వరి సాగులో చైనాను అధిగమించిన భారత్.. కొత్తగా 184 పంట రకాలు ఆవిష్కరణ.. త్వరలోనే..
ప్రపంచంలో అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ నంబర్ 1 స్థానానికి చేరింది. భారత్ ప్రపంచానికి బియ్యం ఇచ్చే స్థితిలో ఉంది. వ్యవసాయ రంగంలో శక్తి వంతమైన భారత్ గా రూపుదిద్దుకుంటుంది.. ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత భారత మహా యజ్ఞం జరుగుతుంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ఒక విత్తనంగా ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్..

యావత్ ప్రపంచానికి ఆహారాన్నందించే దిశగా భారత రైతుల పంట దిగుబడిని పెంచడం కోసం దేశంలో వ్యవసాయ రంగం ఆత్మనిర్భరత దిశగా ముందుకువెళ్తుంది. దేశంలో రైతుల పంట దిగుబడులను మరింత పెంచడం, వాతావరణ మార్పులకు అనుకూలంగా మార్చడం, వ్యాధులు-తెగుళ్ల నిరోధకతను కల్పించడం లక్ష్యంగా 25 రకాల క్షేత్ర పంటలకు చెందిన 184 కొత్త రకాలను కేంద్ర వ్యవసాయశాఖ రైతులకు అంకితం చేసింది. న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ (NASC)లో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నూతన పంట రకాలను ఆవిష్కరించారు. ICAR సంస్థలు, రాష్ట్ర/కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విత్తన కంపెనీల సమిష్టి కృషి ఫలితంగా నూతన పంట రకాలు రానున్న మూడేళ్లలో దేశంలో రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం 184 రకాల్లో 61 రకాలు ICAR విశ్వవిద్యాలయాల నుంచి, 62 రకాలు ప్రైవేట్ రంగం నుంచి వచ్చాయి. 1969 నుంచి ఇప్పటి వరకు మొత్తం 7,205 మెరుగైన పంట రకాలు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కేంద్రం ప్రకటించింది. గత 11-12 సంవత్సరాల్లోనే 3,236 రకాలు ఆవిష్కృతం కాగా వీటిలో 1,661 గత ఐదేళ్లలో విడుదలయ్యాయి. ఇది విత్తనాల పరిశోధన వేగాన్ని సూచిస్తుంది. దేశవ్యాప్త రైతులు, వ్యవసాయ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, విత్తన డీలర్లలో ఈ కొత్త రకాల అవగాహన పెంచి, వాటి సాగును ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్ర వ్యవసాయ శాఖ పనిచేస్తుంది. దేశంలో రైతులకు మొత్తం 7205 పంట రకాలు అందుబాటులో ఉన్నాయి.
తృణధాన్యాల్లో కొత్త 122 రకాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. వరిలో 60 రకాలు, మొక్కజొన్నలో 50 రకాలు, జొన్నలో నాలుగు రకాలు, సజ్జలు/బజ్రా మిల్లెట్లో ఐదు రకాలు, రాగి, సామలు స్మాల్ మిల్లెట్, వరిగలు (ప్రోసో మిల్లెట్) ఒక్కొక్క రకం రైతులకు అందుబాటులోకి రానుంది.. పప్పుధాన్యాలలో రైతులకు 6 నూతన వెరైటీలు అందుబాటులోకి రానున్నాయి. కందిలో ఒక రకం , పెసరపప్పులో రెండు రకాలు, మినపపప్పులో మూడు రకాలు అందుబాటులోకి రానున్నాయి. నూనెగింజల్లో 13 రకాలు అందుబాటులోకి రానున్నాయి. ఆవాలలో మూడు రకాలు, కుసుమలో నాలుగు రకాలు, నువ్వులు రెండు రకాలు, వేరుశనగ, గోబీ సర్సన్, ఆముదం ఒక్కొక్క రకం రైతులకు అందుబాటులోకి రానున్నాయి. పశుగ్రాస పంటల్లో 11 రకాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఓట్స్ పశుగ్రాస జొన్న రెండు రకాలు, పశుగ్రాస మొక్కజొన్న ఒకరకం, పశుగ్రాస పెర్ల్ మిల్లెట్ 6 రకాలు అందుబాటులోకి రానున్నాయి. చెరకులో 6 కొత్త రకాలు అందుబాటులోకి రానున్నాయి. పత్తిలో 24 కొత్త రకాలు వస్తుండగా వీటిలో 22 బీటీ పత్తి హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. జనుము, పొగాకు సంబంధించి కూడా కొత్త రకాలు అందుబాటులోకి రానున్నాయి
ప్రత్యేక లక్షణాలతో కొత్త పంట రకాలు..
