FREEBIE SCHEMES: ఉచితాలతో ముప్పు.. హద్దులేని రుణాలు చేటు.. కీలకాంశాలపై కేంద్రం వైఖరేంటి? సుప్రీంకోర్టు చింతన ఏంటి?

పైకి చూస్తే రెండు బిన్నమైన అంశాలే. కానీ కాస్త తరచి చూస్తే మాత్రం ఇంటర్ లింకేంటో బోధపడుతుంది. జులై 26న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూటిగా ఓ ప్రశ్న వేసింది.

FREEBIE SCHEMES: ఉచితాలతో ముప్పు.. హద్దులేని రుణాలు చేటు.. కీలకాంశాలపై కేంద్రం వైఖరేంటి? సుప్రీంకోర్టు చింతన ఏంటి?
CM KCR, PM Modi
Rajesh Sharma

|

Jul 28, 2022 | 7:30 PM

FREEBIE SCHMES AND STATE DEBITS WORRYING CENTRE AND SUPREME COURT: పైకి చూస్తే రెండు బిన్నమైన అంశాలే. కానీ కాస్త తరచి చూస్తే మాత్రం ఇంటర్ లింకేంటో బోధపడుతుంది. జులై 26న సుప్రీంకోర్టు(Supreme Court of India) కేంద్ర ప్రభుత్వానికి సూటిగా ఓ ప్రశ్న వేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, పలు రాజకీయ పార్టీలు ప్రజలకు పెద్ద ఎత్తున ప్రకటిస్తున్న ఉచిత హామీలు (ఫ్రీ బీస్ అని ముద్దుగా పిలుచుకుంటున్నాం) ఏ మేరకు సమంజసం? ఉచిత హామీలపై కేంద్ర ప్రభుత్వ వైఖరేంటి ? ఇత్యాది అంశాలపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయమన్నది అత్యున్నత న్యాయస్థానం హూంకరించిన ఆదేశ సారాంశం. ఇక రెండో అంశం.. రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులపై కేంద్రం పెత్తనం ఏంటి ? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) గత రెండ్రోజులుగా ఢిల్లీ(Delhi)లో మకాం వేసి, మంతనాలు సాగిస్తున్న కీలకాంశం ఇది. ఎఫ్ఆర్బీఎం పేరిట రాష్ట్రాల రుణాలపై పరిమితులు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని నీరుగారుస్తోందని కేసీఆర్ భావిస్తున్నారు. తన ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్న కేంద్రం.. రాష్ట్రాలను నియంత్రించడమేంటని తెలంగాణ సీఎం వాదిస్తున్నారు. న్యూఢిల్లీ పర్యటనలో వున్న కేసీఆర్ అక్కడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా.. రుణ అవకాశాలపైనా సమీక్షలు జరుపుతున్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న తమకు నిధులు అత్యంత అవసరమని, కానీ రుణాలు చేయకుండా కేంద్రం పరిమితులు విధిస్తోందని కేసీఆర్ ఆగ్రహంతో వున్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగంతో సుదీర్ఘ సమీక్ష జరిపిన కేసీఆర్.. భవిష్యత్ కార్యాచరణపై మీడియాకు లీకులందించారు. ఈ లీకులను పరిశీలిస్తే.. ముందుగా ఎఫ్ఆర్బీఎం(FRBM) పరిమితులకు వ్యతిరేకంగా కేంద్రానికి ఘాటుగా ఓ లేఖ రాయడం.. ఆ లేఖకు కేంద్రం స్పందించకపోతే.. ఏకంగా కేంద్రం వైఖరని నిలదీస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోరాటానికి దిగడం.. ఇవి కేసీఆర్ వ్యూహంలో భాగమని తెలుస్తోంది. సంస్కరణలకు, రుణాలకు లింకు పెడుతున్న మోదీ ప్రభుత్వం(Modi Government)పై కేసీఆర్ మండిపడుతున్నట్లు సమాచారం. అంటే రాష్ట్రాల రుణహక్కుల అంశం త్వరలో సుప్రీం ముందుకు రాబోతోందన్నది తేటతెల్లం.

