AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Starlink: భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలకు గ్రీన్‌ సిగ్నల్.. లైసెన్స్‌ జారీ.. ఎక్స్‌ వేదికగా తెలిపిన కేంద్రమంత్రి!

భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ రూపొందించిన స్టార్‌లింక్‌కు సేవలను భారత్‌లో అందించేందుకు లైసెన్స్ మంజూరు చేసింది. బుధవారం కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, స్పేస్‌ఎక్స్ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Starlink: భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలకు గ్రీన్‌ సిగ్నల్.. లైసెన్స్‌ జారీ.. ఎక్స్‌ వేదికగా తెలిపిన కేంద్రమంత్రి!
Spacex,
Anand T
|

Updated on: Jun 18, 2025 | 7:13 PM

Share

భారత్‌లో శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో స్పేస్‌ఎక్స్‌ సంస్థ రూపొందించిన స్టార్‌ లింక్‌ నెట్‌వర్క్‌ను సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై చర్చించారు. ఈ చర్చలు సఫలం కావడంతో భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలు అందించేందుకు స్పేస్‌ఎక్స్‌ సంస్థకు లైసెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. అయితే భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలు అందించేందుకు కేంద్ర లైసెన్స్‌ జారీ చేయడంపై స్పేస్‌ఎక్స్‌ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సింధియా ‘ఎక్స్’ వేదికగా తెలియజేషారు.

కేంద్రమంత్రి ఎక్స్‌ వేదికగా చేసిన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. “కనెక్టివిటీ రంగంలో భారత్‌ తదుపరి దశకు చేరేందుకు సంబంధించి స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ సీఓఓ గ్వినే షాట్‌వెల్‌తో చర్చలు జరిపినట్టు ఆయన తెలిపారు. డిజిటల్ ఇండియా అపారమైన ఆకాంక్షలకు అనుగుణంగా దేశంలోని ప్రతి పౌరుడికి సాధికారత కల్పించే దిశగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. శాటిలైట్ కమ్యూనికేషన్లలో సహకార అవకాశాలపై లోతుగా చర్చించాం” అని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ డిజిటల్ విప్లవంలో దూసుకుపోతోందని, ఈ తరుణంలో శాటిలైట్ సాంకేతికతలు కేవలం సంబంధితమైనవి మాత్రమే కాకుండా, పరివర్తనాత్మకమైనవని సింధియా రాసుకొచ్చారు. స్టార్‌లింక్‌కు లైసెన్స్ మంజూరు చేయడం ఈ ప్రయాణంలో గొప్ప ప్రారంభమని ఆయన అభిప్రాయపడ్డారు.

స్టార్‌ లింక్‌ అంటే ఏమిటి..

స్టార్‌లింక్ అనేది ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) అనే సంస్థ అభివృద్ధి చేసిన ఒక ఉపగ్రహ ఇంటర్నెట్ సేవ. ఇది భూమి చుట్టూ తక్కువ ఎత్తులో (Low Earth Orbit) వేలాది చిన్న ఉపగ్రహాలను ఉంచి, ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన, తక్కువ లేటెన్సీ గల ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో పనిచేస్తుంది. దీనిని ముఖ్యంగా కనెక్టివిటీ సేవలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను అందించేందుకు రూపొందించబడింది.

ఈ స్టార్‌లింక్‌ను మనం టీవి డిష్‌ మాదిరిగా వినియోగించవచ్చు. మన ఇంటిపైన దినికి సంబంధించిన డిష్‌ ఏర్పాటు చేసుకొని నేరుగా దీని ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగించవచ్చు. ఇది సాధారణ ఇంటర్నెట్‌ సేవల కంటే ఎక్కువ వేగంగా సేవలను అందిస్తుంది. స్టార్‌లింక్ సాధారణంగా 25 Mbps నుండి 220 Mbps వేగంతో ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలలో ప్రస్తుతం ఈ స్టార్‌ లింక్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్టార్‌లింక్, గృహ, ప్రయాణ వినియోగానికి అనుగుణంగా వివిధ ఇంటర్నెట్ ప్లాన్‌లను అందిస్తుంది. భారతదేశంలో, ఈ సేవ రెండు ప్రధాన ఎంపికలతో ప్రారంభించాలని స్పేస్‌ఎక్స్‌ భావిస్తోంది. చిన్న కుటుంబాలు లేదా కనీస డేటా అవసరాలు ఉన్న వినియోగదారుల కోసం ఉద్దేశించిన “రెసిడెన్షియల్ లైట్” ప్లాన్, ఎక్కువ బ్యాండ్‌విడ్త్, భారీ ఇంటర్నెట్ వినియోగం అవసరమయ్యే వారి కోసం ఉద్దేశించిన సమగ్ర “పూర్తి నివాస” ప్యాకేజీని అందుబాటులోకి తీసుకురానుంది.

భారతదేశంలో స్టార్‌లింక్ ధర..

స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ భారతదేశంలో తన స్టాండర్డ్ కిట్‌ను రూ.33,000 అంచనా ధరకు విడుదల చేయనుంది. ఈ ప్యాకేజీలో స్టార్‌లింక్ శాటిలైట్ డిష్, కిక్‌స్టాండ్, థర్డ్-జనరేషన్ రౌటర్, పవర్ అడాప్టర్, AC కేబుల్స్ సహా శాటిలైట్ ఇంటర్నెట్‌తో ప్రారంభించడానికి అవసరమైన ప్రతిదీ ఉంటుంది. ప్రధానంగా గృహ వినియోగదారుల కోసం రూపొందించబడిన ఈ కిట్, వీడియో స్ట్రీమింగ్, వర్చువల్ సమావేశాలు, గేమింగ్ వంటి రోజువారీ ఆన్‌లైన్ కార్యకలాపాలను నిర్వహించడానికి రూపొందించబడింది. స్టార్‌లింక్‌ అన్‌లిమిటెడ్‌ డేటా యాక్సెస్ కోసం మంత్‌లీ ప్లాన్‌ను రూ.3,000, నుంచి రూ.4,200 మధ్య తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..