Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR Plan: ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లోకి వెళ్తారా..?.. టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తారా..? పీకే టార్గెట్ ఎంటి..?

పార్టీలకు వ్యూహాలు నేర్పిన వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్ తీరు అయోమయంగా ఉంది. ఇటు టీఆర్‌ఎస్‌తో ఒప్పందం.. అటు కాంగ్రెస్ పార్టీతో భేటీ.. ఎవరితో కలిసి పనిచేస్తారు. ఏ పార్టీలోకి వెళ్తారనేది.. ఇప్పుడు టాక్ ఆప్ ది పాలిటిక్స్.

KCR Plan: ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లోకి వెళ్తారా..?.. టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తారా..? పీకే టార్గెట్ ఎంటి..?
Kcr Sonia Pk
Follow us
TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Apr 25, 2022 | 7:16 PM

KCR Feature Plan: పార్టీలకు వ్యూహాలు నేర్పిన వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్ తీరు అయోమయంగా ఉంది. ఇటు టీఆర్‌ఎస్‌తో ఒప్పందం.. అటు కాంగ్రెస్ పార్టీతో భేటీ.. ఎవరితో కలిసి పనిచేస్తారు. ఏ పార్టీలోకి వెళ్తారనేది.. ఇప్పుడు టాక్ ఆప్ ది పాలిటిక్స్. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం పీకే ఎపిసోడ్ టెన్షన్ పుట్టిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్ గాంధీలతో చర్చలు ఒకవైపు.. ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో భేటీ మరోవైపు. దీని వెనక ఆంతర్యమేంటనేది ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ పొలిటికల్ సర్కిల్‌లో ఎన్నో వార్తలు, ఎన్నో ఆరోపణలు సర్క్యులేట్ అవుతున్నాయి.

ఢిల్లీలో సోనియా, రాహుల్‌తో భేటీ తర్వాత.. హైదరాబాద్‌లో కేసీఆర్‌తో రెండు రోజుల పాటు చర్చలు జరపడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఊపు వచ్చింది. 2023 ఎన్నికలకు ఇది మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని హస్తం పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. అంతలోనే పీకే ఎపిసోడ్‌.. అయోమయంలోకి నెట్టింది. మరోవైపు, కాంగ్రెస్ టీఆర్‌ఎస్ మధ్య పొత్తు ఉందని బీజేపీ నేతలు బహిరంరంగానే ఆరోపిస్తున్నారు. కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎన్ని కలిసినా తమని ఓడించలేరని.. ప్రజలు తమవైపు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు బీజేపీనేతలు. పీకే విషయంలో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని.. వాళ్ల ఆదేశాల ప్రకారమే పనిచేస్తామని రాష్ట్ర నేతలు చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు రాకుండా చేయాలనే బీజేపీ నేతలు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, టీఆర్‌ఎస్‌తో తెగతెంపులు చేసుకోవడానికి కేసీఆర్‌తో భేటీ అయ్యి ఉండొచ్చన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పీకే విషయంలో అధిష్టానం కొన్ని కండీషన్స్ పెట్టినట్టు తెలిపారాయన.

ఈ ఎపిసోడ్ నడుస్తున్న సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. శత్రువుతో ఫ్రెండ్సిష్ చేసే వాళ్లను నమ్మొద్దంటూ ట్వీట్ చేశారాయన. ఆయన ఎవరిని ఉద్ధేశించి ఆట్వీట్ చేశారు. ఆయన దృష్టిలో శత్రువు ఎవరు, మిత్రులు ఎవరో అర్ధం కాక పార్టీ నేతలు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. అయితే, రాజకీయ వ్యవస్థలో సమీకరణాలు వస్తుంటాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పీకేతో మోదీ కలిసి పనిచేస్తే తప్పులేదు కానీ.. కేసీఆర్ పనిచేస్తే తప్పా అని ప్రశ్నించారు. ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై చాలా రోజుల నుంచి గురి పెట్టారు. కానీ ఆయనకు సమయం, సందర్భం కలసి రావడం లేదు. గతంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు సంబంధం లేని ప్రాంతీయ పార్టీల మూడో కూటమి కోసం బహిరంగంగా ప్రకటించి మరీ, దేశవ్యాప్తంగా బీజేపీయేతర శక్తులను ఏకం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం విజయన్‌లతో విడివిడిగా చర్చలు కూడా జరిపారు. అలాగే, ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలందరితో భేటీ అయ్యారు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల్లో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు కేసీఆర్ మళ్లీ అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ ఈ సారి ఆయన వ్యూహంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.ఈసారి ఎక్కడా బహిరంగ ప్రకటనలు చేయడం లేదు. అంతా గోప్యంగా చేసుకెళ్తున్నారు.

తాజాగా మారుతున్న పరిణామాలు భిన్నంగా ఉన్నాయి. ఇటీవల కేసీఆర్ కూడా కాంగ్రెస్‌తో కాస్త సన్నిహితంగా ఉంటున్నట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరయింది. దాంతో కాంగ్రెస్‌కు దగ్గరగా టీఆర్ఎస్ జరుగుతోందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. కాగా, గతంలో జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ కేసీఆర్‌ను గట్టిగా నమ్మే పరిస్థితి ఉండదని, అందుకే ప్రశాంత్ కిశోర్ లాంటి వాళ్లు చొరవ తీసుకుంటే ఆ గ్యాప్ ఫిల్ అవుతుందన్న అంచనాలో కేసీఆర్ ఉన్నారంటున్నారు.

మరోవైపు ప్రశాంత్ కిశోర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు గట్టి సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కమిటీ వేసింది. ఈ కమిటీ సోనియాగాంధీతో భేటీ అయింది. కానీ పీకే చేరికపై నోరుమెద లేదు. 2024 ఎన్నికలు ఎదుర్కొనేందుకు.. ఎంపవర్డ్‌ గ్రూపు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీన్ని బట్టు చూస్తే ఆయన పార్టీలోకి రావడం సీనియర్లకు ఇష్టం లేనట్టుగా తెలుస్తోంది. మరి అంతిమంగా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

Read Also….  Youtube Channels: తప్పుడు వార్తల ప్రసారంపై కేంద్రం సీరియస్.. 16 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం!

Congress: 2024 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు.. ప్రత్యేక కార్యాచరణ బృందం ఏర్పాటు.. పీకే చేరికపై పార్టీ మౌనం!