AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యా చమురుతో లాభం ఎవరికి? చౌక ధరకే ముడి చమురు దొరికినా ధరలు ఎందుకు తగ్గలే? అమెరికా ఆరోపణలు నిజమేనా?

ఇటీవలే రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోలు నేపథ్యంలో భారత్ పై 25శాతం అదనపు సుంకాన్ని వేసిన అమెరికా.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయం వల్ల కొందరు వ్యాపారవేత్తలకే లాభం తప్ప సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నది అమెరికా ఆరోపించింది. అమెరికా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి. అయితే ఈ వ్యాఖ్యల్లో నిజమెంతో తెలుసుకోవాలంటే.. మనం గతంలోకి వెళ్లాల్సిందే..

రష్యా చమురుతో లాభం ఎవరికి? చౌక ధరకే ముడి చమురు దొరికినా ధరలు ఎందుకు తగ్గలే? అమెరికా ఆరోపణలు నిజమేనా?
India And Russia Oil Deal
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Aug 21, 2025 | 6:16 PM

Share

ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం మొదలైన తర్వాత అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. ఆ దేశం నుంచి దిగుమతులను నిషేధించడం లేదా పూర్తిగా పరిమితం చేశాయి. అంతేకాదు, రష్యా నుంచి ఎలాంటి కొనుగోళ్లు, దిగుమతులు చేయరాదని ఇతర ప్రపంచ దేశాలను సైతం ఒత్తిడి చేశాయి. ఈ ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారతదేశం మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతులు చేపట్టింది. ఇంకా చెప్పాలంటే ప్రపంచ మార్కెట్ ధరల కంటే చౌకగా ఈ కొనుగోళ్లు సాగాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రష్యా నుంచి చౌకగా ముడి చమురు (Crude Oil) కొనుగోలు చేయడాన్ని దేశ ప్రయోజనాల రీత్యా తెలివైన చర్యగా పాలకులు అభివర్ణించారు. కానీ ఇప్పుడు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ చేసిన సంచలన వ్యాఖ్యలతో ఈ కథలో అసలు నిజమెంత అన్న అనుమానాలు మొదలయ్యాయి. “భారత ప్రజలు చౌక ఇంధనాన్ని ఎప్పుడూ చూడలేదు. కానీ కొన్ని బడా కుటుంబాలు రూ.1.3 లక్షల కోట్లు (సుమారు $16 బిలియన్లు) లాభాలు తెచ్చుకున్నాయి” అని ఆయన ఆరోపించారు.

రష్యన్ చమురు – ప్రజల కోసం కాదు, కంపెనీల లాభాల కోసమే?

2024లో భారత పార్లమెంటు ఆమోదించిన “కొత్త ఆయిల్‌ఫీల్డ్స్ బిల్” ప్రకారం భారత ప్రభుత్వం చమురు రంగంలో పెట్టుబడులకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను ప్రోత్సహించే చర్యలు తీసుకుంది. అదే సమయంలో Exxon Mobil, Equinor, Petrobras వంటి అంతర్జాతీయ దిగ్గజాలు భారత సముద్ర తీరాల్లో చమురు వెలికితీతకు ఆసక్తి చూపుతున్నాయి. కొత్త చమురు నిక్షేపాలను గుర్తించి, అక్కడి నుంచి చమురు వెలికితీసి, శుద్ధి చేసి ప్రజలకు అందించినప్పుడే ఈ ప్రయోజనాలు ప్రజలకు చేరుతాయి. కానీ ప్రస్తుత భారతదేశ డిమాండ్‌ను ఇప్పటికిప్పుడు భర్తీ చేయలేవు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఈ అన్వేషణలు ఉపయోగపడతాయి.

భారత ప్రభుత్వం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమరు ప్రతి బ్యారెల్‌పై $5 డాలర్ల నుంచి $30 డాలర్ల వరకు డిస్కౌంట్ పొందుతోది. అంటే అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే చాలా చవకగానే ఈ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. యుద్ధాలు, వివిధ దేశాల్లో అనిశ్చితి కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయని, ఆ పెరుగుదల నుంచి భారత ప్రజలకు రక్షణ కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. కానీ.. వాస్తవ పరిస్థితిని గమనిస్తే.. పెట్రోల్ ధర ఢిల్లీలో ₹95, డీజిల్ ధర ₹88కి అటూ ఇటుగా అదే రేంజ్‌లో కొనసాగుతూ వస్తోంది. గత ఏడాది ధరలతో పోలిస్తే పెద్దగా మార్పు లేదని స్పష్టమవుతోంది. అంటే ధరలు మరింత పెరగలేదు అన్నదే ఉపశమనంగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ నిజానికి అసలు కథ మరోలా ఉంది.

రష్యా ముడి చమురుతో వీరికే లాభం

భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్న రష్యా ముడి చమురు కారణంగా భారతీయులందరికీ ఆ ప్రయోజనాలు అందాలి. కానీ రష్యా చౌక చమురుతో కొందరే లాభపడ్డారు. వారు ఎవరో ఇక్కడ తెలుుకుందాం.

ప్రభుత్వ రంగం చమురు సంస్థలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రష్యా ముడి చమురు కారణంగా విశేష లాభాలు గడించాయి. ఏడాది వ్యవధిలో ఈ సంస్థల లాభాలు ₹3,400 కోట్ల నుంచి ఏకంగా ₹86,000 కోట్లకు ఎగబాకాయి. BPCL లాభాల్లో పెరుగుదల శాతం 1,300% మేర పెరిగింది. అంటే చౌకగా ముడి చమురు దొరికినప్పటికీ.. ఆ ప్రయోజనాన్ని ప్రజలకు చేర్చకుండా అప్పటికే ఉన్న ధరను కొనసాగిస్తూ తమ కంపెనీల లాభాల మార్జిన్ పెంచుకున్నాయి.

ప్రైవేట్ రిఫైనరీలు – Reliance, Nayara Energy

ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే ప్రైవేట్ రిఫైనరీలు కూడా రష్యా చౌక ముడి చమురు కారణంగా లాభపడ్డాయి. రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా యూరప్ దేశాలు ఆ దేశం నుంచి నేరుగా ముడి చమురును దిగుమతి చేసుకోలేకపోయాయి. కానీ ఆ దేశాల అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తున్న తరుణంలో భారత ప్రైవేట్ రిఫైనరీలు తెలివిగా సొమ్ము చేసుకున్నాయి. రష్యా నుంచి చౌకగా ముడి చమురు దిగుమతి చేసుకుని, శుద్ధి చేసి.. పెట్రోల్, డీజిల్ రూపంలో యూరప్ దేశాలకు అమ్ముకుని భారీగా లాభాలు గడించాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు:

రష్యా క్రూడ్ ఆయిల్ కారణంగా ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ పెట్రోలియం కంపెనీలు మాత్రమే కాదు.. భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీగా సొమ్ము చేసుకున్నాయి. చౌక ముడి చమురు ప్రయోజనాలను వినియోగదారులకు మళ్లిస్తే.. ఆ మేరకు ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని కూడా కోల్పోతాయి. ఉదాహరణకు.. రూ. 100 గా ఉన్న పెట్రోల్‌పై పన్ను రూపంలో ఒక ప్రభుత్వానికి 20% (అంటే రూ. 20) లభిస్తుంది అనుకుంటే.. పెట్రోల్ ధరను రూ. 50కి తగ్గించినప్పుడు పన్నురూపేణా కేవలం రూ. 10 మాత్రమే ప్రభుత్వానికి అందుతుంది. అందుకే అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు తమ పన్ను రేట్లు తగ్గించకుండా రష్యా చౌక చమురు కారణంగా వచ్చే ఆదాయాన్ని వదులుకోలేదు. ఇంధనంపై పన్నుల ద్వారా ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు ₹4.7 లక్షల కోట్లు ఆదాయం వస్తోంది. ధరలు పెరిగితే పన్ను ఆదాయం మరింత ఎక్కువ అవుతుంది. అందుకే పెట్రోల్ పంప్‌ల వద్ద ధరలు తగ్గించడం ప్రభుత్వాలకు పెద్దగా ప్రాధాన్యత కాదని అర్థమవుతోంది.

డీ రెగ్యులేషన్ ఎక్కడ..?

గతంలో అంతర్జాతీయ చమురు ధరల్లో హెచ్చుతగ్గులున్నా.. ఆ భారం వినియోగదారులపై పడకుండా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చేవి. అయితే గత దశాబ్ద కాలంగా ఈ సబ్సిడీల భారం పెరిగిపోయి ప్రభుత్వాల ఆదాయం పూర్తిగా వీటికే ఖర్చయిపోతుందని గుర్తించాయి. ఈ క్రమంలో క్రమంగా పెట్రోలియం ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా విక్రయించుకునేలా డీరెగ్యులేషన్ చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు దేశంలో పెట్రోల్, డీజిల్ తదితర పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతూ వచ్చాయి. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు.. ఆ మేరకు వినియోగదారులకు కూడా ఉపశమనం లభించేది. కానీ ప్రస్తుతం ఈ డీరెగ్యులేషన్ జరగడం లేదు. అంతర్జాతీయ ధరల కంటే చౌక ధరలకే రష్యా నుంచి చమురు అందుతున్నప్పటికీ.. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే ధరలు కొనసాగుతున్నాయి. ఇది మార్కెట్ ఆధారిత విధానం అని చెబుతున్నప్పటికీ.. వాస్తవంగా ఇది పెద్ద సంస్థలు, ప్రభుత్వాల మధ్య ఉన్న లాభాల గేమ్‌గా మారింది. వినియోగదారుడు మాత్రం వాటి మధ్యలో నలిగిపోతూనే ఉన్నాడు.

సాధారణ ప్రజలకు మిగిలిందేమిటి?

రష్యా నుంచి చౌకగా చమురు కొంటున్నారు.  కానీ వినియోగదారుడికి మాత్రం ఆ లాభం ఇవ్వలేదు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వం, అందరూ లాభపడ్డారు. కానీ చౌక ముడి చమురు ప్రయోజనం ప్రజలకు చేరలేదు.

ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. తాజాగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌ నుంచి మరో 5% అదనపు డిస్కౌంట్ వచ్చింది. కనీసం ఈ ప్రయోజనమైనా ప్రజలకు చేరుతుందా? లేక దీన్ని కూడా లాభాల మార్జిన్లో కలిపేస్తారా అన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. GSTలో భారీ సంస్కరణలు జరుగుతున్నాయి. కానీ ఇంధన ధరలలో మాత్రం అసలు మార్పు రావడం లేదు.

భారత్ క్రూడ్ ఆయిల్ ధరలు: భారత్ ఇప్పటివరకు క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు అత్యధికంగా 2008 జూలైలో $147 చెల్లించింది. భారత క్రూడ్ బాస్కెట్ ధర జూలై 3, 2008 న $141.68 కి చేరుకుంది.

ప్రస్తుత ప్రపంచ మార్కెట్ ధర: 2025, ఆగస్టు 21 ఉదయం 03:15 IST న విడుదలైన డేటా ప్రకారం, బ్యారెల్‌ క్రూడ్ ఆయిల్ ధర $63.35గా నమోదైంది. ప్రస్తుతం (ఆగస్టు 21, 2025, 05:30 PM IST) దీని సుమారు $63.35 నుంచి $66/ బ్యారెల్ మధ్య ఉండొచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.