విషపూరిత మందులు..మార్కెట్‌ని ముంచెత్తుతున్న ఔషధాలన్నీ సురక్షితమేనా?
డాక్టర్ ఇచ్చిన మందేసుకుంటే రోగం నయంకావాలి.. కానీ.. ప్రాణాలు పోవడమేంటి! శాస్త్ర పరిశోధనలు ఇంత అభివృద్ధి చెందాక కూడా ప్రాణాధార ఔషధాల విషయంలో ఈ పొరపాట్లేంటి? మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కాఫ్ సిరప్ పాతికమంది పిల్లల ఉసురుపోసుకున్నాక.. ప్రజలనుంచి వస్తున్న ప్రశ్నలివి. దగ్గుమందు మరణాలతో కోట్ల రూపాయల మందులు సీజ్ అయ్యాయి. దాన్ని తయారుచేసిన కంపెనీని క్లోజ్‌చేశారు. కొందరు అరెస్ట్ అయ్యారు.

మెడిసిన్ ఓ బ్రహ్మపదార్థం. అందులో ఏముందో అంత తేలిగ్గా ఎవరికీ అంతుపట్టదు. ఏ మెడిసిన్ ప్రొడక్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నట్లు రాదు. ప్రజల ప్రాణాలతో ముడిపడ్డ మందుల విషయంలో చిన్న తేడా వచ్చినా ఊహించని ఉత్పాతమే. పిల్లల ప్రాణాలు తీసిన కాఫ్‌సిరప్‌లో విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ 48.6 శాతం ఉన్నట్లు బయటపడింది. అలాంటిది డోస్ కాస్త అటూఇటయితే ప్రాణాలే ప్రమాదంలో పడే మెడిసిన్స్ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అయితే అవేమీ లేకుండానే మార్కెట్‌లోకొచ్చేస్తున్నాయ్ కొన్ని మెడిసిన్స్.
ప్రపంచానికి మెడిసిన్స్ సప్లై చేసే మన దేశంలో నాణ్యత లేని మందులు తయారవుతాయా అన్న అనుమానం రావచ్చు. కానీ ఆఫ్రికా దేశాల్లోనూ మన సిరప్ పదుల ప్రాణాలు తీసింది. కొందరి నిర్లక్ష్యం, స్వార్థం ఔషధాల ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆడిట్ రిపోర్ట్ ఏదో రహస్యమన్నట్లు ఉంచడమే జనం ప్రాణాలమీదికి తెస్తోంది. వాడే మెడిసిన్ క్వాలిటీని చెక్ చేసుకునేందుకు సామాన్యులకే కాదు.. ప్రిస్క్రిప్షన్ రాసే డాక్టర్లకూ అవకాశం లేకుండా పోతోంది.
దేశంలో చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలకు ప్రమాణాలు, నిబంధనల విషయంలో తేడాలున్నాయి. దీన్ని కొన్ని కంపెనీలు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నాయి. ఇది కూడా మెడిసిన్స్ ప్రాణాంతకంగా మారడానికి ఓ కారణమవుతోంది. ఔషధరంగమే ఓ మహాసముద్రం. నయంకావనుకున్న వ్యాధులకే కొత్త కొత్త మందులు కనిపెడుతున్నారు. అలాంటిది ఆరోగ్యాలకు గ్యారంటీ ఇవ్వాల్సిన మెడిసిన్స్.. అప్పుడప్పుడూ ప్రాణాలు తీస్తున్నాయంటే వ్యవస్థీకతమైపోయిన లోపాలవల్లే. మధ్యప్రదేశ్ మరణాలతోనైనా కళ్లు తెరవకపోతే.. కోట్లమంది ప్రజల ఆరోగ్యాలు గాల్లో దీపాలే.
అమెరికాలో 88ఏళ్లుగా ఔషధాలు వికటించిన సంఘటన జరగలేదు. ప్రజల ఆరోగ్యభద్రత విషయంలో అంత జాగ్రత్తగా ఉంది అగ్రరాజ్యం. కానీ ప్రపంచ ఫార్మా ఎగుమతుల్లో 30శాతం వాటా ఉన్న భారత్‌లో మాత్రం..ఔషధమెందుకో కొన్నిసార్లు ప్రాణాలు తీస్తోంది. కట్టుదిట్టమైన ఆడిట్, పారదర్శకత లేకపోవడం ఈ పరిస్థితి కారణమవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..








