Republic Day 21 Gun Salute: గణతంత్ర వేడుకల్లో 21 గన్ సెల్యూట్ ఎందుకు చేస్తారు..? దీని వెనుక అసలు కథ ఇదే
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించే కవాతు కేవలం కనువిందు కోసం మాత్రమే కాదు.. వినడానికి కూడా ఒక అద్భుతమైన అనుభవం. రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించే ముందు పరేడ్‌లో చేసే 21 గన్ సెల్యూట్ తుపాకుల గర్జన ఒక అద్భుతమైన అనుభూతి. సరిగ్గా 'జనగణమన' జాతీయ గీతం మొదలైన మొదటి సెకనుకే మొదటి గన్ ఫైర్ అవుతుంది. జాతీయ గీతం ముగిసేసరికి సరిగ్గా 21వ రౌండ్ పూర్తవుతుంది. అసలు 21-గన్ సెల్యూట్ చరిత్ర ఏమిటో? ఇది ఎప్పటి నుంచి అనుసరిస్తున్నారో చాలా మందికి తెలియదు. ఆ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర దినోత్సవ కవాతులో 21 గన్ సెల్యూట్ ఆచారం 17వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. ఇది నాటి బ్రిటిష్ వలసరాజ్యాల నౌకాదళం కాలం నాటిది. యుద్ధ నౌకలు శాంతిని కోరుకుంటున్నామని చెప్పడానికి తమ వద్ద ఉన్న మందుగుండును సముద్రంలోకి పేల్చేవి. బ్రిటిష్ నావికాదళ నౌకలు శాంతియుత ఉద్దేశాన్ని ప్రదర్శించడానికి 7 కాల్పులు జరిపేవారు. జ్యోతిషశాస్త్రం, బైబిల్ సంప్రదాయాలలో కూడా ప్రస్తావన ఉంది. ప్రతిగా తీర ప్రాంతంలోని వారు యుద్ధనౌక ప్రయోగించిన ప్రతి షెల్‌కు 3 కాల్పులు జరిపేారు. అలా 21 గన్ సెల్యూట్ ఒక వందన సంప్రదాయంగా ఉనికిలోకి వచ్చింది. 1818 నాటికి US నావికా నిబంధనలు 21-గన్ సెల్యూట్‌పై మొదటి రాతపూర్వక సూచనలువచ్చాయి. 1875 నాటికి యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా 21-గన్ సెల్యూట్‌ను స్వీకరించింది. అదే సంఖ్యను బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాలు కూడా ఉపయోగించాయి.
అప్పుడు 31.. ఇప్పుడు 21..
ఇక స్వతంత్ర్య భారతంలో 1950 నుంచి గన్ సెల్యూట్ సంప్రదాయం కొనాసాగుతుంది. నాటి మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బాధ్యతలు స్వీకరించినప్పుడు 31 తుపాకులతో గౌరవ వందనం ఇచ్చారు. జనవరి 26న ఆయన తన బంగారు బగ్గీలో రాజ్‌పథ్ (కర్తవ్య పథ్ అని గతంలో పిలిచేవారు)కు కారులో వెళ్లే సమయంలో 31 గన్‌సెల్యూట్ చేశారు. కానీ ఇప్పుడు అది 21కి మారింది. ఇది దేశాధినేతకు ఇచ్చే అత్యున్నత గౌరవం. ఈ 21 రౌండ్లు పేల్చడానికి మొత్తం 7 ఫిరంగులను వాడతారు. ప్రతి 2.25 సెకన్లకు ఒక రౌండ్ చొప్పున 3 రౌండ్లు గన్ పేలుస్తారు. దీనికోసం ప్రత్యేకమైన క్లాకులను వాడుతారు. గతంలో బ్రిటిష్ కాలం నాటి ’25-పౌండర్’ గన్లను వాడేవారు. కానీ 2024 నుంచి మన దేశంలోనే తయారైన 105mm ఇండియన్ ఫీల్డ్ గన్లను (IFG) మాత్రమే వాడుతున్నారు. అలాగే, స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత జెండా, రాష్ట్రపతి ఇద్దరినీ 21 తుపాకీ వందనంతో సత్కరిస్తారు. ఈ గౌరవం దేశాన్ని సందర్శించే విదేశీ దేశాధినేతలకు కూడా ఇవ్వబడుతుంది. జనవరి 15న వచ్చే ఆర్మీ డే, జనవరి 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా కూడా 21 తుపాకీలతో కూడిన వందనం నిర్వహిస్తారు. ప్రతి జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవం నాడు 21 గన్ సెల్యూట్ ఖచ్చితంగా నిర్వహిస్తారు. గన్ సెల్యూట్ సమయం జాతీయ గీతం – జన గణ మన పొడవుకు అనుగుణంగా ఉంటుంది. మొదటి కాల్పులు ప్రారంభంలో జరుగుతాయి. చివరి కాల్పులు జాతీయ గీతం ముగింపుతో సమానంగా ఉంటాయి.
మేక్ ఇన్ ఇండియా ముద్ర
జబల్‌పూర్ గన్ క్యారేజ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ ఫిరంగులు మన స్వదేశీ సత్తాకు నిదర్శనం. వలస పాలన గుర్తులను పూర్తిగా చెరిపేసి, స్వదేశీ పరిజ్ఞానంతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. పరేడ్‌లో చేసే గన్ సెల్యూట్ కేవలం శబ్దం కోసం చేసే ‘బ్లాంక్ రౌండ్స్’ మాత్రమే. వీటిలో ఎలాంటి బాంబులు లేదా షెల్స్ ఉండవు. కేవలం గాలిలో పొగ, భారీ శబ్దాన్ని మాత్రమే వినగలం.
19-గన్, 17-గన్ సెల్యూట్ గురించి విన్నారా?
మన దేశంలో 21 తుపాకీల వందనం అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు ఇతర గన్ సెల్యూట్‌లు కూడా ఉన్నాయి. తుపాకీ-నమస్కారాల సంఖ్య హోదా, ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఉదాహరణకు స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో రాజులకు మాత్రమే ఇంపీరియల్ సెల్యూట్ అని పిలువబడే 101-గన్ సెల్యూట్ ఉండేది. రాజకుటుంబ సభ్యులు, భారత గవర్నర్ జనరల్‌కు 31-గన్ సెల్యూట్ చేసేవారు. భారతీయ పాలకులకు బ్రిటిష్ పాలకులతో ఉన్న సంబంధాన్ని బట్టి 21 గన్ సెల్యూట్, 19-గన్ సెల్యూట్, 17-గన్ సెల్యూట్, 15-గన్ సెల్యూట్, 11- గన్ సెల్యూట్, 9-గన్ సెల్యూట్‌లు చేసేవారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




