‘ఆ పార్టీ నేతను నరికి చంపా..’ రక్తమోడుతున్న గొడ్డలితో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 18 ఏళ్ల యువతి
ఓ 18 ఏళ్ల యువతి రక్తమోడుతున్న గొడ్డలితో రోడ్డుపై నడుచుకుంటూ నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. అక్కడ పోలీసులకు ఓ పార్టీ నేతను గొడ్డలితో తన చేతులతోనే నరికి చంపానని చెప్పింది. అది విన్న పోలీసులు మొదట షాకైన తర్వాత తేరుకుని యువతిని అరెస్ట్ చేశారు. రాజకీయం, ఆత్మగౌరవం మధ్య జరిగిన ఈ హత్యోదంతం ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లా బబేరు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందంటే..

థానే, జనవరి 4: ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లా బబేరులో గురువారం మధ్యాహ్నం మురవల్ గ్రామానికి చెందిన ఓ 18 ఏళ్ల యువతి చేతిలో రక్తం నిండిన గొడ్డలితో నేరుగా పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించింది. పోలీసుల ముందు ఏ మాత్రం భయం లేకుండా నేను సమాజ్‌వాదీ పార్టీ నేత సుఖ్‌రాజ్ ప్రజాపతిని (50) హత్య చేశాను అని చెప్పింది. గత కొంతకాలంగా తనను వేధిస్తున్నాడనీ అందుకే చంపినట్లు తెలిపింది. యువతి మాటలకు పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే ఆమె వద్ద ఉన్న గొడ్డలిని స్వాధీనం చేసుకుని, ఆమెను వెంటబెట్టుకుని సదరు గ్రామానికి వెళ్లారు. అక్కడ ఓ గదిలోని మంచంపై సుఖ్‌రాజ్ ప్రజాపతి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటం వారి కంట పడింది. అతడి తలపై గొడ్డలితో బలంగా వేసిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెంటనే పోలీసులు శవాన్ని పోస్ట్‌మార్టంకు పంపి, ఆ యువతిని కస్టడీలోకి తీసుకున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ రాజవత్ తెలిపారు.
ఈ హత్య ఎందుకు జరిగిందంటే?
భారతి అనే ఆ యువతి తండ్రి ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుండి తల్లి కుట్టుపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. వారి ఎదురింట్లో ఉండే సుఖ్‌రాజ్ ప్రజాపతి ఆర్థిక సాయం చేసే నెపంతో వారి ఇంట్లోకి చొరబడేవాడు. ఈ క్రమంలో భారతి తల్లికి, సుఖ్‌రాజ్‌కు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్తా కుటుంబంలో గొడవలకు దారితీసింది. ఈ క్రమంలో సుఖ్‌రాజ్ తరచూ మద్యం సేవించి వారి ఇంటికి రాసాగాడు. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం భారతి తల్లి పొలానికి వెళ్లగా.. మద్యం మత్తులో ఉన్న సుఖ్‌రాజ్ ఇంట్లోకి చొరబడి భారతిపై అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం కాళికా మాతగా మారిన భారతి గొడ్డలితో అతడి తలపై వేటు వేసింది. ఒకే దెబ్బకు అతడు నేలకొరిగాడు. ఆ తర్వాత కూడా మరో 2 సార్లు వేటు వేయడంతో అక్కడికక్కడే మరణించాడు. హత్య అనంతరం భారతి సుమారు కిలోమీటర్ దూరం నడిచి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఆయుధంతో సహా లొంగిపోయింది. శుక్రవారం ఆమెను కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
భారత శిక్షాస్మృతిలోని 96–100 సెక్షన్ల ప్రకారం వ్యక్తిగత రక్షణ హక్కు ఉంది. గతంలో జరిగిన అనేక కేసుల్లో దాడులకు ప్రయత్నించిన సమయంలో పురుషులను చంపిన మహిళలకు బెయిల్ మంజూరు చేశారు. ఆత్మరక్షణకు హత్య చేసినట్లు ఆధారాలు లభించిన వారిని విడుదల కూడా చేశారు. హత్య ఆత్మరక్షణ కోసం జరిగిందా లేదా అనే విషయం వాదనల సమయంలో కోర్టులు పరిశీలిస్తాయి. తప్పుడు వాదనలను తీవ్రంగా పరిగణిస్తారు. ఆధారాలు కల్పితమని నిరూపిస్తే FIRలను రద్దు చేసే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




