AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DR. Mukherjee Death Anniversary: ‘ఒక దేశంలో ఒకే రాజ్యాంగం’.. డా. శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ ఒక మహోన్నత దేశభక్తుడు

డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ.. భారతీయ జన సంఘ్‌ స్థాపకుడు. ఆ పార్టీ సంస్థాపక అధ్యక్షుడు. అంటే.. ఇప్పటి భారతీయ జనతా పార్టీకి మూల పురుషుడు. ఆయన కన్న ఓ కలను కేంద్ర ప్రభుత్వం సాకారం చేసింది. అదేంటంటే..

DR. Mukherjee Death Anniversary: ‘ఒక దేశంలో ఒకే రాజ్యాంగం’.. డా. శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ ఒక మహోన్నత దేశభక్తుడు
Shyama Prasad Mukherjee
Sanjay Kasula
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 23, 2021 | 10:27 AM

Share

(రచన…జగత్ ప్రకాష్ నడ్డా, జాతీయ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ)

(జూన్‌ 23 డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి)

DR. Mukherjee Death Anniversary: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జాతీయవాద ఆలోచనను ప్రోత్సహించినా… జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పని చేసినా.. దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి ఎవరంటే.. ముందుగా మనకు గుర్తుకు వచ్చే పేరు.. డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తన భావజాలంతో.. సుధీర్ఘ పోరాటంతో దేశ రాజకీయ వ్యవస్థపై చెరగని ముద్ర వేసుకున్నారు.

జమ్మూ కాశ్మీర్ సమస్యను ముందుగా అర్థం చేసుకున్న వ్యక్తి డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ. కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370 ని తీసుకురావడాన్ని ఆయన ఖండించారు. ఆ సమస్యపై పోరాటం మొదలు పెట్టారు.  దానికి పూర్తి పరిష్కారం కోరుతూ తన గళమెత్తారు. బెంగాల్ విభజన జరుగుతున్నప్పుడు భారతదేశ హక్కులు, ప్రయోజనాల కోసం విజయవంతంగా పోరాడిన వ్యక్తి కూడా ఆయననే చెప్పవచ్చు.

స్వాతంత్య్రానంతర కాలంలో కాంగ్రెస్ భారతీయులపై దిగుమతి చేసుకున్న భావజాలాలను, సిద్ధాంతాలను రుద్దడం మొదలు పెట్టింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించిన మొదటి వ్యక్తి కూడా డాక్టర్ ముఖర్జీనే. పోరాటంలో.. ప్రజలను సమీకృతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రతి భారతీయుడికి అత్యంత అనుకూలమైన, స్థిరమైన జీవన విధానంగా రాజకీయ, సామాజిక భావజాలాన్ని ప్రోత్సహించడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు.

తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తన తాత్కాలిక ప్రభుత్వంలో డాక్టర్ ముఖర్జీ కి చోటు కల్పించి పరిశ్రమల మంత్రిత్వ శాఖను కేటాయించారు.  అయితే, 1949లో నెహ్రూ పాకిస్థాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్‌తో జరిపిన ఢిల్లీ ఒప్పందం (ఆర్టికల్ 370) అనంతరం ఏప్రిల్ 6, 1950 న ముఖర్జీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, బయటికి వచ్చారు. డాక్టర్ ముఖర్జీ తన సైద్ధాంతిక కట్టుబాట్లతో ఎప్పుడూ రాజీపడలేదు. నెహ్రూ కేబినెట్ నుంచి ఆయన ఆయన వైదొలగడం దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయం ఆవిర్భావానికి పునాది వేసింది.

