BJP: బెడిసికొట్టిన బీజేపీ వ్యూహాలు.. మెజార్టీ సీట్లు తగ్గడానికి అసలు కారణాలేంటి..?

విజయం, పరాజయం.. రెండూ పాఠాలు నేర్పుతాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సొంతంగా సాధించడంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఓడి, కూటమిగా గెలిచి అటు విజయం, ఇటు పరాజయం అని చెప్పలేని స్థితిలో ఉంది. ఏ స్థితిలో ఉన్నా.. కారణాలను విశ్లేషించుకుని, పొరపాట్లను సరిద్దుకోక తప్పదు.

BJP: బెడిసికొట్టిన బీజేపీ వ్యూహాలు.. మెజార్టీ సీట్లు తగ్గడానికి అసలు కారణాలేంటి..?
Pm Narendra Modi
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Jun 06, 2024 | 8:00 PM

విజయం, పరాజయం.. రెండూ పాఠాలు నేర్పుతాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సొంతంగా సాధించడంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఓడి, కూటమిగా గెలిచి అటు విజయం, ఇటు పరాజయం అని చెప్పలేని స్థితిలో ఉంది. ఏ స్థితిలో ఉన్నా.. కారణాలను విశ్లేషించుకుని, పొరపాట్లను సరిద్దుకోక తప్పదు. కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్టు బీజేపీ వెనుకబాటుకు కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఆ కారణాలే కేంద్రంలో పదేళ్ల తర్వాత సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదం చేశాయి.

543 స్థానాలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 240 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ ఆ సంతోషం కనిపించడం లేదు. మరోవైపు ఆ పార్టీతో జట్టుకట్టి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన మిత్రపక్షాలు సంతోషంగా ఉన్నాయి. చేతులు కలిపి ముందుకు సాగితే తమ ఓటుబ్యాంకు కూడా కలుస్తుందని, ఉమ్మడి పోరాటంతో బలం పెరుగుతుందని ప్రతిపక్ష కూటమి (I.N.D.I.A) కూడా నిరూపించింది. 18వ లోక్‌సభలో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ పదేళ్లు చూసిన ప్రభుత్వం ఒకెత్తయితే.. ఇకపై చూడబోయేది మరో ఎత్తు అన్నట్టుగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ బీజేపీని వెనక్కిలాగిన ఆ కారణాల్లో కొన్నింటిని విశ్లేషిస్తే..

ప్రభుత్వ వ్యతిరేకత

సాధారణంగా అధికారంలో ఎవరున్నా సరే.. ఆ పార్టీ ఎంత మంచి పాలన అందించినా సరే.. విస్మరించిన అంశాలు చాలానే ఉంటాయి. మరోవైపు ఓటర్లలోనూ ఆశలు, ఆకాంక్షలు నానాటికీ పెరుగుతూనే ఉంటాయి. మొత్తంగా ఒక టర్మ్ పూర్తయ్యేసరికే ప్రతి పార్టీ ఎంతో కొంత వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది. అయితే భారతీయ జనతా పార్టీ 2014 కంటే 2019లో మరిన్ని ఎక్కువ సీట్లు సాధించి ఘన విజయం సాధించడంతో తమ పాలనపై సానుకూలత తప్ప వ్యతిరేకత అన్నదే లేదన్న భావనలోకి వెళ్లిపోయింది. నిజానికి 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఖాతా కూడా తెరవకపోగా.. కేవలం హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర వంటి పశ్చిమ రాష్ట్రాల్లో స్వీప్ చేయడమే ఆ పార్టీకి నాడు అంత బలాన్ని ఇచ్చింది. ఈసారి ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యతిరేకత ఉందని పాలకపక్ష గుర్తించినప్పటికీ.. దాని తీవ్రత ఎంతన్నది మాత్రం అంచనా వేయలేకపోయారు.

పదేళ్లుగా ఒకే పార్టీ అధికారంలో ఉండడం.. ప్రపంచమే అతలాకుతలమైన కోవిడ్-19 మహమ్మారి సహా ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం, తాజాగా పాలస్తీనా – ఇజ్రాయిల్ మధ్య నెలకున్న యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల ప్రభావం యావత్ ప్రపంచంపైనే ఉంది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఆర్థిక వ్యవస్థలు తిరోగమనం దిశగా అడుగులు వేస్తున్న సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకు సాగింది. కానీ ఈ క్రమంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల పెరిగాయి. వీటితో పాటు ప్రభుత్వం సబ్సిడీల భారాన్ని తగ్గించుకోవడమే తమ విధానంగా ముందుకు సాగింది. పెట్రోల్, గ్యాస్, చివరకు రైళ్లలో వృద్ధులకు ఇస్తున్న రాయితీలు, సబ్సిడీలు కూడా మాయమయ్యాయి. మొత్తంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. దీన్ని బీజేపీ అగ్రనాయకత్వం గమనించి.. దిద్దుబాటు చర్యల్లో భాగంగా 135 మంది సిట్టింగ్ ఎంపీలను మార్చి కొత్తవారికి టికెట్లు ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. వ్యతిరేకత స్థానిక నేతలపై కాదు, యావత్ ప్రభుత్వంపైనే ఉంది అంటూ ఓటర్లు తమ తీర్పునిచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది.

బెంగాల్‌లో వికటించిన సీఏఏ

మొత్తం 42 లోక్‌సభ సీట్లున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2019లో 18 సీట్లు గెలుపొందిన బీజేపీ, ఈ సారి 20 దాటి గెలుచుకుంటామని భావించింది. కానీ చివరకు 12 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. బెంగాల్ ఫలితాలను తీవ్రంగా ప్రభావితం అంశం పౌరసత్వ సవరణ చట్టం (CAA). అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో మతపరమైన హింసకు గురై భారత్‌కు వలసవచ్చిన ముస్లీమేతర మతాలకు చెందినవారికి భారత పౌరసత్వం కల్పించి పూర్తి హక్కులు కల్పించడమే ఈ చట్టం ముఖ్యోద్దేశం. కానీ ఓటుబ్యాంకు రాజకీయాలతో లబ్ది పొందాలనుకున్న విపక్ష పార్టీలు నానా రాద్ధాంతం చేశాయి. బెంగాల్‌లో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినవారి సంఖ్య గణనీయంగా ఉంది. వారిలో ముస్లీమేతరులు సీఏఏ కోసం దరఖాస్తు చేసుకుని పూర్తి హక్కులు పొందవచ్చు. కానీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమత బెనర్జీ ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. “ఈ చట్టం ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే.. మీ అంతట మీరు బంగ్లాదేశీ శరణార్థిగా చెప్పుకున్నట్టు అవుతుంది. మీకు ఇప్పటికే అందుతున్న ప్రభుత్వ ప్రయోజనాలు అన్నీ ఆగిపోతాయి” అంటూ మమత చేసిన ప్రసంగాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. ఫలితంగా బీజేపీకి పడాల్సిన హిందూ ఓట్లకు కూడా గండి పడింది.

చేతులూ కలిశాయి.. మనసులూ కలిశాయి

బీజేపీ ఓటమి, మోదీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా చేతులు కలిపిన విపక్ష కూటమి పార్టీలు ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతిని పక్కనపెట్టినప్పుడు ఆమె ఆగ్రహంతో “కూటమిలో నేతల చేతులు కలుస్తాయి తప్ప మనసులు కలవవు” అన్నారు. సాధారణంగా రాజకీయ పార్టీలు పరస్పర ప్రయోజనాల కోసం జట్టు కడుతూ ఉంటాయి. రాజకీయాల్లో అన్ని వేళలా 1+1=2 కాకపోవచ్చు. ఒక్కోసారి అది 0 అవుతుంది.. ఒక్కోసారి అది 11గా కూడా మారుతుంది. విపక్ష కూటమి విషయంలో ఐక్యత చాలా రాష్ట్రాల్లో చాలా వరకు కలిసొచ్చిందనే చెప్పవచ్చు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కేరళలో కమ్యూనిస్టులు కూటమి పొత్తులతో సంబంధం లేకుండా విడిగా పోటీ చేసినా సరే.. మొత్తంగా కూటమి బలం గతం కంటే చాలా పెరిగింది. ఇంకా చెప్పాలంటే బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో ఉన్న రెండు పార్టీలను తమవైపు తిప్పుకుంటే ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది.

