Unemployment Rate: నిరుద్యోగ భారతం.. దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగ రేటు.. 16 నెలల గరిష్ట స్థాయికి..
భారతదేశంలో నిరుద్యోగ రేటు భారీగా పెరిగింది. భారతదేశంలో గడిచిన ఏడాది డిసెంబర్‌లో నిరుద్యోగిత రేటు 8.30%కి ఎగబాకినట్లు గణాంకాలు తేటతెల్లం చేశాయి.
Unemployment Rate in India: భారతదేశంలో నిరుద్యోగ రేటు భారీగా పెరిగింది. భారతదేశంలో గడిచిన ఏడాది డిసెంబర్‌లో నిరుద్యోగిత రేటు 8.30%కి ఎగబాకినట్లు గణాంకాలు తేటతెల్లం చేశాయి. డిసెంబర్‌లో నిరుద్యోగ రేటు 16 నెలల గరిష్ట స్ధాయిలో 8.30 శాతానికి పెరిగినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. నవంబర్‌లో నిరుద్యోగ రేటు 8 శాతం కాగా డిసెంబర్‌లో పెరిగి.. 8.3 శాతానికి చేరిందని ఆదివారం సీఎంఐఈ గణాంకాలు వెల్లడించాయి. CMIE డేటా ప్రకారం.. పట్టణ నిరుద్యోగ రేటు డిసెంబరులో 8.96% నుంచి 10.09%కి పెరిగింది. అయితే గ్రామీణ నిరుద్యోగం రేటు 7.55% నుంచి 7.44%కి పడిపోయిందని డేటా వెల్లడించింది. గ్రామీణ నిరుద్యోగం కొంత ఊరటనివ్వగా.. పట్టణ నిరుద్యోగం మాత్రం మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
CMIE మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ మాట్లాడుతూ.. నిరుద్యోగిత రేటు పెరుగుదల అనిపించేంత చెడ్డది కాదంటూ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇది కార్మిక భాగస్వామ్య రేటులో ఆరోగ్యకరమైన పెరుగుదలపైన వచ్చిందన్నారు. ఇది డిసెంబర్‌లో 40.48% పెరిగిందని.. 12 నెలల్లో అత్యధికమని తెలిపారు. ముఖ్యంగా, డిసెంబర్‌లో ఉపాధి రేటు 37.1%కి పెరిగిందదని.. ఇది జనవరి 2022 నుంచి మళ్లీ అత్యధికం కానుందని రాయిటర్స్‌తో అభిప్రాయపడ్డారు.
అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు కల్పించడం 2024లో జరిగే జాతీయ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనకు అతిపెద్ద సవాలుగా మారిందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, హర్యానాలో నిరుద్యోగ రేటు డిసెంబర్‌లో అత్యధికంగా 37.4 శాతానికి పెరగగా.. రాజస్ధాన్‌లో 28.5 శాతం, దేశ రాజధాని ఢిల్లీలో నిరుద్యోగ రేటు ఏకంగా 20.8 శాతంగా నమోదైందని సీఎంఐఈ గణాంకాలు తెలిపాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..