Gujarat Elections 2022: గుజరాత్‌ రాజకీయాల్లో బైడెన్ పార్టీ చర్చ.. ఇంతకీ విషయం ఏంటంటే?

అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో గుజరాత్ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్ధిక్ పటేల్ చుట్టూ ఆ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి.

Gujarat Elections 2022: గుజరాత్‌ రాజకీయాల్లో బైడెన్ పార్టీ చర్చ.. ఇంతకీ విషయం ఏంటంటే?
Hardik Patel
Follow us

|

Updated on: Apr 25, 2022 | 6:53 PM

Gujarat Assembly Election 2022: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో గుజరాత్ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్ధిక్ పటేల్(Hardik Patel) చుట్టూ ఆ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు హార్ధిక్ పటేల్ కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చి.. బీజేపీ గూటికి చేరొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ చర్చకు బలమైన కారణం లేకపోలేదు. స్వయంగా హార్ధిక్ పటేల్ ఈ పుకార్లకు నారునీరు అందించారు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో కొందరు తనను తొక్కేస్తున్నట్లు ఆరోపించిన హార్ధిక్.. అంతటితో ఆగకుండా ఇటీవల కాలంలో బీజేపీ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు (ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం) బాగున్నాయని మెచ్చుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరే ప్రసక్తే లేదంటూ ఆయన ఇప్పటికే వివరణ ఇచ్చుకున్నా.. పుకార్లు మాత్రం సద్దుమణగడంలేదు.

ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి హార్ధిక్ పటేల్ తాను బీజేపీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. బీజేపీలో చేరే యోచన తనకు ఏ మాత్రం లేదని స్పష్టంచేశారు. అయితే గుజరాత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల తాను అసంతృప్తితో ఉన్నట్లు పునరుద్ఘాటించారు. ‘చాలా మంది చాలా చెబుతుంటారు. అమెరికా ఎన్నికల్లో గెలిచినప్పుడు జో బైడెన్‌ను నేను మెచ్చుకున్నా. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి అయినందునే అప్పట్లో బైడెన్ పార్టీ విజయం పట్ల హర్షం వ్యక్తంచేశాను. అంత మాత్రాన నేను బైడెన్ పార్టీలో చేరుతానా?’ అంటూ మీడియా సమావేశంలో హార్ధిక్ పటేల్ వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ ప్రత్యర్థుల్లో మంచి ఉంటే దాన్ని మెచ్చుకోవడంలో తప్పు లేదంటూ హార్ధిక్ పటేల్.. తాను బీజేపీపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తనకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై ఎలాంటి అసంతృప్తి లేదని.. గుజరాత్ పార్టీ నాయకత్వంపై మాత్రమే అసంతృప్తితో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

మొత్తానికి హార్ధిక్ పటేల్ బీజేపీని మెచ్చుకుంటూ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. తనకు పార్టీ వ్యవహారాల్లో తగిన ప్రాధాన్యత లేకపోవడంతో ఆయన గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించని పక్షంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది గుజరాత్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

డిసెంబర్‌లో ఎన్నికలు..

గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలకు ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌తో పాటు ఎంఐఎం కూడా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్నాయి. దీంతో చాలా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొనే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గుజరాత్‌లో అధికార బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉవ్విళ్లూరుతోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్.. ఇటీవల పంజాబ్‌లోనూ అధికార పగ్గాలను కైవసం చేసుకుంది. ముచ్చటగా మూడో రాష్ట్రం గుజరాత్‌లోనూ అధికారాన్ని సొంతం చేసుకుని బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ వ్యూహరచనలు చేస్తున్నారు.

Also Read..

PM Modi: ప్రధానిగా నరేంద్ర మోదీ పాలనకు ఎనిమిదేళ్లు.. ఘనంగా సంబరాలకు బీజేపీ సన్నాహాలు..!

Youtube Channels: తప్పుడు వార్తల ప్రసారంపై కేంద్రం సీరియస్.. 16 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం!