హర్యానా,కశ్మీర్ ఎన్నికల ఫలితాలపై ఎవరికి ఎన్ని మార్కులు.? బీజేపీ, కాంగ్రెస్ ముందు మరో టాస్క్
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఒకటే ఉత్కంఠ. ఎవరు గెలుస్తారు, ఓడిపోతే ఎందుకు ఓడిపోతారనే దానిపై కొన్ని వారాలుగా టెన్షన్ టెన్షన్. రెండు రాష్ట్రాలేగా.. ఎందుకంత టెన్షన్? ఫలితాలు అటు ఇటు అయినంత మాత్రాన..
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఒకటే ఉత్కంఠ. ఎవరు గెలుస్తారు, ఓడిపోతే ఎందుకు ఓడిపోతారనే దానిపై కొన్ని వారాలుగా టెన్షన్ టెన్షన్. రెండు రాష్ట్రాలేగా.. ఎందుకంత టెన్షన్? ఫలితాలు అటు ఇటు అయినంత మాత్రాన.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పడిపోయేది లేదు, విపక్షంలో ఉన్న వాళ్లు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అయినా సరే.. జమ్ము కశ్మీర్ అండ్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలను ఎందుకంత ఉత్కంఠగా చూశారు. ఎందుకంటే.. రాబోయే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మూడ్‌ను ఇది సెట్ చేస్తుంది కాబట్టి. త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి. ఢిల్లీ కూడా రెడీగా ఉంది. జార్ఖండ్‌లోనూ డిసెంబర్ నాటికి ఎన్నికలు పెట్టాల్సిందే. సో, ఇప్పుడు జరిగినవి రెండు రాష్ట్రాలే కావొచ్చు.. ఇంకా జరగాల్సింది మూడు రాష్ట్రాల ఎన్నికలు. ఈ ఇంపాక్ట్ ఇకపై జరిగే రాష్ట్రాల ఎన్నికలపైనా కచ్చితంగా ఉంటుంది. పైగా ఇవన్నీ జరుగుతున్నవి ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలే. ఉత్తర భారతంలో అత్యంత బలంగా ఉన్నామని చెబుతున్న బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అందుకే, హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలకు అంత ప్రాధాన్యం.
హర్యానా, జమ్ము కశ్మీర్ ఫలితాలు త్వరలో జరిగే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం. అంతకంటే ముందు.. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలను అనలైజ్ చేద్దాం. అందరి దృష్టి.. ‘జమ్ము కశ్మీర్‌లో బీజేపీ అలా ఎలా ఓడిపోయిందబ్బా’ అని. ఆర్టికల్ 370ని రద్దు అనే అతిపెద్ద తేనెతుట్టెను కదిపి, అనుకున్నది సాధించి చూపించింది బీజేపీ. మరోవైపు.. ఉగ్రవాదాన్ని బాగా అణచివేసింది. జమ్ము కశ్మీర్‌కు ఏటా దాదాపు 2 కోట్ల మంది టూరిస్టులు వెళ్తున్నారంటేనే అక్కడి పరిస్థితిలో మార్పు వచ్చిందనేగా అర్థం. ఆ క్రెడిట్ మొత్తం బీజేపీదే. జమ్ము కశ్మీర్‌లో హోటళ్లు ఆర్నెళ్ల ముందే బుక్ అవుతున్నాయి. టూరిస్టులతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ఒకప్పటిలా రాళ్ల దాడులు, హర్తాళ్స్ జరగడం లేదక్కడ. జీ-20 సమావేశాన్ని కూడా దిగ్విజయంగా జరిపింది. పైగా అక్కడి ముస్లిం యువత కోసం చాలా చేసింది కేంద్రం. ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ.. బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కారణం ఏంటి? ఏ ఫ్యాక్టర్ పనిచేసి ఉంటుంది?
చాలా మంది ఆర్టికల్ 370 రద్దును మాత్రమే చూశారు. కాని, దాంతో పాటే ఆర్టికల్ 35 ఆఫ్ Aను కూడా రద్దు చేశారు. ఆర్టికల్ 35(A) జమ్ము కశ్మీర్ ప్రజలకు కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చింది. ముఖ్యంగా శాశ్వత నివాసులు ఎవరో నిర్ణయించే అధికారం ఈ ఆర్టికల్ 35(A)కి ఉండేది. ఏం.. ‘శాశ్వత నివాసితులు’ అనే హక్కు కల్పించడం ద్వారా ఏమవుతుంది? ఆ ఆర్టికల్ ఉండడం వల్ల వచ్చే లాభమేంటి? ఏం లాభం అంటే.. జమ్ము కశ్మీర్ స్టేట్ సర్వీస్ ఉద్యోగాల్లో అక్కడి శాశ్వత నివాసితులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఆ శాశ్వత నివాసితులు మాత్రమే జమ్ము కశ్మీర్‌లో భూములు, ఆస్తులు కొనుగోలు చేయాలి. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు అతిథులు అవుతారు, లేదా వలసదారులు అవుతారు తప్ప జమ్ము కశ్మీర్ ప్రజలు కారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే స్కాలర్‌షిప్స్ కూడా ఆ శాశ్వత నివాసులకే ఇస్తారు. ఆర్టికల్ 370తో పాటు ఆర్టికల్ 35(A) కూడా రద్దు చేయడంతో.. జమ్ము కశ్మీర్‌లో వందల ఏళ్ల నుంచి ఉంటున్న వారికే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా కొత్తగా హక్కులు వచ్చాయి. ఇదే నచ్చడం లేదు అక్కడి వారికి. నిజానికి.. కశ్మీర్ ఇప్పుడు చాలా బాగుంది. పరిస్థితులు మారాయి. కాని, నిరుద్యోగం వెంటాడుతోంది. యువతకు ఉద్యోగాలు లేవక్కడ. అలాంటి పరిస్థితుల్లో బయటి వారికి కూడా స్టేట్ సర్వీసెస్ ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తామంటే ఊరుకుంటారా..! 370 రద్దు ద్వారా బీజేపీకి రావాల్సిన పాజిటివిటీ.. ఆర్టికల్ 35(A) రద్దు కారణంగా నెగిటివిటీగా మారిందంటారు రాజకీయ విశ్లేషకులు.
బీజేపీ ఓడిపోవడానికి మరో కారణం.. తమని తాము పాలించుకునే హక్కును జమ్ము కశ్మీర్ ప్రజలు కోరుకోవడం. 2019లో జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఒక విషయం తెలుసుకోవాలిక్కడ. దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలకు సైతం రాష్ట్ర హోదా ఇస్తుంటే.. విచిత్రంగా, రాష్ట్రంగా ఉన్న జమ్ము కశ్మీర్‌ను మాత్రం కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. అన్ని అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో పెట్టారు. ఇది నచ్చలేదు అక్కడి ప్రజలకి. సో, అధికారంలోకి వస్తే.. కశ్మీరీలు తమను తాము పాలించుకునే హక్కులు కల్పిస్తామని, జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ప్రచారం చేశారు రాహుల్‌గాంధీ అండ్ కాంగ్రెస్ కూటమి నేతలు. బీజేపీ కూడా రాష్ట్ర హోదా ఇస్తామనే హామీ ఇచ్చింది. కాని, ప్రజలు మాత్రం కాంగ్రెస్ కూటమినే నమ్మారు.