నూతన పంట రకాలు దేశంలోని వివిధ వ్యవసాయ వాతావరణ ,భౌగోళిక పరిస్థితులు అనుగుణంగా అభివృద్ధి చేయబడ్డాయి. అధిక దిగుబడితో పాటు వాతావరణ మార్పులు, కరువు, లవణీయత, వ్యాధులు, తెగుళ్లకు నిరోధకత కలిగి ఉంటాయి. కొన్ని రకాలు బయోఫోర్టిఫైడ్ పోషకాహార బలోపేతం, అధిక ప్రోటీన్ లక్షణాలను కలిగి ఉన్నాయి. వరిలో కలుపు మందుల నిరోధకత కోసం (CR ధాన్ 812), లవణీయత తట్టుకునేందుకు (CSR 64), బాక్టీరియల్ బ్లైట్ నిరోధకత (DRR ధాన్ 83, 85, 89, 91), కరువు పరిస్థితులు తట్టుకునేందుకు OUAT కళింగ ధాన్ 20 రకాలు అందుబాటులోకి రానున్నాయి. మొక్కజొన్నలో బయోఫోర్టిఫైడ్ హైబ్రిడ్‌లు (IQMH సిరీస్, APQH 1, 5), త్వరగా పండే రకాలు, బహుళ వ్యాధి నిరోధకత లక్షణాలు కలిగిఉండనున్నాయి.
జొన్నలు మిల్లెట్లలో బయోఫోర్టిఫైడ్ జొన్న (CSH 56, 57), అధిక ప్రోటీన్ ప్రోసో మిల్లెట్ (అలూరి) రకాలు అందుబాటులోకి రానున్నాయి. పప్పుధాన్యాలు నూనెగింజలలో కరువు నిరోధక, అధిక నూనె శాతం ఉండేలా వేరుశనగ (GNH 804), వేసవి సాగుకు అనువైన నువ్వుల రకాలు అందుబాటులోకి రానున్నాయి. చెరకు, పత్తి లాంటి పంటలలో ఉప్పునీరు-కరువు పరిస్థితులు ఎదుర్కొనేందుకు చెరకు (CO PB 100), బహుళ తెగుళ్ల నిరోధక బీటీ పత్తి రకాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నూతన రకాలు రైతుల ఆదాయాన్ని పెంచి, ఆహార భద్రతను బలోపేతం చేస్తాయని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
వరి సాగులో చైనాను అధిగమించిన భారత్
ప్రపంచంలో అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ నంబర్ 1 స్థానానికి చేరింది. భారత్ ప్రపంచానికి బియ్యం ఇచ్చే స్థితిలో ఉంది. వ్యవసాయ రంగంలో శక్తి వంతమైన భారత్ గా రూపుదిద్దుకుంటుంది.. ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత భారత మహా యజ్ఞం జరుగుతుంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ఒక విత్తనంగా ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఆహార భద్రత, మంచి విత్తనాలు, పంటల వైవిధ్యం పై దృష్టి సారించిన కేంద్రం.. జీ రామ్ జి ఉపాధి హామీపనులను వ్యవసాయ పనులకు అనుసంధానించే దిశగా ఆలోచన చేస్తుందన్నారు.. వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన మార్పులపై ఆయా రాష్ట్రాలతో మాట్లాడి రాష్ట్రాల రోడ్ మ్యాప్ రూపొందిస్తుందన్నారు. దేశం కోసం రైతుల కోసం వ్యవసాయ శాఖ పరిశోధనలు కొనసాగుతూనే ఉంటాయన్నారు.. రబీ,ఖరీఫ్ పంట కాలానికి సంబంధించిన కసరత్తును ఏప్రిల్ నెల నుంచే ప్రారంభిస్తామన్నారు.
త్వరలో నూతన విత్తన చట్టం..
రైతులకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు అందించడం కోసం నూతన విత్తన చట్టాన్ని రూపొందిస్తుంది కేంద్రం.. ఇప్పటికే రైతులు, శాస్త్రవేత్తలు, భాగస్వాముల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటుంది. కేబినెట్ ఆమోదం తర్వాత వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నూతన విత్తన చట్ట బిల్లు తీసుకురానున్నట్లు తెలిపారు శివరాజ్ సింగ్ చౌహాన్.. నూతన విత్తన చట్టం కోసం వ్యవసాయ శాఖ టీమ్ పనిచేస్తుందని కల్తీ లేనివిత్తనాలను రైతులకు అందించడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
