Bharat Jodo Yatra: కర్ణాటకలో చిరిగిన కాంగ్రెస్ పోస్టర్లు.. రాష్ట్ర ప్రభుత్వంపై హస్తం పార్టీ విమర్శలు.. అసలు ఏమైందంటే..

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ యువనేత, ఎంపీ రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర అనేక వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. ఓవైపు బీజేపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఓ డ్రామా అంటూ..

Bharat Jodo Yatra: కర్ణాటకలో చిరిగిన కాంగ్రెస్ పోస్టర్లు.. రాష్ట్ర ప్రభుత్వంపై హస్తం పార్టీ విమర్శలు.. అసలు ఏమైందంటే..
Congress Posters
Follow us

|

Updated on: Sep 29, 2022 | 9:59 PM

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ యువనేత, ఎంపీ రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర అనేక వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. ఓవైపు బీజేపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఓ డ్రామా అంటూ విమర్శలు చేస్తుంటే.. మరోవైపు బీజేపీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగిపోయిందని, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ధరల పెరుగుదలతో దేశ ప్రజలంతా అల్లాడిపోతున్నారంటూ రాహుల్ గాంధీ తన భారత్ జోడో పాదయాత్రలో కేంద్రప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీని దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కాంగ్రెస్ నాయకులే ఆపార్టీపై విశ్వాసంతో లేరంటూ బీజేపీ నాయకులు సైతం కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఓ విషయం తీవ్ర రచ్చ రాజేస్తోంది.

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు కాంగ్రెస్‌ రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో పాదయాత్ర సెప్టెంబర్ 30వ తేదీ శుక్రవారం కర్ణాటకలోకి ప్రవేశించనుంది. ఆయన పర్యటనకు ఒక్కరోజు ముందు రాహుల్‌కు ఆహ్వానం పలుకుతూ కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన పోస్టర్లు చించివేయడం కలకలం రేపింది. ఇది కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం పనేనంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. సెప్టెంబర్‌ 7వ తేదీన ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పూర్తయ్యింది. శుక్రవారం నుంచి కర్ణాటకలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశించనుంది. రాహుల్‌ పర్యటన నేపథ్యంలో కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా కేరళ సరిహద్దు జిల్లా అయిన చామరాజనగరలో రాహుల్‌ గాంధీకి స్వాగతం పలుకుతూ భారీ స్థాయిలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే, రాహుల్‌తో పాటు కర్ణాటక కాంగ్రెస్‌ నాయకుల పోస్టర్లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఇది ముమ్మూటికీ ‘40 శాతం కమీషన్‌ బొమ్మై సర్కారు పనే’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. బీజేపీని ఉద్దేశించి ఈపని భారత్‌ టోడో గూండాల పనే అంటూ కర్ణాటక కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి రణ్‌దీప్‌ సూర్జేవాలా ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అసమానతలు, విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరును ఎవరూ ఆపలేరని ఆయన ట్వీట్‌ చేశారు. కొన్ని పోస్టర్లను చించివేయడంతో పాటు మరికొన్నింటిని తగలబెట్టారని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆరోపించారు. ఎన్ని చేసినా తాము తలొగ్గేది లేదని, ఆ విషయాన్ని బీజేపీ గుర్తించాలని డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ పోలీసులు జోక్యం చేసుకోకుంటే తర్వాత ఏం చేయాలన్నది తాము చూస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

కాంగ్రెస్ ఆరోపణలపై కర్ణాటక సీఏం బసవరాజ్‌ బొమ్మై స్పందించారు. ఎవరు ‘భారత్‌ జోడో’ చేస్తున్నారో ఎవరు ‘టోడో’ చేస్తున్నారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఎవరి పోస్టర్లూ చించాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ తమ పార్టీపై అవాస్తవ ఆరోపణలు చేస్తోందన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రకు విశేష స్పందన వస్తోందని, అది చూసి బీజేపీ ఓర్వ లేకపోతుందని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి, బీజేపీ కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతోందని, దీనిలో భాగంగా తమ పోస్టర్లను చించివేస్తూ, నీచ రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకులు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..