2020 Round Up: కరోనా దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ అతాలాకుతలం.. అయినా మరింత సంపద పోగేసిన దిగ్గజ వ్యాపారులు..

2020 Round Up: కరోనా దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ అతాలాకుతలమైంది. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

2020 Round Up: కరోనా దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ అతాలాకుతలం.. అయినా మరింత సంపద పోగేసిన దిగ్గజ వ్యాపారులు..
Follow us

|

Updated on: Dec 31, 2020 | 12:25 PM

2020 Round Up: కరోనా దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ అతాలాకుతలమైంది. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లాక్‌డౌన్ వల్ల దుర్భర పరిస్థితులను చవిచూశారు. పరిశ్రమలు తీవ్ర నష్టాల్లో మునిగాయి. ఏడాది ఆరంభంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నా చివరలో మాత్రం కొన్ని రంగాలు తేరుకున్నాయి. ఆర్థికంగా కొంత కలిసొచ్చింది. 2020వ సంవత్సరంలో జరిగిన కొన్ని ముఖ్య కార్యకలాపాలను ఇప్పడు తెలుసుకుందాం.

ఈ సంవత్సరం దేశీయ స్టాక్ మార్కెట్లు ఊహించని పరిణామాలను చవిచూశాయి. మార్చి చివరలో సెన్సెక్స్, నిప్టీలు దారుణంగా దెబ్బతింటాయని, ఏడాది చివరలో జీవిత కాల గరిష్టాలను తాకుతాయని కానీ ఎవరూ ఊహించి ఉండరు. కొవిడ్ భయం, అంతర్జాతీయంగా చమురు ధరల పతనం, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం తదితర పరిణామాలతో బీఎస్‌ఈ సెన్సెక్స్ చరిత్రలో అతిపెద్ద సింగిల్ డే పతనం చవి చూసింది. మార్చి 23న ఏకంగా 3935 పాయింట్లకు పడిపోయింది. ఆ తర్వాత ఆర్‌బీఐ ద్రవ్య మద్దతుతో నిలదొక్కుకుంది. తిరిగి ఏప్రిల్ 7న అతిపెద్ద సింగిల్ డే లాభం 2476 పాయింట్లను సాధించింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్న సూచీలు నవంబర్ నాటికి జీవితకాల గరిష్ఠాలను చేరుకున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ రావడంతో మార్కెట్లు ర్యాలీలు మొదలుపెట్టాయి. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 18 వరకు 29 సెషన్లు జరగ్గా అందులో 22 సెషన్లు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. డిసెంబర్ 24 నాటికి క్యాలెండర్ ఏడాదికి సెన్సెక్స్ 13.86 శాతం, నిఫ్టీ 12.99 శాతం లాభపడ్డాయి. డిసెంబర్ 16న సెన్సెక్స్ జీవితకాల గరిష్టం 46,700కు చేరుకోగా, నిప్టీ 13,773 జీవితకాల గరిష్టాలను తాకింది.

తొలి సారిగా ఆర్థిక మాంద్యం: మొదటిసారిగా భారత్ 2008లో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో కూడా నిలదొక్కుకున్న భారత్ 2020లో కరోనా దెబ్బకు మాంద్యం బారినపడక తప్పలేదు. వినియోగం తగ్గిపోవడంతో దేశ చరిత్రలో తొలిసారిగా భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లిపోయింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ప్రతికూల వృద్ధి నమోదుకావడంతో సాంకేతికంగా మాంద్యంలోకి నెట్టివేయబడింది. బంగారానికి రెక్కలు: ఈ సంవత్సరంలో కరోనా వల్ల బంగారం ధర భారీగా పెరిగింది. కరోనా వల్ల స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైన సందర్భంలో పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గుచూపారు. దీంతో బంగారానికి వీపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,400 కాగా అది ఇప్పుడు రూ.59 వేల వరకు పెరిగింది. ఆ తర్వాత మార్కెట్ల ర్యాలీతో కొంత తగ్గినా రూ.50వేలకు పైగానే ఉంటూ సామాన్యులకు దూరంగా నిలిచింది.

మరింత సంపన్నులుగా మారిన వ్యాపారులు: కరోనా వ్యాప్తి కారణంగా అన్ని రంగాలు దెబ్బతినగా మరోవైపు భారతీయ బిలియనీర్లు మరింత సంపన్నులయ్యారు. కరోనాను కూడా వారికి అనుకూలంగా మార్చుకొని లాభాలను గడించారు. ఆసియా సంపన్నుడు ముఖేష్ అంబానీ అందరి కంటే ఎక్కువగా సంపాదించాడు. ఆరు నెలల పాటు గంటకు రూ.90 కోట్లు సంపాదించాడంటే ముఖేష్ అంబానీ ఏ స్థాయిలో ఎదిగారో ఊహించవచ్చు. ఏకంగా ఈ ఏడాదిలో తన సంపదను 73 శాతం పెంచుకున్నారు. తర్వాత స్థాయిలో గౌతమ్ అదానీ ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం గౌతమ్ అదానీ సంపద విలువ రోజుకు రూ.449 కోట్లతో ఏకంగా రూ.1.41 కోట్లు పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈయన సంపద 61 శాతం పెరిగింది. వీరి బాటలో హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్ నాడార్ సంపద 34 శాతం పెరిగింది. డీ మార్ట్ యజమాని రాధాకృష్ణ దమానీ సంపద 56 శాతం పెరిగింది. తర్వాత జాబితాలో దేశీయ అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరమ్ ఇన్సిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా సంపద 85 శాతం పెరిగింది.