ఇప్పుడు రెండు భిన్నమైన అంశాలను ఒక్క చోటికి చేర్చి పరిశీలిద్దాం. అసలు రాష్ట్రాల రుణభారం ఎందుకు పెరిగిపోతోంది ? ఇందుకు కారణం ఉచిత విద్యుత్, ఉచిత నగదు పంపిణీ వంటి పథకాలే కారణమని ఏ మాత్రం ఆర్థికాంశాలు తెలిసిన వారైనా చెబుతారు. గత పదేళ్ళ కాలంలో రాష్ట్రాల రుణభారం రెట్టింపైంది. పంజాబ్ వంటి రాష్ట్రాలైతే దివాళాకు చేరువలో వున్నాయి. రుణాల విషయంలో తెలుగు రాష్ట్రాల(Telugu States) పరిస్థితి కాస్త మెరుగే అయినా గత కొంతకాలంగా రెండు రాష్ట్రాలలో అమలవుతున్న ఉచిత హామీలు రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని తల్లకిందులు చేశాయి. తెలంగాణ(Telangana) విషయానికి వస్తే.. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు చెల్లించడమనే సంప్రదాయం ఎప్పుడో తుంగలో తొక్కారు. పదో తేదీన జీతాల చెల్లింపు ప్రారంభించి 20వ తేదీ నాటికి జిల్లాల వారీగా రోజుకు కొన్ని జిల్లాల చొప్పున ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలిస్తున్నారు. ఈ విషయంలో ఎన్నో మీమ్స్(Memes) సోషల్ మీడియా(Social media) వేదికగా సర్క్యులేట్ అవుతున్నాయి. సరే ఈ అంశాన్ని పక్కన పెడితే.. పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కునారిల్లిపోయింది. అందులో ఏపీ, తెలంగాణలకు మినహాయింపేమీ లేదు. రుణాలు తెచ్చుకోవడం హక్కుగా భావించే అవకాశం వున్నా.. తిరిగి చెల్లించేలా ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోవాల్సి అవసరం వుందన్నది నిర్వివాదాంశం. అందుకే ఎఫ్ఆర్బీఎం పేరిట రుణ పరిమితికి సడలింపులిస్తూ కేంద్రం కొన్ని షరతులను విధిస్తోంది. ఉదాహరణకు తెలంగాణ గనక విద్యుత్ రంగ ఆదాయాన్ని పెంచుకునే చర్యలు తీసుకుంటే 0.5 శాతం రుణపరిమితి అదనంగా ఇస్తామని కేంద్రం కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే.. ఈ అంశాన్ని ఆధారం చేసుకుని కేంద్రంపై కేసీఆర్ పెద్ద యుద్దమే ప్రకటించారు. విద్యుత్ రంగంలో ఆదాయం పెంచుకోవాలని కేంద్రం సూచిస్తే.. ఉచిత విద్యుత్‌కు మీటర్లు బిగించమంటున్నారంటూ కేంద్రంపై ధ్వజమెత్తారు కేసీఆర్. రాష్ట్రాల రుణాలను నియంత్రించడం మొదలుపెట్టిన మోదీ ప్రభుత్వం ఇపుడు కేసీఆర్ (KCR) వంటి ప్రాంతీయ నేతలతో వైరం కొనితెచ్చుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కుదేలు చేస్తున్న ఉచిత హామీల విషయంలో కేంద్రం నిక్కచ్చిగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే ఇక ఈ ప్రాంతీయ మహారాజులు ఊరుకుంటారా ? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గనక ముక్కుసూటిగా ఉచిత హామీలు దేశాన్ని ఆర్థికంగా కుదేలు చేస్తాయని అఫిడవిట్ దాఖలు చేయాలి. ఉచితాలను నియంత్రించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాలి. కానీ కేంద్రం ఎలా స్పందిస్తుందో ఇంకా తేలలేదు. అయితే, కేంద్రం గనక రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు వ్యూహాలతో విచ్చలవిడిగా ఉచిత పథకాలను అమలు చేస్తే ఆర్థిక పరిస్థితి కుదేలవుతుంది.. వాటిని నియంత్రించాలని అంటే మాత్రం విపక్ష పార్టీలు సారథ్యం వహిస్తున్న పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంపై గగ్గోలు పెట్టడం ఖాయం. ఓరకంగా చెప్పాలంటే కేంద్రానిదిపుడు ముందు గొయ్యి.. వెనక నుయ్యి.. అన్న పరిస్థితి.

నిజానికి కేంద్రం కూడా కొన్ని ఉచితాలను అమలు చేస్తోంది. ఉదాహరణకు రైతులకు నగదు బదిలీ పథకం. రాష్ట్రాల స్థాయిలో పెద్ద ఎత్తున కాకపోయినా.. కేంద్రం కూడా స్వల్ప స్థాయిలో రైతులకు నగదు పంపిణీ చేస్తోంది. ఇది కూడా సుప్రీంకోర్టు అభ్యంతర పెడుతున్న ఉచితాల కిందకే వస్తుంది. ఈక్రమంలో కేంద్రం ఉచితాలపై నిస్సంకోచంగా, నిక్కిచ్చిగా ఓ వైఖరిని వ్యక్తం చేస్తుంది అనుకోలేం. ఒకవేళ చేస్తే మాత్రం ఉచితాలను కేంద్రమే అడ్డుకుంటుందంటూ బీజేపీపై విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తాయి.. ఉచితాలకు అలవాటు పడిన ఓటర్లకు బీజేపీ (BJP)ని ఓ బూచిగా చూపిస్తాయి. మరి అలాంటి పరిస్థితి మోదీ (Modi) కొనితెచ్చుకుంటారా అన్నది సందేహమే. రుణాలు, ఉచిత పథకాలు పరస్పరం ఇంటర్ లింకున్న అంశాలు. ఎందుకంటే విచ్చలవిడిగా ఉచిత పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలకు ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి. దాంతో రుణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పరోక్షంగా శ్రీలంక (Srilanka) ఆర్థిక గమనాన్ని గుర్తు చేయక మానదు. ఈనేపథ్యంలో దేశం రుణభారంలో కూరుకుపోకుండా వుండేందుకు కేంద్రం రాష్ట్రాల రుణపరిమితులపై కఠినంగా వ్యవహరించినా.. లేక ఉచిత పథకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినా.. బీజేపీని బదనాం చేసేందుకు విపక్షాలు సిద్దంగా వుంటాయి. అలాగని రుణ పరిమితులను ఎలాంటి షరతులు లేకుండా సడలించినా.. ఉచితాలకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసినా.. మోదీ సర్కార్ (Modi Government) దేశ గమనాన్ని అఖాతం వైపునకు నెట్టినట్లే. ఇలాంటి కీలక సమయంలో రెండు ఇంటర్ లింక్డ్ అంశాలపై మోదీ సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది అత్యంత కీలకంగా కనిపిస్తోంది. ఇక రుణాలు తీసుకునే విషయంలో రాష్ట్రాల హక్కులపై తెలంగాణ (Telangana) వంటి రాష్ట్రాలు దాఖలు చేసే పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది కూడా ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఇటీవల కీలకమైన కామెంట్లు చేసింది. ఆ కామెంట్లలో ఉచిత పథకాలపై కాసింత వ్యతిరేకతే వ్యక్తమైంది. అలాంటప్పుడు అలాంటి ఉచిత పథకాలకు కారణమవుతున్న రుణభారంపైనా, రాష్ట్రాల రుణ పరిమితులపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై సుప్రీంకోర్టు ఏలా స్పందిస్తున్నది ఆసక్తికరమైన అంశమే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu