ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయమే టార్గెట్‌గా భారీ విధ్వంసానికి కుట్ర… పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు..!

చిన్న పేలుడే అయినప్పటికి భారీ కుట్ర దాగి ఉన్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. పేలుడు జరిగిన ప్రదేశంలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ . ఎన్‌ఎస్‌జీ దర్యాప్తును ప్రారంభించింది.

ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయమే టార్గెట్‌గా భారీ విధ్వంసానికి కుట్ర... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు..!
Israeliembassy blast probe at Delhi
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 31, 2021 | 7:46 AM

Israel embassy blast probe : ఢిల్లీలో ఇజ్రాయెల్‌ ఎంబసీ దగ్గర పేలుడు కేసు దర్యాప్తులో పురోగతి లభించింది. ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇరాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఢిల్లీ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు. ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న 30 మంది ఇరాన్‌ జాతీయులను ప్రశ్నిస్తున్నారు. పేలుడుకు విదేశాల్లో కుట్ర జరిగినట్టు నిర్ధారించారు. చిన్న పేలుడే అయినప్పటికి భారీ కుట్ర దాగి ఉన్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. పేలుడు జరిగిన ప్రదేశంలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ . ఎన్‌ఎస్‌జీ దర్యాప్తును ప్రారంభించింది. పేలుడు ప్రదేశాన్ని 3 డీ మ్యాపింగ్‌ చేశారు. పేలుడుకు ముందు పలుమార్లు రెక్కీ నిర్వహించినట్టు కూడా గుర్తించారు. స్పాట్‌లో పేలుడుకు ఉపయోగించిన బ్యాటరీని దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం దగ్గర పేలుడుపై చురుగ్గా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

ఎంబసీ ముందు రెక్కీ నిర్వహించి అక్కడి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించి.. వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు నిర్థారణకొచ్చారు. ఐతే ఎంబసీ వద్ద దొరికిన ఒక సీసీఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు పోలీసులు. పేలుళ్ల సమయంలో ఓ క్యాబ్‌లో ఇద్దరు వ్యక్తులు దిగినట్లుగా గుర్తించారు.నిన్న ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తిని క్యాబ్ డ్రైవర్‌గా గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక విచారణలో తన క్యాబ్‌లో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించినట్లు తెలిపాడు డ్రైవర్. ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర దిగిన ఆ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా అనిపించడంతోనే పోలీసులకు ఫోన్ చేసినట్లు తెలిపాడు.

ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఉగ్రవాద సంస్థ జైష్‌-ఉల్‌-హింద్‌ సోషల్‌మీడియాలో ప్రకటించుకుంది. జైష్‌కు చెందిన టెలిగ్రామ్‌ ఛానల్‌లో ఈ మేరకు ప్రకటన వెలువడినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. ఇది ట్రైలర్‌ మాత్రమే..అసలు సినిమా ముందుంది..ఇదేదో హర్రర్‌ సినిమానో..యాక్షన్‌ మూవీనో కాదు..రియల్‌ స్టోరీ. ఢిల్లీ ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద దొరికిన సీక్రెట్‌ ఎన్వలప్‌ సారాంశం..ఎస్‌..ఇజ్రాయెల్‌ ఎంబసీ టార్గెట్‌గానే దాడి చేశారు ముష్కర మూకలు. పక్కా ప్లాన్‌ ప్రకారం పేలుడుకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్‌ అంబాసిడర్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రికి పూర్తి రక్షణ కల్పిస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హామీ ఇచ్చారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీనియర్ పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, జైపూర్‌, యూపీ తదితర రాష్ట్రాల్లో ఎయిర్ పోర్టులకు హై అలర్ట్‌ ప్రకటించారు. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్, సహా అన్ని ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read Also… మహారాష్ట్రలో మరోసారి కంపించిన భూమి.. హింగోలీలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.2 తీవ్రత నమోదు