సుశాంత్ ఫామ్‌హౌజ్ గుట్టు రట్టు.. హీరోయిన్లకు త్వరలో సమన్లు!

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫామ్ హౌజ్ గుట్టు క్రమంగా రట్టవుతుంది. బాలీవుడ్ హీరో హీరోయిన్ల పార్టీలకు కేంద్రంగా కొనసాగిన సుశాంత్ ఫామ్ హౌజ్‌లో జరిగిన దందాలకు సంబంధించి దివంగత నటుని వద్ద పనిచేసిన జగదీష్, ఫామ్ హౌజ్ మేనేజర్ రీస్ పలు రహస్యాలను...

సుశాంత్ ఫామ్‌హౌజ్ గుట్టు రట్టు.. హీరోయిన్లకు త్వరలో సమన్లు!
Follow us
Rajesh Sharma

|

Updated on: Sep 17, 2020 | 5:07 PM

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫామ్ హౌజ్ గుట్టు క్రమంగా రట్టవుతుంది. బాలీవుడ్ హీరో హీరోయిన్ల పార్టీలకు కేంద్రంగా కొనసాగిన సుశాంత్ ఫామ్ హౌజ్‌లో జరిగిన దందాలకు సంబంధించి దివంగత నటుని వద్ద పనిచేసిన జగదీష్, ఫామ్ హౌజ్ మేనేజర్ రీస్ పలు రహస్యాలను ఎన్సీబీ అధికారులకు వివరించారు. రియా చక్రవర్తితో పాటు సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ తదితర నటీనటులు సుశాంత్ ఫామ్ హౌజ్‌లో తరచూ పార్టీలు చేసుకునేవారని జగదీష్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎదుట సాక్ష్యం ఇచ్చారు.

లోనావాలాలోని సుశాంత్ ఫామ్ హౌజ్‌కు రియా చక్రవర్తితో పాటు సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ తరచూ వస్తూ ఉండేవారని, వారితో పాటు బాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు పార్టీలకు హాజరయ్యేవారని జగదీష్ ఎన్సీబీకి వాంగ్మూలం ఇచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జైద్ విలత్రా కూడా ఫామ్ హౌజ్ పార్టీలకు హాజరయ్యేవారని జగదీష్ వెల్లడించడం సంచలనంగా మారింది.

లోనావాలా ఫామ్ హౌస్ మేనేజర్ రీస్ కూడా మరిన్ని వివరాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు వెల్లడించాడు. ఫామ్ హౌజ్‌లో సుశాంత్ నిర్వహించే పార్టీలలో గంజాయి, మద్యం వినియోగం సర్వసాధారణమని రీస్ దర్యాప్తు అధికారులకు తెలిపారు. రియా చక్రవర్తితో పాటు సారా అలీ ఖాన్ తరచూ సుశాంత్ ఫామ్ హౌజ్‌కు వచ్చేదని రీస్ కూడా తెలియ చేయడం విశేషం. పార్టీల కోసం స్మోక్ పేపర్‌లను కూడా ఆర్డర్ చేసేవారని రీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాంగ్మూలం ఇచ్చారు.

లాక్ డౌన్ ప్రారంభమైన తొలి రోజుల్లో తాను ఫామ్ హౌజ్‌లో గడుపుతానని సుశాంత్ సింగ్ తెలిపారని, అయితే కారణాలు తెలియదు కానీ ఆయన ఫామ్ హౌజ్‌లో గడిపేందుకు రాలేదని మేనేజర్ రీస్ తన వాంగ్మూలంలో వివరించారు. ఒకవైపు రీస్, ఒకవైపు జగదీష్ ఇచ్చిన సమాచారంతో ఫామ్ హౌజ్‌లో జరిగిన పార్టీలు, వాటిలో పాల్గొన్న బాలీవుడ్ సెలబ్రిటీలు, ఆ పార్టీలో వినియోగించిన మద్యం, మాదకద్రవ్యాల వివరాలను కూపీ లాగేందుకు ఎన్సీబీ అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోవైపు డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సారా అలీ ఖాన్‌కు సమన్లు జారీ చేసే అవకాశాలున్నాయని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు.