AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Navy: అమెరికన్ టోమాహాక్ మిస్సైళ్లకు పోటీ.. నావికాదళానికి స్వదేశీ మిస్సైల్స్‌!

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిస్ మిస్సైల్ విజయవంతంగా ప్రయోగించారు.

Indian Navy: అమెరికన్ టోమాహాక్ మిస్సైళ్లకు పోటీ.. నావికాదళానికి స్వదేశీ మిస్సైల్స్‌!
Long Range Attack Cruise Missile
Mahatma Kodiyar
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 14, 2024 | 8:38 AM

Share

భారత రక్షణ రంగం అన్ని విభాగాల్లోనూ బలోపేతమవుతోంది. ఓవైపు రష్యా సహకారంతో అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పర్చుకుంటూ.. మరోవైపు నావికాదళంలోనూ సుదూర లక్ష్యాలను చేధించగల క్షిపణులను సమకూర్చుకుంటోంది. తాజాగా ఇండియన్ నేవీకి 200 లాంగ్ రేంజ్ అటాక్ క్రూయిజ్ మిస్సైళ్ళు అందనున్నాయి.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిస్ మిస్సైల్ (LRLACM)ను చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి పరీక్షించగా 1,000 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాన్ని గురితప్పకుండా చేరుకుని ధ్వంసం చేసింది. దీన్ని ఒక మొబైల్ ఆర్టికల్ లాంచర్ నుంచి ప్రయోగించి పరీక్షించారు. ఈ పరీక్షలు విజయవంతం కావడంతో సుమారు 200 లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైళ్లను నావికా దళానికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే DRDO క్షిపణుల పనితీరును మరింత మెరుగుపరచడానికి సుమారు 20 అదనపు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ లాంగ్ రేంజ్ అటాక్ క్రూయిజ్ మిస్సైళ్లను యాక్సెప్టెన్స్ ఆఫ్ రిక్వైర్‌మెంట్స్ (AON) కింద రక్షణ విభాగం సమకూర్చుకుంటోంది. సాధారణంగా మిలటరీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలలో ఎవరికి ఏ రకమైన ఆయుధాన్ని సమకూర్చాలన్నా “డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్” అన్ని విధాలుగా పరిశీలించి, ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో మిషన్ మోడ్ విధానంలో ఆమోదిస్తూ ఉంటారు. ప్రస్తుతం లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైళ్ల విషయంలోనూ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మిషన్ మోడ్ విధానంలో ఆమోదించింది. తద్వారా వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటన్నది అర్థమవుతోంది. ఈ క్షిపణులు భారత సాయుధ బలగాలకు, ప్రత్యేకించి నౌకాదళానికి అదనపు సామర్థ్యాన్ని అందజేయనున్నాయి.

లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిస్ మిస్సైల్ (LRLACM) పనితీరును పరీక్షించే క్రమంలో క్షిపణికి నిర్దేశించిన మార్గంలో పర్యవేక్షించడానికి ITR ద్వారా రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్‌తో పాటు టెలిమెట్రీ వంటి అనేక శ్రేణి సెన్సార్‌లను అమర్చారు. నిర్దేశించిన లక్ష్యాన్ని నిర్దేశించిన మార్గంలో ప్రయాణించి చేరుకుంది. ఈ క్షిపణికి సంబంధించిన అదనపు పరీక్షలను నిర్ణీత గడువులోగా DRDO పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన 200 లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైళ్ల ఆర్డర్ వస్తుందని రక్షణశాఖ వర్గాలు చెబుతున్నాయి.

అమెరికా టోమాహాక్ క్రూయిజ్ మిస్సైళ్లతో పోటీ?

క్షిపణులను తయారు చేసే క్రమంలో ఇప్పటికే ఈ రంగంలో మన కంటే ముందున్న దేశాల్లోని ఆయుధాలతో పోల్చుకోవడం సహజం. ప్రస్తుతం డీఆర్డీవో రూపొందించిన లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైళ్లను అమెరికాకు చెందిన టోమాహాక్ క్రూయిజ్ మిస్సైళ్లతో పోల్చుతున్నారు. టోమాహాక్ క్రూయిజ్ మిస్సైల్‌ భూమ్మీద నుంచి మాత్రమే కాదు, సముద్రంలోని యుద్ధ నౌకలు, సముద్రగర్భంలో ప్రయాణించే జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించగల ఖచ్చితమైన ఆయుధం. దాని ప్రత్యేకతలు పరిశీలిస్తే…

ఆయుధం ప్రత్యేకతలు

– ఈ క్షిపణి 2,400 కిలోమీటర్ల (సుమారు 1,500 మైళ్లు) దూరం వెళ్లగలదు.

– దీని వేగం గంటకు 885 కిలోమీటర్లు (550 మైళ్లు).

– దీని ఖచ్చితత్వం దాదాపు 5 మీటర్లు (16 అడుగులు).

– ఈ క్షిపణి తక్కువ ఎత్తులో పనిచేస్తుంది, తద్వారా రాడార్ సహా వాయు రక్షణ వ్యవస్థలు దానిని గుర్తించలేవు.

– ఇది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS)తో అమర్చబడి ఉంటుంది. ఈ కారణంగా ప్రయోగించిన తర్వాత కూడా లక్ష్యాన్ని మార్చవచ్చు.

– ఈ క్షిపణి సంప్రదాయ పేలుడు పదార్థాలతో పాటు న్యూక్లియర్ (అణ్వాయుధాలు) పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.

– ఈ క్షిపణి యుద్ధ విమానాలు, స్థావరాలు, పెట్రోలియం నిల్వలు, ఆయుధ భాండాగారాలు వంటి లక్ష్యాలను ధ్వంసం చేయగలదు.

DRDO క్రూయిజ్ క్షిపణి ప్రత్యేకతలు

– ఎటాక్ మిస్సైల్: 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న తన లక్ష్యాన్ని రెప్పపాటులో ధ్వంసం చేయగలదు.

– ఈ క్షిపణి వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో కదులుతున్న యుద్ధనౌకలు, విమానాలు, డ్రోన్‌లను కూల్చివేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

– సూపర్సోనిక్ వేగం: ఈ క్షిపణి ధ్వని వేగం కంటే ఎక్కువ (గంటకు 1,235 కి.మీ కంటే ఎక్కువ) వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కారణంగా ఇది శత్రు రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలదు. – లాంగ్ రేంజ్ కేపబిలిటీ: సుదూర లక్ష్యాలను చేధించగలదు.

– అధునాతన గైడెన్స్ సిస్టమ్: ఇది ఒక అధునాతన మార్గదర్శక వ్యవస్థను కలిగి ఉంది. ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని సాధించడంలో ఆ వ్యవస్థ సహాయపడుతుంది.

మరికొన్ని పరీక్షల్ని కూడా విజయవంతంగా పూర్తిచేసుకుంటే.. భారతదేశం సుదూర లక్ష్యాలను చేధించగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైళ్ల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, భారత అవసరాలు తీరిన తర్వాత మిత్రదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…