AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: గుజరాత్‌ సమరంలో గెలిచేదెవరు.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పార్టీలు..

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల సమయం సమీపిస్తోంది. పోలింగ్‌కు పది రోజుల గడువు మాత్రమే ఉంది. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారివే. వరుసగా ఏడోసారి విజయంపై బీజేపీ గురిపెట్టగా.. 27 ఏళ్ల తర్వాత అధికారం కోసం కాంగ్రెస్ పోరాడుతుంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ రెండు ప్రధాన..

Gujarat Election 2022: గుజరాత్‌ సమరంలో గెలిచేదెవరు.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పార్టీలు..
Gujarat Assembly Election
Amarnadh Daneti
|

Updated on: Nov 22, 2022 | 7:03 AM

Share

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల సమయం సమీపిస్తోంది. పోలింగ్‌కు పది రోజుల గడువు మాత్రమే ఉంది. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారివే. వరుసగా ఏడోసారి విజయంపై బీజేపీ గురిపెట్టగా.. 27 ఏళ్ల తర్వాత అధికారం కోసం కాంగ్రెస్ పోరాడుతుంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ రెండు ప్రధాన పార్టీలకు సవాలు విసురుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కావడంతో కమలం పార్టీ ఇక్కడ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత రెండు దశాబ్ధాలుగా పైగా బీజేపీ గుజరాత్‌లో తన పట్టును నిలుపుకుంటూ వస్తోంది. అంతేకాదు నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కేంద్రప్రభుత్వ సాయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఎక్కువుగానే ఉన్నాయనేది రాజకీయ పరిశీలకుల మాట. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇమేజ్ ఎంతున్నా.. గత 27 ఏళ్లుగా వరుసగా అధికారంలో ఉండటంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందనేది ప్రతిపక్షాల వాదన. అయితే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం, పైగా ప్రధానమంత్రి స్వరాష్ట్రం కావడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికి.. ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా నాయకత్వ సమస్య కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో అహ్మద్ పటేల్ గుజరాత్‌లో కాంగ్రెస్‌కు బలమైన నాయకుడిగా ఉండేవారు. ఆయన మరణం తర్వాత.. ఆస్థాయి నాయకుడు హస్తం పార్టీలో లేరనేది వాస్తవం. దీంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాట్‌ హస్తం పార్టీ తరపున గుజరాత్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వారంలో మూడు రోజులకు తగ్గకుండా గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే గత శనివారం నుంచి సోమవారం వరకు ప్రధాని మోదీ గుజరాత్‌లోనే ఉండి.. ఎనిమిదికి పైగా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. అమిత్‌ షా సోమవారం ఒక్కరోజే నాలుగు ఎన్నికల సభలో పాల్గొన్నారంటే బీజేపీ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఏం యోగి ఆదిత్యనాధ్ కూడా గుజరాత్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉన్నప్పటికి.. సోమ, మంగళవారం పాదయాత్రకు విరామం ప్రకటించి గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సోమవారం రాజ్ కోట్, సూరత్‌లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ప్రధానంగా నిరుద్యోగం సమస్యను కాంగ్రెస్ హైలెట్ చేస్తోంది. బీజేపీ ప్రభుత్వంలో గుజరాత్‌ అభివృద్ధి చెందటంలేదని, కేవలం మాటలకే అభివృద్ధిని పరిమితం చేస్తున్నారని విమర్శిస్తూ వస్తోంది. అంతేకాదు అనేక ప్రజాకర్షిత హామీలను గుప్పించింది. ఈ పథకాలే తమకు ఓట్లు తెచ్చిపెడతాయనే ఆశతో హస్తం పార్టీ ఉంది. పది లక్షల ఉద్యోగాలు, రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి హామీలను మ్యానిఫెస్టోలో పెట్టింది.

గుజరాత్‌లో సంచలనం సృష్టించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమైంది. గెలుపు అసాధ్యమని తెలిసినా, ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుందనే ఆలోచనతో ఢిల్లీ సీఏం. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌ శాసనసభ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపర్చడం, 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు వంటి హామీలను ఇవ్వడమే కాకుండా.. ఎన్నికలకు ఏడాది ముందునుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకుంది. మరోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నవారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు కేజ్రీవాల్. మరోవైపు గుజరాత్‌ మొత్తం విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్ ఇమేజ్ మినహిస్తే.. అలాంటి నాయకుడు మరొకరు లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మొత్తం మీద గుజరాత్‌ ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించడంతో సందడి నెలకొంది. అన్ని పార్టీల జాతీయ స్థాయి నాయకులు గుజరాత్‌లో పర్యటిస్తూ.. ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈక్రమంలో సామాన్య గుజరాత్ ఓటరు మనసులో ఏముందనేది మాత్రం డిసెంబర్ 8వ తేదీ ఓట్ల లెక్కింపుతో తేలనుంది. 182 శాసనసభా స్థానాలున్న గుజరాత్‌లో డిసెంబర్1, 5వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..