కనిపించని అయోధ్య రామాలయ ప్రభావం

అయోధ్య రామాలయం. హిందువుల చిరకాల వాంఛ. దాన్ని నిజం చేసినందుకు హిందువులంతా ఏకమై తమకు ఓటేస్తారని భావించిన చోటే బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. అయోధ్య పట్టణం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలోనే బీజేపీ ఓటమి పాలైంది. జనవరిలో మందిరం ప్రారంభించినప్పుడు దేశమంతటా ఏర్పడ్డ భావోద్వేగ వాతావరణం మే నెల నాటికి చాలావరకు మారింది. ఆలయ నిర్మాణం కారణంగా ముస్లిం ఓట్లు ప్రతిపక్షాలవైపు గంపగుత్తగా పడ్డాయి. కానీ హిందువుల ఓట్లు కులాలవారీగా చీలిపోయాయి. ఫలితంగా అయోధ్య రామాలయం నిర్మించిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోనే బీజేపీకి కోలుకోలేనంత గట్టి దెబ్బ తగిలింది.

దక్షిణాదిన వికసించని కమలం

ఈసారి దక్షిణాదిన కమల వికాసం ఎదురుచూసిన బీజేపీ అగ్రనేతలకు పార్టీ గతం కంటే మెరుగుపడినా.. సీట్ల సంఖ్య విషయంలో నిరాశే ఎదురైంది. ఏపీలో మిత్రపక్షంతో కలిసి 6 చోట్ల పోటీ చేసి 3 గెలుచుకుంది. తమిళనాడులో బలం పుంజుకున్నప్పటికీ.. అది గెలుపించేంతగా లేకపోయింది. కేరళలో ఖాతా తెరిచి ఒక స్థానాన్ని గెలుపొందగలిగింది. కర్ణాటకలో జేడీ(ఎస్)తో కలిసి పోటీ చేసి పరువు నిలుపుకుంది. అయినప్పటికీ 2019తో పోల్చితే స్థానాలు తగ్గాయి. అన్నింటికన్నా తెలంగాణ రాష్ట్రమే కాస్త కమలనాథులకు ఊరటనిచ్చింది. ఇక్కడ మాత్రమే రెట్టింపు స్థానాల్లో గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. ఏకంగా 35% ఓట్లు సాధించి పార్టీని ఉత్తర, పశ్చిమ తెలంగాణలో విస్తరించింది. బలమైన పునాదులు వేసింది. అయినప్పటికీ తూర్పు, దక్షిణ భాగాలు బీజేపీ ఇంకా కొరుకుడు పడడం లేదు. దేశంలోనూ అంతే.. తూర్పు, దక్షిణ దిక్కుల్లో పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. ఉత్తర, పశ్చిమ దిక్కుల్లో మాత్రమే తమ బలం, పట్టు సాగిస్తూ వస్తోంది.

వీటితో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం మూడో వంతుకు పైగా సిట్టింగ్ అభ్యర్థులను మార్చుతూ చేసిన ప్రయోగం కూడా బెడిసికొట్టింది. ఈ క్రమంలో పార్టీ నేతలకు కాకుండా గెలుపు గుర్రాలు అనుకుంటూ ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినవారికి పార్టీ టికెట్లు ఇచ్చింది. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్యకర్తలకు ఈ చర్య ఆగ్రహం తెప్పించింది. మరోవైపు టికెట్ దక్కించుకోలేకపోయిన సిట్టింగ్ ఎంపీలు కొందరు స్వతంత్రంగా బరిలోకి దిగితే, మరికొందరు ఇతర పార్టీల్లో చేరి పోటీ చేశారు. ఫలితంగా అనేక చోట్ల పార్టీ ఓటమికి ఈ పరిస్థితులు కారణమయ్యాయి. చివరగా.. యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న క్షత్రియ (రాజ్‌పుత్ – ఠాకూర్) సామాజిక వర్గాన్ని బీజేపీ పక్కనపెట్టిందన్న భావన వారిలో కలిగింది. వారి సంఖ్యాబలాన్ని మించి ప్రభావం చూపగల్గిన క్షత్రియులు బీజేపీపై ఆగ్రహంతో ఆ పార్టీ ఓటుబ్యాంకును చీల్చారు. ఇలా అనేక కారణాలు కలిసి బీజేపీ ఆధిపత్యానికి బ్రేకులు వేయగా.. పదేళ్ల తర్వాత తొలిసారిగా అసలు సిసలు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు వేశాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…