AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.40 వెన్న కోసం ఐపీఎస్ హైడ్రామా.. చివరికి అసలు రంగు బయటపడింది!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.40 విలువైన వెన్న కోసం డబ్బులు చెల్లించకుండా తప్పించుకోవాలని ప్రయత్నించిన వ్యక్తి, తాను ఐపీఎస్ అధికారినని చెప్పుకుని హంగామా సృష్టించాడు. అయితే చివరకు పోలీసుల విచారణలో అతడి అసలు బండారం బయటపడటంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

రూ.40 వెన్న కోసం ఐపీఎస్ హైడ్రామా.. చివరికి అసలు రంగు బయటపడింది!
Fake Ips Officer
Balaraju Goud
|

Updated on: Jun 16, 2026 | 2:36 PM

Share

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.40 విలువైన వెన్న కోసం డబ్బులు చెల్లించకుండా తప్పించుకోవాలని ప్రయత్నించిన వ్యక్తి, తాను ఐపీఎస్ అధికారినని చెప్పుకుని హంగామా సృష్టించాడు. అయితే చివరకు పోలీసుల విచారణలో అతడి అసలు బండారం బయటపడటంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన లక్నోలోని మహానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గోల్ మార్కెట్ కూడలిలో చోటుచేసుకుంది. మిథిలేష్ శుక్లా అనే వ్యక్తి అక్కడి టీ స్టాల్‌కు వెళ్లి రూ.40 విలువైన సీల్ చేసిన వెన్న ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు. అనంతరం దుకాణదారుడు డబ్బులు అడగ్గా, అతను ఆగ్రహంతో స్పందించాడు. తాను నోయిడాలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారినని చెప్పుకుంటూ దుకాణదారుడిని బెదిరించాడు.

నిందితుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఛాయ్‌వాలా అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే పోలీసులను చూసిన తర్వాత కూడా మిథిలేష్ శుక్లా తన నాటకాన్ని కొనసాగించాడు. తాను ఐపీఎస్ అధికారినని చెబుతూ, తనకు ఎందుకు సెల్యూట్ చేయలేదని పోలీసులను ప్రశ్నించాడు.

పోలీసులు అతడిని గుర్తింపు కార్డు, ఇతర అధికారిక పత్రాలు చూపించాలని కోరగా, ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయాడు. దీంతో పోలీసులు అతడిని క్షుణ్ణంగా విచారించారు. దాంతో అతడి అసలు పేరు మిథిలేష్ శుక్లా అని, అతను లక్నోలోని సీతాపూర్ రోడ్డులో ఉన్న భారత్ నగర్ ప్రాంతానికి చెందినవాడని తేలింది. అలాగే నోయిడాలోని సెక్టార్-18లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు వెల్లడించాడు.

నకిలీ గుర్తింపుతో దుకాణదారుడిని బెదిరించడమే కాకుండా, పోలీసు అధికారులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గోల్ మార్కెట్ పోలీస్ పోస్ట్ ఇన్‌చార్జ్ ఆర్యన్ శర్మ ఫిర్యాదు మేరకు మహానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో కూడా అతను ఇలాంటి మోసపూరిత చర్యలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us