చనిపోయిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం.. కోడలిని చంపిన అత్త!
ఎన్నో ఆశలతో కొడుకును పెంచి, చదివించింది ఆ తల్లి. మంచి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో చక్కని చుక్కను చూసి పెళ్లి కూడా చేసింది. అయితే కొడుకు అనుకోకుండా హఠన్మరణం పొందాడు. దీంతో అత్తా కోడళ్ల మధ్య మరణించిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం కోసం గొడలు ప్రారంభమైనాయి. ఈ క్రమంలో మృతుడి తల్లి దారుణానికి పాల్పడింది..

థానే, జనవరి 4: మరణించిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ తల్లి దారుణానికి పాల్పడింది. మరో వ్యక్తితో కలిసి కోడలిని హత్య చేసింది. అనంతరం కోడలి మృతదేహాన్ని ఒకచోట పడేసి.. ఏం తెలియనట్లు కోడలు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అసలు గుట్టు రట్టు చేయడంతో అత్తతో పాటు ఆమెకు సహకరించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జనవరి 1న కల్యాణ్ ప్రాంతంలోని వాల్ధుని వంతెన సమీపంలో తల, ముఖంపై తీవ్ర గాయాలతో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు మహిళను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మొదట మహాత్మా ఫులే చౌక్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదవశాత్తు కేసు నమోదు చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పంపించారు. ఇదిలా ఉంటే.. ఆ మర్నాడు తన కోడలు రూపాలి (35) ఉదయం నుంచి కనిపించడం లేదని అత్త లతాబాయి (60) స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వాల్ధుని వంతెన వద్ద లభించిన మృతదేహాన్ని ఆమె చూపగా.. తన కోడలు రూపాలిగా ఆమె గుర్తించింది. అయితే అత్త తీరుపై పోలీసులకు అనుమానం కలగడంతో ఇన్‌స్పెక్టర్ విజయ్ నాయక్ నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ తమదైన శైలిలో ఆమెను ప్రశ్నించగా కోడలిని హత్య కథ బయటపడింది.
లతాబాయి కుమారుడు విలాస్.. రైల్వే ఉద్యోగి. అతడు 2025 సెప్టెంబర్‌లో మరణించాడు. దీంతో సుమారు రూ.10 లక్షల గ్రాట్యుటీ డబ్బు కోడలు రూపాలికి ప్రభుత్వం అందించింది. ఆ డబ్బు తనకు ఇవ్వాలని అత్త లతాబాయి కోడలు రూపాలిని డిమాండ్ చేసింది. దీనితోపాటు కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం కూడా కోడలికి, అత్తకు మధ్య గొడవలు జరిగాయి. తన 15 ఏళ్ల మనవడిని కారుణ్య ప్రాతిపదికన ఆ ఉద్యోగంలో నియమించాలని పట్టుపట్టింది. కోడలు రూపాలి ఒప్పుకోకపోవడంతో లతాబాయి తన స్నేహితుడు జగదీష్ మహాదేవ్ మాత్రే (67)తో కలిసి రూపాలి హత్యకు ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం డిసెంబర్ 31న రాత్రి ఈ ఇద్దరు ఐరన్ రాడ్‌తో రూపాలి తలపై కొట్టి చంపారు. అనంతరం మృతదేహంపై ఉన్న రక్తం మరకల దుస్తులను మార్చి వంతెన సమీపంలో పడేసింది. అనుమానం రాకుండా ఆ మర్నాడే కోడలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి కేసును తప్పుదోవ పట్టించేందకు ప్రయత్నించి దొరికిపోయారని కళ్యాణ్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కళ్యాణ్ జీ గేటే తెలిపారు. పోలీసులు చాకచక్యంగా హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లు చెప్పారు. హత్య, సాక్ష్యాలను మాయం చేయడంపై కేసు నమోదు చేసి లతాబాయి, మాత్రేలను అరెస్టు చేసినట్లు కమిషనర్ కళ్యాణ్ జీ గేటే లిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




