AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు 66 శాతం పెంపు, సీఎం అరవింద్ కేజ్రీవాల్ నెల జీతం ఎంతో తెలుసా?

Delhi MLA's Salaries: ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ప్రస్తుతం ఆ నిర్ణయానికి భారత రాష్ట్రప‌తి ఆమోదం ల‌భించింది. 12 ఏళ్ల త‌ర్వాత ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయి

ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు 66 శాతం పెంపు, సీఎం అరవింద్ కేజ్రీవాల్ నెల జీతం ఎంతో తెలుసా?
Arvind Kejriwal
Balaraju Goud
|

Updated on: Mar 13, 2023 | 2:18 PM

Share

మార్చి 17 నుండి ప్రారంభమయ్యే ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి ముందు ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్సులు 66 శాతానికి పైగా పెరిగాయి. . గ‌త ఏడాది జూలై 4వ తేదీన ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ప్రస్తుతం ఆ నిర్ణయానికి భారత రాష్ట్రప‌తి ఆమోదం ల‌భించింది. 12 ఏళ్ల త‌ర్వాత ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయి. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న మొత్తం 70 మంది జీతాలు ఫిబ్రవ‌రి 14 నుంచి అమలులోకి రానున్నాయి.

ఢిల్లీ ప్రభుత్వ లా డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, ఎమ్మెల్యేలకు ఇప్పుడు నెలకు రూ. 90 వేలు లభించనుంది. గతంలో రూ.54,000 మాత్రమే ఉన్న జీతాలు అమాంతం పెంచుతూ ఢిల్లీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌ విప్‌, ప్రతిపక్షనేతలకు కూడా జీతం, అలవెన్సులు నెలకు రూ.72 వేల నుంచి రూ.1 లక్షా 70 వేలకు పెంచినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఎమ్మెల్యేల మూల వేతనాన్ని నెలకు రూ.12 వేల నుంచి రూ.30 వేలకు, మంత్రులకు నెలకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచారు.

రోజువారీ భత్యం కూడా రూ.1000 నుంచి రూ.1500కి పెంచారు. జులై 2022లో ఢిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలను పెంచుతూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో.. లా డిపార్ట్‌మెంట్ జీతాల పెంపునకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక పెంచిన ఎమ్మెల్యే వేతనాలు ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి రానుంది.

ఇక, మాజీ శాస‌న స‌భ్యుల పెన్షన్లు కూడా పెరిగాయి. ఇంత‌కు ముందు కేవ‌లం నెల‌కు రూ.7,500 అందుకునే వారంతా ఇక నుంచి నెల‌కు 15,000 రూపాయ‌లు అందుకోనున్నారు. జీతాల పెంపు త‌ర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ విప్ దిలీప్ కుమార్ పాండే స్పందించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల జీతాలు పెరిగిన‌ప్పటికీ..ఈ జీతాలు ఇత‌ర రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాల‌తో పోల్చితే త‌క్కువేన‌ని గుర్తుచేశారు.2015లో ఓ సారి ఢిల్లీ ప్రభుత్వం ఎమ్మెల్యేల‌ జీతాలు పెంచ‌డానికి ప్రయ‌త్నించింది. 2.10 ల‌క్షల నెల జీతం ఇవ్వాల‌ని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాద‌న‌ను కేంద్ర హోంశాఖ కొట్టిపారేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..