హోమ్‌వర్క్ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్! ఒంటిపై 150 వాతలు
MRG ప్రైవేట్ పాఠశాల నుంచి శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన రెండో తరగతి బాలుడు నీరసంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అనంతరం బాలుడి కాళ్లపై కమిలిపోయిన గాయాలు ఉండటం చూసి బాలుడిని ప్రశ్నించగా.. ఇంగ్లిష్ టీచర్ ప్రఖార్ సింగ్ ఏకధాటిగా 150 సార్లు..

గోండా, ఫిబ్రవరి 8: రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి హోమ్‌వర్క్ చేయలేదనీ ప్రైవేట్ స్కూల్ టీచర్ చితకబాదాడు. బెత్తంతో ఏకంగా 150 సార్లు బాలుడిని విచక్షణా రహితంగా కొట్టాడు. బాలుడి ఒంటిపై తేలిన గాయాలు చూసి తల్లిదండ్రులు సదరు టీచర్‌ను నిలదీశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కర్నైల్‌గంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని కర్నేల్‌గంజ్ గ్రామ పరిధిలోని MRG ప్రైవేట్ పాఠశాల నుంచి శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన రెండో తరగతి బాలుడు నీరసంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అనంతరం బాలుడి కాళ్లపై కమిలిపోయిన గాయాలు ఉండటం చూసి బాలుడిని ప్రశ్నించగా.. ఇంగ్లిష్ టీచర్ ప్రఖార్ సింగ్ ఏకధాటిగా 150 సార్లు బెత్తంతో కొట్టాడని చెప్పాడు. దెబ్బల ధాటికి పదేళ్ల పిల్లాడి కాళ్ల నిండా బెత్తం గాయాలు బొబ్బలు తేలాయి. బాలుడు కుంటుతూ నడుస్తుండటంతో పిల్లాడిని కొట్టిన విషయం ఎవరికీ చెప్పవద్దని సదరు టీచర్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. కొడుకు పరిస్థితి చూసి కలత చెందిన తండ్రి పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో నిందితుడైన ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి తొలగించినట్లు MRG స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే మేము ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించామని తెలిపారు.
భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 115(2), 351(3, 352 కింద ఆ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ కర్నైల్‌గంజ్ అభిషేక్ దబాచా ధృవీకరించారు. నిందితుడైన ఉపాధ్యాయుడిపై పోలీసులు చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




