2025 | 7:32 AM

Share

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రం అవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్‌లో ఉన్న భారతీయుల తరలింపుకు చర్యలు ప్రత్యేక ఆపరేషణ్ చేపట్టింది. గగనతలం మూసి ఉండటంతో భూ సరిహద్దు మార్గాల ద్వారా మొదట ఇరాన్ నుంచి భారత పౌరులను సరిహద్దులు దాటించి తదుపరి వారిని విమానల ద్వారా ఇండియాకు తీసుకురానున్నారు. మొదటి విడతలో భూ మార్గం ద్వారా అర్మేనియాకి చేరుకోనున్నారు. ఇందుకోసం భారతీయ విద్యార్థులకు భూ సరిహద్దు దాటడానికి ఇరాన్ అనుమతి ఇచ్చింది. ఇరాన్‌లోని ప్రధాన నగరాలపై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగిస్తున్నందున, ఇరాన్‌లో చిక్కుకున్న సుమారు 10 వేల మంది భారతీయులను తరలించడానికి సురక్షితమైన మార్గాన్ని అందించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది.

ఎయిర్ స్పేస్ మూసి ఉన్నందున భారతీయులు అజర్‌బైజాన్, తుర్క్‌మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలోకి ప్రవేశించడానికి భూ సరిహద్దులను ఉపయోగించవచ్చని ఇరాన్ పేర్కొంది. సరిహద్దులు దాటే వ్యక్తుల పేర్లు, పాస్‌పోర్ట్ నంబర్లు, వాహన వివరాలు, సరిహద్దు వివరాలను ఇరాన్ జనరల్ ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్‌కు అందించాలని సూచించింది. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే భారత ప్రజలకు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. భారతీయ పౌరులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని తాజా సమాచారం కోసం ఎంబసీ సోషల్ మీడియా పేజీలను అనుసరించాలని సూచించింది. టెహ్రాన్‌లోని భద్రతా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఇరాన్‌లోని విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి వారితో సంప్రదిస్తున్నామని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ శాఖ ప్రకటించింది.

ఈ తరలింపు ఆపరేషన్‌లో భాగంగా.. ఇప్పటివరకు 100 మంది భారతీయులు అర్మేనియా సరిహద్దు వద్దకు చేరుకున్నారు. వారిని విమానంలో భారత్‌కి తీసుకురానున్నారు. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది. సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. భారత రాయబార కార్యాలయం మొదట తెహ్రాన్ నుండి విద్యార్థులను కోమ్, యాజ్ద్ వంటి సురక్షిత ప్రదేశాలకు బస్సుల ద్వారా తరలిస్తోంది. ఇప్పటివరకు 600పైగా విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు (+98 9128109115, +98 9128109109) ఏర్పాటు చేసింది. టెలిగ్రామ్ గ్రూప్‌లు సృష్టించి, గూగుల్ ఫారమ్ ద్వారా భారతీయుల వివరాలను సేకరిస్తోంది.

ఇరాన్‌లో 10 వేల మంది భారతీయులు

ఇరాన్‌లో సుమారు 10 వేల మంది భారతీయులు ఉన్నారు., వీరిలో 6,000 మంది కోమ్‌లోని షియా విద్యా కేంద్రాలలో చదువుతున్నారు. 2,000 మంది దక్షిణ ఇరాన్ ఓడరేవులలో ఫిషర్‌ఫోక్‌లో ఉద్యోగులుగా ఉన్నారు. మిగిలినవారు వైద్య కళాశాలల్లోని విద్యార్థులు, వ్యాపారవేత్తలు.1,500 పైగా విద్యార్థులు జమ్మూ కశ్మీర్‌కు చెందిన వారు ఉన్నారు. వీరు ఇరాన్ లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చిక్కుకున్నారు. వీరిలో చాలా మంది వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. తెహ్రాన్‌లోని షాహిద్ బెహెష్టి విశ్వవిద్యాలయంలో 350 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. తెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వద్ద జరిగిన దాడిలో ఇద్దరు కాశ్మీరీ విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని రామ్‌సర్‌కు సురక్షితంగా తరలించారు. ప్రస్తుతం తెహ్రాన్ నుండి కోమ్ (148 కి.మీ దూరం) వంటి సురక్షిత ప్రాంతాలకు విద్యార్థులను బస్సుల ద్వారా తరలిస్తున్నారు. ఇరాన్‌లోని షియా తీర్థయాత్రీలు, ముఖ్యంగా లక్నో నుండి వచ్చినవారు, కోమ్‌లో చిక్కుకున్నారు. విమానాలు లేనందున హోటళ్లలో ఉంటున్నారు. భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో సమన్వయం చేస్తూ భారతీయుల సురక్షితమైన తరలింపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

తరలింపు సవాళ్లు..

ఇరాన్ ఎయిర్‌ స్పేస్‌ మూసివేయబడడంతో విమానాల ద్వారా తరలింపు అసాధ్యం. ఓవైపు ఇజ్రాయెల్ బాంబు దాడులు, ఇంటర్నెట్ సేవల అంతరాయం, సమాచార లోపంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయటపడాలని చూస్తున్నారు భారత ప్రజలు. ఇప్పటికే భారతీయుల తరలింపు గురించి విదేశాంగ మంత్రి జై శంకర్ ఇరాన్ సరిహద్దు దేశాలతో మాట్లాడారు. ప్రస్తుతానికి అర్మేనియా భారత్‌కి సహాయం అందిస్తోంది. గతంలో 2020లో కరోనా సంక్షోభం సమయంలో ఇరాన్‌లో చిక్కుకున్న 234 మంది భారతీయులను (131 విద్యార్థులు, 103 తీర్థయాత్రీలు) ఎయిర్ ఇండియా, ఇరాన్ ఎయిర్ ద్వారా తరలించారు. ఇండియన్ నేవీ ఆపరేషన్ సముద్ర సేతు కింద బందర్ అబ్బాస్ నుండి పోర్‌బందర్‌కు భారతీయులను తరలించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి