AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Afghanistan: అఫ్ఘాన్‌కు భారత్ భారీ సాయం.. మొదటి విడతగా 20,000 మెట్రిక్‌ టన్నుల గోధుమల పంపిణీ.. కారణం ఏమిటంటే..?

కరువుతో విలవిల్లాడుతున్న అఫ్గానిస్థాన్‌కు 20,000 మెట్రిక్‌ టన్నుల గోధుమలు సాయంగా పంపిస్తామని భారత్‌ ప్రకటించింది. ఇరాన్‌లోని..

India-Afghanistan: అఫ్ఘాన్‌కు భారత్ భారీ సాయం.. మొదటి విడతగా 20,000 మెట్రిక్‌ టన్నుల గోధుమల పంపిణీ.. కారణం ఏమిటంటే..?
India To Send 20,000 Metric Tonnes Of Wheat To Afghanistan
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 08, 2023 | 6:34 PM

Share

కష్టకాలంలో ఉన్న దేశాలకు చేతనైనంత సాయం చేయడంలో మన దేశం ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. ఆ విషయంలో మనందరం గర్వంచాల్సిందే. అయితే ఆ క్రమంలోనే ప్రస్తుతం కరువుతో విలవిల్లాడుతున్న అఫ్గానిస్థాన్‌కు 20,000 మెట్రిక్‌ టన్నుల గోధుమలు సాయంగా పంపిస్తామని భారత్‌ ప్రకటించింది. ఇరాన్‌లోని చాబహార్‌ నౌకాశ్రయం ద్వారా వీటిని పంపిస్తామని వెల్లడించింది. అఫ్గాన్‌పై భారత్‌-ఆసియా మధ్య దేశాల కమిటీ సమావేశంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. యూఎన్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా యుద్ధ కల్లోలిత ప్రాంతంగా ఉన్న అఫ్గాన్‌కు సాయంగా గోధుమలు పంపిస్తున్నామని భారత్‌ తెలిపింది. 2021 ఆగస్టులో ఆ దేశాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన పఠాన్లకు 50,000 మెట్రిక్‌ టన్నుల గోధుమలను పంపిస్తామని కేంద్రం వెల్లడించింది.

అయితే ఇందులో భాగంగా ప్రస్తుతానికి అంటే మొదటి విడతగా 20వేల టన్నులు పంపిస్తామని పేర్కొంది.  గతంలో కూడా కొన్ని గోధుమలను పాకిస్థాన్‌ రహదారి మార్గంలో పంపింది కేంద్రం. ఆ క్రమంలో కొన్ని నెలల పాటు చర్చించిన తర్వాత తమ దేశం నుంచి తిండి గింజలను పంపించేందుకు దాయాది అంగీకరించడం గమనార్హం. ‘అఫ్గాన్‌లోని ఆహార సంక్షోభాన్ని ఆసియా దేశాలు గమనించాయి. మానవతా దృక్పథంలో వారికి సాయం చేసేందుకు అంగీకరించాయి’ అని కేంద్రం తెలిపింది. అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు అఫ్గాన్‌ నేలను ఉపయోగించవద్దని ఆసియా దేశాలు స్పష్టం చేశాయి. దేశంలో నిజమైన సమ్మిళిత రాజకీయ విధానాలు రూపొందించాలని సూచించాయి. మహిళలు, మైనారిటీ హక్కులను కాపాడేలా ఉండాలని సూచించాయి. అదే విధంగా వారికి విద్యా హక్కు కల్పించాలని కోరాయి.

ఆ క్రమంలోనే అఫ్గానిస్థాన్‌లో మహిళలకు యూనివర్సిటీల్లో ప్రవేశాన్ని నిషేధించడంతో కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో కలిసి తాలిబాన్లను విమర్శించింది. ప్రాంతీయ ఉగ్రవాదం, తీవ్రవాదం, మితిమీరిన దూకుడు, డ్రగ్‌ ట్రాఫికింగ్‌ వంటి అంశాలను ఆసియా దేశాలు నేడు చర్చించాయి. వీటిని అడ్డుకొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చించాయి. అఫ్గాన్‌లో ఉగ్రవాదానికి నివాసం, ట్రైనింగ్‌, ప్లానింగ్‌, ఆర్థిక సాయం చేయకూడదన్నాయి. భారత్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కజక్‌స్థాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తజికిస్థాన్‌, తుర్కెమెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ దేశాల సీనియర్‌ ప్రతినిధులు, ప్రత్యేక రాయబారులు పాల్గొన్నారు. యూఎన్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌, డ్రగ్స్‌- నేరాలపై యూఎన్‌ కార్యాలయ అధికారులు వచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..