భారతదేశ స్వాతంత్య్రం పోరాటం కోసం వివిధ రాజకీయ పార్టీలు, వివిధ భావజాలాలున్నవారంతా కాంగ్రెస్ గొడుగు కిందికి వచ్చి పోరాటం చేశారు. కానీ  స్వాతంత్య్రం తరువాత దేశంలో రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి… కాంగ్రెస్ పార్టీకి  ప్రత్యమ్నాయం కావాలనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.  సాంస్కృతిక జాతీయవాదం, జాతీయ సమైక్యత రాజకీయ భావజాలం కోసం భారతదేశం ఆసక్తిగా చూస్తోంది.  ఈక్రమంలో దేశంలో ఈ చర్చకు జెండా మోసేవారిగా ఉద్భవించారు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ.. చివరికి జనసంఘ్ ఏర్పడటానికి దారితీసింది.

అక్టోబర్ 21, 1951 న జనసంఘ్ ఏర్పడింది. అతని రాజకీయ ప్రయత్నాల వల్లనే ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. అందులో జాతీయత, భారతీయత స్వాభావిక లక్షణాలు ఉన్నాయి. గత అనేక దశాబ్దాలుగా చాలా ముఖ్యమైన మైలురాళ్లను దాటి, అనేక యుద్ధాలతో పోరాడాము. ఈ రోజు మనం ఉన్న చోటికి చేరుకోవడానికి అనేక తిరుగుబాట్ల నుండి బయటపడ్డాము.

ఆవిర్భావం తొలినాళ్లలోనే భారతీయ జనసంఘ్‌ 1951–52 ఎన్నికల్లో మూడు లోక్‌సభ స్థానాలను సాధించింది. కోల్‌కతా పార్లమెంట్ స్థానం నుంచి డాక్టర్  ముఖర్జీ ఎంపికయ్యారు. అతని ఆలోచనల్లో ఉన్న స్పష్టత… అతని భావజాలం పట్ల ఆయనకున్న నిబద్ధత, దూరదృష్టిలో పెట్టుకుని ఆయన్ను పార్టీలు లోక్ సభ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నాయి. సభలో ప్రతిపక్షాల గొంతుగా మారిపోయారు డాక్టర్ ముఖర్జీ. నిజానికి, కాంగ్రెస్ వాదిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ముఖర్జీ.. ఆ పార్టీ తీరు నచ్చక కేంద్ర పదవిని సైతం వదులుకుని బయటికి వచ్చేశారు. కొత్తగా పార్టీని స్థాపించి స్వేచ్ఛా విధానానికి మద్దతు పలికారు.

కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370ని తీసుకురావడాన్ని ఖండించారు. ఈ చట్టం వల్ల దేశ సార్వభౌమత్వానికి పెద్ద అడ్డంకులుగా మారుతాయాని ఆయన భావించారు. ఈ  సమస్యపై  పార్లమెంటులో పలు సందర్భాల్లో స్వరం సైతం వినిపించారు.

దీనిని జాతి, దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ డాక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ రక్షణ శాఖ అనుమతి లేకుండానే జమ్మూకశ్మీర్లో పర్యటించాలని నిర్ణయించారు. ఢిల్లీ నుండి ప్యాసింజర్‌ రైలులో జమ్ము కశ్మీర్‌ పర్యటన ప్రారంభించారు. అదే సమయంలో జమ్మూకశ్మీర్లో ప్రవేశాన్ని నిరాకరిస్తూ పోలీసులకు ఆదేశాలందాయి. జమ్మూలోకి ప్రవేశిస్తున్నప్పుడు డాక్టర్ ముఖర్జీని అరెస్టు చేశారు.

దీంతో భారతదేశం అంతటా భారీ నిరసనలు మొదలయ్యాయి. డాక్టర్‌ ముఖర్జీని అరెస్ట్‌ చేసి అరెస్టు అయిన 40 రోజుల తరువాత రాత్రి బటోటె పట్టణానికి తరలించారు. మరుసటి రోజు ఉదయం శ్రీనగర్‌కు తరలించారు. నిర్మానుష్యమైన చిన్న గదిని సబ్‌ జైలుగా మార్చి అసౌకర్యాల మధ్య నిర్బంధించారు. ఈ క్రమంలో 1953 జూన్‌ 23వ తేదీ తెల్లవారుజామున భారత మాత ముద్దు బిడ్డ డాక్టర్ ముఖర్జీ తుది శ్వాస విడిచారని ప్రకటించారు. సాధారణంగా ప్రజాదరణ ఉన్న నాయకులు అదృశ్యమైనా, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినా నిజానిజాలు తెలుసుకునేందుకు విచారణ కమిషన్‌ వేస్తారు. కానీ ముఖర్జీ విషయంలో అలా జరగలేదు. ఆయన మరణం జవాబు లేని ప్రశ్నలకు దారితీసింది. ఆ తర్వాత అప్పటి నెహ్రూ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా మారింది. డాక్టర్ ముఖర్జీ తల్లి యోగ్మయ దేవి తన కుమారుడి మరణంపై దర్యాప్తు కోరుతూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు లేఖ రాశారు. కానీ ఈ అభ్యర్థన కూడా తిరస్కరించబడింది. ఈ రోజు వరకు డాక్టర్ ముఖర్జీ అరెస్టు .. మరణానికి సంబంధించిన విషయాలన్నీ రహస్యంగానే మిగిలిపోయింది.

ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని (ఏక్ దేశ్ మే దో విధాన్, ధో ప్రధాన్, ధో నిషాన్ నహీ ఛలేంగే) అని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నినదించారు. ఈ నినాదం మొదట జనసంఘ్, ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో  తీర్మానంగా, మార్గదర్శక సూత్రంగా మారింది.  ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా  ఇప్పుడు అధికరణ 370 కూడా రద్దైంది.

ఇది సైద్ధాంతిక యుద్ధం. ఒక వైపు కాంగ్రెస్ సహా పార్టీలు ఎల్లప్పుడూ సంతృప్తిపరిచే రాజకీయాలను ఆచరించేవి. అయితే అలాంటి వాటికి చరమగీతం పాడుతూ.. భారతీయ జనతా పార్టీ  జమ్మూకాశ్మీర్‌లో 370 వ అధికరణాన్ని రద్దు చేసి అధికారంలో కొనసాగుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఇనుప సంకల్పం, అంకితభావం ఓ వైపు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమర్థవంతమైన వ్యూహం ప్రణాళిక మరో వైపు… ఆగస్టు 2019లో ఆర్టికల్ -370 ను రద్దు చేయడం జరిగింది. “ఒక దేశంలో ఒకే రాజ్యాంగం” కింద భారతదేశాన్ని చూడాలనే డాక్టర్ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ కలను ప్రధాని నరేంద్ర మోడి నెరవేర్చారు.

ఆర్టికల్ 370 ను తొలగించి జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో కలపడం ద్వారా దేశాన్ని ఒక బలమైన… ఐక్య దేశంగా చూడాలనే డాక్టర్ ముఖర్జీ కలను సాకారం అయ్యింది. డాక్టర్ ముఖెర్జీ అత్యున్నత త్యాగం వృధా కాలేదు. డాక్టర్ ముఖర్జీ ఎల్లప్పుడూ ‘భరత్ మాతా’కు నిజమైన కుమారుడిగా గుర్తుంచుకోబడతారు. డాక్టర్ ముఖర్జీ ఒక రాజకీయ సంస్థను దాని భావజాలానికి నిజంగా కట్టుబడి ఉన్నాడు, ఐక్యమైన మరియు బలమైన భారతదేశాన్ని చూడటానికి అవిశ్రాంతంగా పనిచేశారు. అతని గొప్ప ప్రయోజనం కోసం అమరత్వం పొందారు.డాక్టర్ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీకి నివాళులు అర్పిస్తూ…

రచన…

జగత్ ప్రకాష్ నడ్డా

జాతీయ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ

(జూన్‌ 23 డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి)