Sharad Pawar: ‘అలసిపోలే.. రిటైర్ కూడా కాను.. ఐ యామ్ ఫైర్’.. తగ్గేదేలే అంటున్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్..
NCP Chief Sharad Pawar: అలుపు లేదు, పదవీ విరమణ అసలేలేదు.. అంటున్నారు ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్. పార్టీపై తిరుగుబాటు చేసిన అజిత్‌పై మండిపడ్డ సీనియర్ పవార్.. తన రిటైర్మెంట్ పై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు.

NCP Chief Sharad Pawar: అలుపు లేదు, పదవీ విరమణ అసలేలేదు.. అంటున్నారు ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్. పార్టీపై తిరుగుబాటు చేసిన అజిత్‌పై మండిపడ్డ సీనియర్ పవార్.. తన రిటైర్మెంట్ పై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు. శరద్ పవార్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని అజిత్ చేసిన సూచనను ఆయన దుయ్యబట్టారు. పార్టీ కార్యకర్తలు తనను కొనసాగించాలని కోరుకుంటున్నారని, కానీ, తాను పని చేస్తూనే ఉంటానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పారు. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ పవార్ లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ శరద్ పవార్ ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పిన మాటలను పవార్ పునరావృతం చేస్తూ.. “నేను అలసిపోను, నేను రిటైర్ కూడా కాను.. ఐ యామ్ ఫైర్” అని శరద్ పవార్ స్పష్టంచేశారు. తనను రిటైర్ అవ్వమని అడగడానికి అజిత్ ఎవరు అంటూ మండిపడ్డారు. తనకేమీ వయసు అయిపోలేదని, వృద్ధాప్యంలో లేనని, ఇంకా పని చేయగలనని వ్యాఖ్యానించారు. మొరార్జీ దేశాయ్ ఏ వయసులో ప్రధాని అయ్యారో తెలుసు కదా అన్నారు. తానేమీ ప్రధాని, ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదని, కేవలం క్రియాశీల రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నాను అన్నారు.
కుటుంబ వారసత్వ పోరు గురించి ప్రశ్నిస్తూ.. అజిత్ తన కొడుకు కానందున పక్కన పెట్టారా అంటూ శరద్ పవార్‌ని అడిగ్గా.. “ఈ విషయంపై నేను పెద్దగా చెప్పదలచుకోలేదు. కుటుంబ సమస్యలను.. కుటుంబం వెలుపల చర్చించడం నాకు ఇష్టం లేదు” అని పేర్కొన్నారు. అలాగే తన కుమార్తె అయినప్పటికీ సుప్రియ సూలేకు మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు. కానీ అజిత్‌ను మంత్రి, ఉప ముఖ్యమంత్రిని కూడా చేశానని అన్నారు. కేంద్రంలో ఎన్సీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు ఎప్పుడు మంత్రి పదవి వచ్చినా ఇతరులకు ఇచ్చానని, ఎంపీగా ఉన్నప్పటికీ సుప్రియాకు ఇవ్వలేదని పవార్ గుర్తుచేశారు.
మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మంత్రివర్గంలోకి అజిత్, మరో ఎనిమిది మంది ఎన్‌సిపి ఎమ్మెల్యేలు చేరిన వారం తర్వాత, శరద్ పవార్ తన రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించారు. శనివారం నాసిక్ జిల్లాలోని యోలాలో భారీ సభను నిర్వహించారు. ఇది మంత్రి ఛగన్ భుజబల్ ఎన్నికైన నియోజకవర్గం కావడం గమనార్హం.




మరిన్ని జాతీయ వార్తల కోసం..




