India Economy: భారత ఆర్థిక వృద్ధి బ్రిక్స్ దేశాలకు ఆదర్శం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్రిక్స్ సదస్సులో భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రశంసించారు. 7.5% వృద్ధి రేటును కొనియాడుతూ, ఇది ఇతర బ్రిక్స్ దేశాలకు ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. IMF కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, 2025 నాటికి 6.5% వృద్ధిని అంచనా వేసింది.

కరోనావైరస్ మహమ్మారి శకం తర్వాత భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది.. క్రమంగా ఆర్థిక వృద్ధి గాడిలో పడుతూ అగ్రదేశాల సరసన చేరుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోన్న భారత్ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ సమావేశంలో మాట్లాడిన పుతిన్ భారతదేశ ఆర్థిక వృద్ధిని కొనియాడారు.. భారతదేశ ఆర్థిక వృద్ధి బ్రిక్స్ దేశాలకు ఉదాహరణ..అంటూ పేర్కొన్నారు. రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో పుతిన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ (BRICS) సదస్సులో బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. మూడు రోజుల సదస్సులో పాల్గొన్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అధిక ఆర్థిక వృద్ధి రేటును నిర్ధారించాల్సిన అవసరం గురించి తామందరం చర్చినట్లు తెలిపారు. ఆర్థిక వృద్ధి విషయంలో మోదీ దీన్ని విజయవంతంగా చేయగలుగుతున్నారంటూ పుతిన్ ప్రశంసించారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాస్ వార్తా సంస్థ పేర్కొంది.
‘‘భారత ఆర్థిక వృద్ధి భేష్.. 7.5% వృద్ధి ఫలితాలపై భారత్ ను అభినందిస్తున్నాము.. ఇది మనలో చాలా మందికి ఒక ఉదాహరణ.. ఈ చొరవకు ధన్యవాదాలు..’’ అంటూ పుతిన్ పేర్కొన్నారని.. వార్త సంస్థ ప్రచురించింది.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7 శాతంగా ఉంది.. 2025లో 6.5 శాతంగా ఉంటుందని ఇప్పటికే ఐఎంఎఫ్ అంచనా వేసింది. బ్రిక్స్ సదస్సుకు ముందు ఈ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) భారత ఆర్థిక వృద్ధిపై కీలక ప్రకటన చేసింది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను 7 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తూ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) కీలక ప్రకటనచేసింది.
కాగా.. ఈ బ్రిక్స్ సదస్సులో కూటమి దేశాధినేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిక్స్ కూటమిలో మరో ఆరు కొత్త సభ్య దేశాలను చేర్చుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బ్రిక్స్ కూటమిలో చోటు దక్కనుంది. ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)కి చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో దేశం స్థూల ఆర్థిక ప్రాథమిక అంశాలు బాగున్నాయని పుతిన్ వెల్లడించడం.. మంచి పరిణామన్నారు.
“భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని వెల్లడించారు.. మేము FY24-25లో ఏడు శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాము.. అనుకూలమైన వాతావరణం ఉన్నందున పునరుద్ధరణకు మద్దతు ఉంది. ద్రవ్యోల్బణం 4.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేశాము.. FY24-25, ఆహార ధరలు సాధారణ స్థితికి రావడంతో కొంత అస్థిరత ఉన్నప్పటికీ.. వృద్ధి ఉంటుంది..”అని IMF ఆసియా పసిఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ మంగళవారం తెలిపారు.
మంగళవారం బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీతో పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రష్యా – భారతదేశం మధ్య వాణిజ్యం, దౌత్య సంబంధాల గురించి చర్చించారు. రష్యా అధ్యక్షుడి ప్రెస్ సర్వీస్ ప్రకారం.. గత సంవత్సరం ద్వైపాక్షిక వాణిజ్య టర్నోవర్ USD 56.8 బిలియన్ల రికార్డు స్థాయికి చేరుకుంది.. ఇది 60 శాతం కంటే ఎక్కువ పెరిగిందని TASS నివేదించింది. ఈ సంవత్సరం జనవరి-ఆగస్టులో, చమురు సరఫరాల కారణంగా రష్యా – భారతదేశం మధ్య వాణిజ్య టర్నోవర్ సంవత్సరానికి 9 శాతం పెరిగి USD 37.4 బిలియన్లకు చేరుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
