Hunger Index: ఆకలి సూచిలో మరింత దిగజారిన ర్యాంకు.. శ్రీలంక, పాకిస్తాన్ ముందంజ.. కొట్టిపారేసిన కేంద్రం
మన దేశం కంటే పాకిస్తాన్, శ్రీలంకలు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉన్నాయి. కానీ ఓ విషయంలో మాత్రం ఈ రెండు దేశాలు మన కంటే ముందు వరసలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి స్థాయి, పోషకాహార లోపాలు సూచించే..
మన దేశం కంటే పాకిస్తాన్, శ్రీలంకలు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉన్నాయి. కానీ ఓ విషయంలో మాత్రం ఈ రెండు దేశాలు మన కంటే ముందు వరసలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి స్థాయి, పోషకాహార లోపాలు సూచించే ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం మరింత దిగ జారింది. మొత్తం 121 దేశాలను పరిగణనలోకి తీసుకోగా మన దేశం107వ స్థానంలో నిలిచింది. అయితే ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న శ్రీలంక 64, పాకిస్థాన్ 99 స్థానంలో ఉండటం చర్చించుకోదగ్గ విషయం. జీహెచ్‌ఐ వార్షిక నివేదికను కన్‌సర్న్ హంగర్, వెల్తుంగర్ హిల్ఫ్ సంస్థలు సంయుక్తంగా ప్రచురించాయి. గతేడాది ఇదే సూచీలో భారత్ 101 స్థానంలో ఉంది. అయితే ఈసారి మరింత దిగజారిపోవడం విమర్శలకు కారణమవుతోంది. ఆకలి, పౌష్టికాహార లోపం వంటి అంశాలపై ప్రధాని మోదీ ఎప్పుడు స్పందిస్తారని కాంగ్రెస్ నేత పి.చిదంబరం ప్రశ్నించారు. దేశంలో 22.4 కోట్ల మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, ఆకలి సూచీలో భారత్ దాదాపుగా అట్టడుగు స్థానానికి చేరుకుందని ట్వీట్ చేశారు.
అయితే..ఈ ఆరోపణలను ప్రభుత్వం కొట్టి పారేసింది. ఆకలి స్థాయుల్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉందంటూ ఈ నివేదికను ఖండించింది. ఏది ఏమైనా ఆకలి స్థాయి, పోషకాహార లోపాల సూచీలో శ్రీలంక, పాకిస్తాన్ కంటే మనదేశం వెనుకబడిపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. మోడీ సర్కార్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శిస్తున్నారు. అయితే ఈ సూచీ శాస్త్రీయబద్ధంగా జరగలేదనేది కేంద్రం వాదన.
కాగా.. అంతర్జాతీయంగా భారత్ కు ఉన్న ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే తక్కువ ర్యాంకింగ్ ఇచ్చారని ప్రభుత్వం ఆరోపించింది. మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని ఆ జాబితా రూపొందించలేదని కేంద్ర మహిళ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత దేశ జనాభాలో కేవలం 3 వేల మంది నుంచి సేకరించిన సమాచారంతో తాజా ర్యాంకింగ్ ఇచ్చారని, ఇది సహేతుకం కాదని కేంద్రం స్పష్టం చేసింది.