Nitin Gadkari: భారత్ ధనిక దేశమే.. కాని.. ‘పేదదే’.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన భారత్.. ధనిక దేశం అయినప్పటికి పేద ప్రజలు, ఆకలి చావులు, నిరుద్యోగం, కులతత్వం, అంటరానితనం, ద్రవ్యోల్పణం వంటి సమస్యలను ఎదుర్కొంటుందని కేంద్ర..

Nitin Gadkari: భారత్ ధనిక దేశమే.. కాని.. 'పేదదే'.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
Nitin Gadkari
Follow us

|

Updated on: Sep 29, 2022 | 9:34 PM

ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన భారత్.. ధనిక దేశం అయినప్పటికి పేద ప్రజలు, ఆకలి చావులు, నిరుద్యోగం, కులతత్వం, అంటరానితనం, ద్రవ్యోల్పణం వంటి సమస్యలను ఎదుర్కొంటుందని కేంద్ర రవాదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దేశంలో ధనిక, పేదల మధ్య అంతరం పెరిగిందని, దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పరివార్ సంస్థ అయిన భారత వికాస్ పరిషత్ (బివిపి) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికి పేద ప్రజలతో కూడిన ధనిక దేశం భారత్ అని అన్నారు. దేశం ధనికమైనది అయినప్పటికి ఇక్కడి జనాభా పేదవారని, ఆకలి, నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, కులతత్వం, అంటరానితనం అనే అంశాలు ఎంతో ప్రభావం చూపుతున్నాయని, ఇవి సమాజ పురోగతికి మంచివి కావన్నారు. ధనికులు, పేదల మధ్య అంతరం తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో సామాజిక, ఆర్థిక సమానత్వం నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక అసమానతలాగే ఆర్థిక అసమానత కూడా పెరిగిందని వ్యాఖ్యానించారు. పేద, ధనిక అంతరాన్ని తగ్గించేందుకు విద్య, ఆరోగ్యం, సేవల రంగాల్లో మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని గడ్కరీ తెలియజేశారు.

భారత్ వికాస్ పరిషత్ లక్ష్యం కూడా స్పష్టంగా ఉందని, సమాజంలో మార్పు తీసుకురావడానికి తనవంతు ప్రయత్నం చేస్తోందన్నారు. సామాజిక బాధ్యత, సామాజిక స్పృహతో వివిధ రంగాల్లో ఎలా పని చేయాలనేదే మన ముందున్న అతిపెద్ద సవాలన్నారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలన్నారు. దేశంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దేశంలోని సామాజికంగానూ, విద్య, ఆరోగ్య రంగాల్లో వెనుకబడిన 124 జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ఐక్యంగా కృషిచేయాలన్నారు.

పట్టణ ప్రాంతాలు అభివృద్ధికి తార్కాణాలుగా నిలుస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు, అవకాశాలు తగినంతగా లేకపోవడంతో అక్కడి జనం భారీగా నగరాలకు వలస వెళ్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల సాధికారత సాధించే దిశగా భారత్‌ వికాస్‌ పరిషత్‌ లాంటి సంస్థలు కృషిచేయాలని ఈ సందర్భంగా కోరారు. 21వ శతాబ్దం భారత్‌దేనని స్వామి వివేకానందుడు చెప్పారని.. దేశ ప్రగతికి ప్రతిఒక్కరూ తమ సహకారం అందించాలని గడ్కరీ విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..