ఇక ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొస్తామన్న వాదనకే జమ్ము కశ్మీర్ ప్రజలు ఓటు వేశారు. నిజానికి అది సాధ్యం కాకపోయినా.. ఆ హామీ ఇచ్చిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి ఓట్లు వేశారు. మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ కూడా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించింది. గెలిపిస్తే తిరిగి 370ని తీసుకొస్తామని హామీ ఇచ్చింది. కాని, మెహబూబా ముఫ్తీ మాటలను కశ్మీరీ ప్రజలు నమ్మలేదు. కారణం.. 2014లో బీజేపీతో కలిసి పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. పదేళ్ల క్రితం అధికారం కోసం చేతులు కలపడమే.. ప్రస్తుతం మెహబూబా ముఫ్తీ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. లోయలో మళ్లీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి ఆధిక్యత వచ్చిందంటే కారణం.. ప్రజలు పీడీపీని దూరం పెట్టడమే. పైగా ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులు బాగా పర్ఫామ్ చేశారు. ఈ స్వతంత్ర అభ్యర్ధులు ఎవరో కాదు.. ఆర్టికల్ 370 రద్దును సహించలేని వాళ్లు. ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్న పీడీపీ కంటే.. స్వతంత్ర అభ్యర్ధులకే ప్రజల మద్దతు ఎక్కువగా ఉంది జమ్ము కశ్మీర్‌లో. అందుకే, గులాం నబీ ఆజాద్ పార్టీ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన తరువాత గులాం నబీ ఆజాద్‌ను ప్రత్యేకంగా గౌరవిస్తూ వచ్చింది బీజేపీ. ఆ ఎఫెక్ట్ కారణంగానో ఏమో.. ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ప్రజలు.
గమనించే ఉంటారు.. జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు. అత్యంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. కారణం ఏంటో తెలుసా? ఉగ్రవాద సంబంధం ఉన్న పార్టీలపై జమ్ము కశ్మీర్‌లో నిషేధం ఉంది. నిషేధం కారణంగా ఎన్నిక్లలో పోటీ చేయడానికి వీల్లేదు. అయినంత మాత్రాన వాళ్లేం పోటీ చేయకుండా ఆగిపోలేదు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. ఫర్ ఎగ్జాంపుల్.. ‘జమాత్-ఇ-ఇస్లామి’ పార్టీ. పుల్వామా అటాక్‌లో 40 మంది జవాన్లు వీరమరణం పొందిన ఘటన తరువాత.. జమాత్-ఇ-ఇస్లామి పార్టీని నిషేధించారు. ‘తమకు ఇండియన్ డెమోక్రసీ వద్దు, కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలిపేయండి’ అనేది ఆ పార్టీ నినాదం. అలాంటి పార్టీపై బ్యాన్ విధించినప్పటికీ.. ఎన్నికలను బహిష్కరించలేదు. మమ్మల్నే నిషేధిస్తారా అని ఎక్కడా తొందరపాటు చర్యలకు దిగలేదు. తుపాకులతోనే అన్నీ సాధించలేం అని నమ్మి.. స్వతంత్ర అభ్యర్ధులుగా ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగారు. కారణం.. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలకు ప్రజల నుంచి ఒకప్పటిలా సపోర్ట్ దొరకడం లేదు కాబట్టి. కాని, ఎన్నికల్లో పాల్గొంటే మాత్రం అదే ప్రజలు ఓటు వేస్తున్నారు. ఏదైనా ఉంటే.. ప్రభుత్వ పరంగా సాధించమని సంకేతాలిస్తున్నట్టు ఉన్నారు అక్కడి ప్రజలు. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. గత లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నుంచి పోటీ చేసిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఓడించారు రషీద్ ఇంజనీర్. ఈ రషీద్ ఇంజనీర్‌ను తిహార్ జైల్లో పెట్టారు అప్పట్లో. కశ్మీర్‌ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొడుతున్నందుకు రషీద్ ఇంజనీర్‌ను అరెస్ట్ చేశారు. అయినా సరే.. జైలు నుంచే పోటీ చేసి, బారాముల్లా ఎంపీగా గెలిచారు. అంటే.. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలనే వాళ్లకే అంతిమంగా పట్టం కట్టారు ప్రజలు. దాని రిజల్ట్ ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. జమ్ము కశ్మీర్‌లో బీజేపీని కాదని కాంగ్రెస్ కూటమికే అధికారం ఇచ్చారు.
ఇక హర్యానా ఎన్నికలు. పదేళ్లుగా అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ఓడిపోతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ బల్లగుద్ది మరీ చెప్పాయి. కాకపోతే.. ఎగ్జిట్ పోల్స్ ఓ విషయం మరిచిపోయాయేమో అనిపిస్తోందిక్కడ. ఎక్కడైనా సరే.. ప్రభుత్వాన్ని దించేయాలని, లేదా మార్పు కావాలని ప్రజలు బలంగా కోరుకున్నప్పుడు ఓటర్లు వెల్లువెత్తుతారు. ఎక్కడైనా సహజంగా జరిగేదే అది. కాని, హర్యానాలో 2019తో పోల్చితే ఈసారి ఓటింగ్ శాతం తగ్గింది. గతం కంటే 1 పర్సెంట్ ఓటింగ్ తగ్గింది. సో, పోలింగ్ శాతం తగ్గింది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత లేనట్టేనని ముందు నుంచి చెబుతూ వచ్చారు బీజేపీ నేతలు. కాని, బీజేపీ వర్షన్‌ను ఎవరైనా వింటేగా. కాంగ్రెస్ నేతలతో పాటు ఎగ్జిట్‌పోల్స్ కూడా ఈ అంశాన్ని పట్టించుకోనట్టే కనిపిస్తోంది. గతం కంటే ఓటింగ్ శాతం తగ్గడానికి, ఎగ్జిట్ పోల్స్ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడానికి మరో రీజన్ ఉంది. అదేంటంటే.. కాంగ్రెస్‌కు బలం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో 65 నుంచి 70 శాతం పోలింగ్ జరిగితే.. బీజేపీకి బలం ఉండే పట్టణాల్లో మాత్రం 50 నుంచి 55 శాతం మధ్య మాత్రమే పోలింగ్ నమోదైంది. ఒక విధంగా బీజేపీకి బలం ఉన్న చోట తక్కువ పోలింగ్ జరిగింది. అందుకే, ఈసారి బీజేపీ ఓడిపోతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
నిజానికి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్ విషయంలో బీజేపీపై చాలా అసంతృప్తి కనిపించింది. ఎందుకంటే.. ఆర్మీకి వెళ్లాలనుకునే వారిలో హర్యానా నుంచి కూడా ఎక్కువ మంది ఉంటారు. అటు రెజ్లర్లకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ సరిచేయలేదన్న వాదన కూడా బలంగా వినిపించింది. రెజ్లర్లలో ఎక్కువ మంది జాట్ కమ్యూనిటీ వాళ్లే. తమ ఆత్మగౌరవాన్ని బీజేపీ దెబ్బ కొట్టిందని జాట్లు ఫీల్ అయ్యారు. మరోవైపు, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు కూడా జరిగాయి. కాని, వీటన్నింటినీ నెగ్గుకురాగలిగింది బీజేపీ. అన్నిటికీ సమాధానాలు చెప్పుకోగలిగింది ఎన్నికల ప్రచారంలో. అగ్నివీర్ విషయంలో గానీ, రెజ్లర్లు- జాట్ల విషయంలో గానీ, జరిగిన తప్పును సరిచేసుకునే ప్రయత్నం కొంతమేర చేసిందనే చెప్పాలి. పైగా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి మార్పు కూడా హర్యానాలో బీజేపీకి కొంత కలిసొచ్చింది. దాదాపు తొమ్మిదేళ్లకు పైగా సీఎంగా ఉన్న మనోహర్‌లాల్ ఖట్టర్‌ను పక్కనపెట్టి నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ. ఈ మార్పును హర్యానా ప్రజలు స్వాగతించారు.
హర్యానాలో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారు అవడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. బహుశా.. ఎగ్జిట్ పోల్స్ పెద్దగా ఫోకస్ చేయలేదనుకుంటా ఈ విషయాన్ని. అదే.. ఆమ్ ఆద్మీ పార్టీ. హర్యానాలో కాంగ్రెస్‌తో వెళ్లకుండా ఒంటరిగా పోటీ చేసింది ఆప్. ఆ పార్టీకి ఒక్క సీటు రాకపోగా.. చాలా చోట్ల ఓట్లను చీల్చి కాంగ్రెస్ ఓటమికి కారణమైంది. కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారన్న సింపతీ తమకు బాగా కలిసొస్తుందని ఆప్ ఊహించుకుందేమో.. ప్రజలు మాత్రం అలా ఆలోచించలేదు. హర్యానాలో కేవలం ఒక శాతం ఓటర్లు మాత్రమే ఆమ్ ఆద్మీ చీపురు గుర్తును నొక్కారు. బీజేపీ గెలవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరి పోరు కూడా పరోక్ష కారణమైంది. హర్యానాలో బీజేపీ గెలిచిందని చెప్పడం కంటే.. మూడోసారి కూడా అధికారాన్ని నిలుపుకోగలిగిందనే చెప్పాలి. అందులోనూ హ్యాట్రిక్ కొట్టడం అంటే.. మామూలు విషయం కాదు. పదేళ్ల పాలనలో సహజంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. కాని, ఆ వ్యతిరేకతను అధిగమించి విజయం సాధించింది బీజేపీ. కాకపోతే, బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. హ్యాట్రిక్ సాధించిన బీజేపీకి వచ్చిన ఓట్ షేర్ 39 శాతం అయితే.. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ షేర్ దాదాపుగా 40 శాతం. ఇదొక్కటే కాంగ్రెస్‌కు ఊరట.
సరే.. హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాల ప్రభావం.. ఇందాక చెప్పుకున్నట్టు మూడు రాష్ట్రాల ఎన్నికలపై ఉంటుందా అంటే.. కచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. హర్యానా, జమ్ము కశ్మీర్ చిన్న రాష్ట్రాలే కావొచ్చు. కాని.. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపించబోతోంది. ఎంతైనా దేశ ఆర్థిక రాజధాని ‘ముంబై’ ఉన్న రాష్ట్రం అది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఏకంగా 12 స్థానాలు పెంచుకుని మొత్తం 13 సీట్లను సొంతంగా సాధించింది కాంగ్రెస్. అటు 2019లో 23 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఏకంగా 14 స్థానాలు కోల్పోయి కేవలం 9 స్థానాలకే పరిమితం అయింది. దీన్నిబట్టి.. మహారాష్ట్ర రాజకీయాల్లో జరిగిన కలగాపులగాన్ని మరాఠీలు అంగీకరించలేదన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. దేశ ఆర్థిక రాజధాని ఉన్న రాష్ట్రంలో ఈ రాజకీయ అస్థిరతను.. ఎవరు ఎప్పుడు ఎటు మారతారో తెలియని కంగాళీని మరాఠాలు అంగీకరించలేదు. అందుకే, మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఇండీ కూటమికి 30 ఎంపీ సీట్లు ఇచ్చిన మరాఠీలు, ఎన్డీయేకి 17 ఎంపీ సీట్లు మాత్రమే కట్టబెట్టారు. సో, ఏడాది తిరక్కముందే జరగబోయే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఎలా ఉంటుందో కాస్త ఊహించొచ్చు. అందులోనూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం ఇచ్చి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు లీడ్ ఇస్తున్నారు ఓటర్లు. దేశవ్యాప్తంగా అలాగే జరుగుతోంది. అలాంటిది మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లోనే ఇండీ కూటమికి ఆధిక్యత ఇచ్చారు. అలాంటి పరిస్థితుల్లో… ఇప్పుడు జరిగిన హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికలు కచ్చితంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని సర్వేలు మహారాష్ట్రలో ఇండీ కూటమికే మొగ్గు ఉంటుందని చెబుతున్నాయి. ప్రస్తుతం మహాయుతి కూటమి అధికారంలో ఉంది మహారాష్ట్రలో. శివసేనను చీల్చిన షిండే, ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్.. బీజేపీతో జతకట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ ఈసారి గట్టిగా పోరాడుతున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం.. విదర్భలో ఉన్న 62 నియోజకవర్గాలతో పాటు ముంబై బెల్ట్‌లోని 36 నియోజకవర్గాల్లో ఇండీ కూటమికే మొగ్గు కనిపిస్తోందంటున్నారు. 47 సీట్లు ఉన్న ఖాందేష్ ఏరియాలో ఎన్డీయే, ఇండీ కూటమికి సమాన అవకాశాలు కనిపిస్తున్నాయి. పవార్ కుటుంబానికి గట్టి పట్టు ఉన్న పశ్చిమ మహారాష్ట్రలోని 58 సీట్లతో పాటు మరాఠ్వాడాలోని 46 స్థానాల్లో ఇండీ కూటమికే సానుకూలత కనిపిస్తోందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓవరాల్‌గా మహారాష్ట్రలో ఇండీ కూటమికే ఎడ్జ్ కనిపిస్తోందంటోంది లోక్‌పాల్ సర్వే. జమ్ము కశ్మీర్‌లో బీజేపీ ఓటమి ప్రభావం మహారాష్ట్రపై పడకుండా చూసుకోగలగాలి బీజేపీ. అదే సమయంలో.. విజయం అంచుల దాకా వచ్చి వెనక్కి వెళ్లిన కాంగ్రెస్‌కి, మహారాష్ట్రపై మరింత ఫోకస్ పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది హర్యానాలో ఓటమి.
ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్. డైరెక్టుగా దేశ రాజధానిలో జరిగే ఎన్నికలు ఇవి. వచ్చే ఫిబ్రవరి నాటికి అక్కడి అసెంబ్లీకి ఎలక్షన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. పైగా హర్యానాలో ఒక భాగమా అన్నట్టుగా ఉంటుంది ఢిల్లీ. సో, హర్యానా ఓటర్ల తీర్పు ఢిల్లీ ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అందులోనూ.. హర్యానా, జమ్ము కశ్మీర్‌లో ఏమాత్రం ప్రభావం చూపించలేదు ఆమ్ ఆద్మీ. ఈసారి కచ్చితంగా చీపురును మూలకు పెట్టేస్తాం అంటోంది కమలదళం. అదేంటో.. పదేళ్లుగా హర్యానాలో అధికారం దక్కించుకున్న బీజేపీకి.. పక్కనే ఉన్న ఢిల్లీ మాత్రం చేతికి చిక్కడం లేదు. 2014 నుంచి హర్యానాలో అధికారంలో ఉన్నది బీజేపీనే. ఇప్పుడు వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీలో 2014 నుంచి అధికారంలోనే కొనసాగుతోంది. మరోసారి సత్తా చాటాలనుకుంటోంది. కాని, ఈసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా అనే సందేహాలున్నాయ్. అసలే.. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క ఎంపీ సీటు దక్కించుకోలేకపోయింది ఆమ్‌ఆద్మీ పార్టీ. దానికి తోడు పక్కనే ఉన్న హర్యానాలో హ్యాట్రిక్ కొట్టింది. జమ్ములోనూ ఆప్ ఉనికే కనిపించలేదు. దీంతో ఈ రెండు రాష్ట్రాల ఇంపాక్ట్.. ఢిల్లీపై ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇక జార్ఖండ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఇండీ కూటమి అధికారంలో ఉంది. ఇక్కడ రాజకీయ పరిణామాలు చాలా మారాయ్. ఈడీ అరెస్ట్ చేయడంతో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసి చంపై సోరెన్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చారు. బెయిల్‌పై బయటకు రాగానే మళ్లీ హేమంత్ సోరెన్ సీఎం పీఠంపై కూర్చున్నారు. 153 రోజుల పాటు జార్ఖండ్ సీఎంగా చేసిన చంపై సోరెన్.. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి బయటికొచ్చి బీజేపీలో చేరారు. ఇది JMM పార్టీని బలహీనపరుస్తుందా లేక బీజేపీకి బలం అవుతుందా అనేది చూడాలి. అలాంటి సమయంలో జమ్ము కశ్మీర్‌లో గెలిచి, హర్యానాలో ఓడిన ఇండి కూటమి ప్రభావం జార్ఖండ్‌పైనా ఉండబోతోంది. ఓవరాల్‌గా.. ఈ రెండు చిన్న రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. రాబోయే మూడు రాష్ట్రాల ఎన్నికలను, దాని ఫలితంగా అటుపై జరిగే మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేస్తాయనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి