Bullet Train: 2 గంటల్లోనే హైదరాబాద్ టు బెంగళూరు.. బుల్లెట్ రైలుపై కేంద్రం అప్డేట్..
కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏడు బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులను ప్రకటించింది. ప్రస్తుతం వీటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక ప్రాజెక్ట్ పనులు మొదలయ్యాయి. కొన్ని డీపీఆర్ ప్రక్రియ పూర్తి చేసుకోగా.. మరికొన్ని సర్వే దశలో ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి ఏంటి అనేది చూద్దాం.

దేశంలో రైల్వే సదుపాయాలను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో ఒక ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగా.. మూడు ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లకు ఆమోదం లభించింది. మరో మూడు బుల్లెట్ రైల్ కారిడార్లు ఇంకా సర్వే దశలో ఉన్నాయి. ఢిల్లీ, వారణాసి, పూణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలను కలుపుతూ ఏడు కొత్త బుల్లెట్ రైలు కారిడార్లను కేంద్రం నిర్మిస్తోంది. సుమారు రూ. 16 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ హైస్పీడ్ రైలు కారిడార్లు పట్టణ కేంద్రాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేయనుంది.
ఢిల్లీ-వారణాసి బుల్లెట్ రైలు కారిడార్
ఢిల్లీ-వారణాసి బుల్లెట్ రైలు కారిడార్ దేశ రాజధాని ఢిల్లీ, యూపీలోని ప్రధాన నగరాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపర్చనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న వందే భారత్ రైలు ప్రయాణానికి 8 గంటల సమయం పడుతుంది. అయిలే బుల్లెట్ రైలు అందుబుటులోకి వస్తే.. ఢిల్లీ, వారణాసి మధ్య కేవలం 3 గంటల 50 నిమిషాల్లోనే ప్రయాణం చేయవచ్చు.
వారణాసి-సిలిగురి
ఈ బుల్లెట్ రైలు కారిడార్ పాట్నా మీదుగా వెళుతుంది. ఉత్తర, ఈశాన్య భారతదేశాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయనుంది. కేవలం 2 గంటల 55 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చు.
చెన్నై-బెంగళూరు
ఈ రెండు నగరాల మధ్య ఉన్న బలమైన ఆర్థిక, వ్యాపార సంబంధాల ఉన్నాయి. దీంతో ఈ కారిడార్ అత్యంత కీలకంగా మారనుంది. సుమారు 1 గంట 13 నిమిషాలలోనే చెన్నై, బెంగళూరు మధ్య ప్రయాణం చేయవచ్చు. దీనితో రైలు ప్రయాణం దాదాపు విమాన ప్రయాణమంత వేగంగా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ తరచుగా ప్రయాణించే వారికి సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందించనుంది.
హైదరాబాద్-బెంగళూరు కారిడార్
ఈ కారిడార్ రెండు ప్రధాన టెక్నాలజీ కేంద్రాల మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు 2 గంటలకు తగ్గించనుంది. ప్రయాణీకుల రాకపోకలను మెరుగుపరచడంతో పాటు ఈ నగరాల మధ్య ఆర్థిక, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.
హైదరాబాద్-చెన్నై కారిడార్
హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు కారిడార్ ప్రయాణ సమయాన్ని సుమారు 2 గంటల 55 నిమిషాలకు తగ్గించనుంది. దీని ద్వారా తెలంగాణ, తమిళనాడుల మధ్య అనుసంధానం పెరగనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రజల వేగవంతమైన రాకపోకలను సులభతరం చేయడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్యం, పర్యాటకం మరియు వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగపడనుంది.
ముంబై-పుణె బుల్లెట్ రైలు కారిడార్
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైకి, ప్రధాన సాంకేతిక, ఉత్పాదక కేంద్రమైన పూణేకి మధ్య రోజువారీ ప్రయాణాలను, వ్యాపార ప్రయాణాలను సమూలంగా మార్చనుంది. ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రయాణ సమయాన్ని కేవలం 48 నిమిషాలకు తగ్గించనుంది.
పూణే-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్
పూణే-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ రెండు ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కలపనుంది. ప్రయాణ సమయాన్ని సుమారు 1 గంట 55 నిమిషాలకు తగ్గించనుంది. ఈ రెండు నగరాల మధ్య మెరుగైన అనుసంధానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తయారీ, సేవల వంటి రంగాలలో పెట్టుబడులను, వ్యాపార వృద్ధిని ప్రోత్సహించగలదు.
