హిందీ భాష వస్తేనే భారతీయులమా ? కనిమొళి ఫైర్
హిందీని, జాతీయవాదాన్ని సమానంగా చూడడం సిగ్గుచేటని డీఎంకె ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. ఒకరి ఐడెంటిటీలో భాషలకు అతీతంగా ఈ ధోరణి మారిపోయిందన్నారు. చెన్నై విమానాశ్రయంలో సి ఐ ఎస్ ఎఫ్ అధికారి ఒకరు తనను హిందీలో ప్రశ్నించినప్పుడు...
హిందీని, జాతీయవాదాన్ని సమానంగా చూడడం సిగ్గుచేటని డీఎంకె ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. ఒకరి ఐడెంటిటీలో భాషలకు అతీతంగా ఈ ధోరణి మారిపోయిందన్నారు. చెన్నై విమానాశ్రయంలో సి ఐ ఎస్ ఎఫ్ అధికారి ఒకరు తనను హిందీలో ప్రశ్నించినప్పుడు తమిళంలోగానీ, ఇంగ్లీషులో గానీ మాట్లాడవలసిందిగా కోరగా.. మీరసలు భారతీయులేనా అని ప్రశ్నించాడని ఆమె తెలిపారు. అంటే హిందీకి, నేషనలిజానికి ముడిపెడుతున్నారా అని ఆమె మండిపడ్డారు. హిందీ భాష వచ్చా, రాదా అన్నది సమస్య కాదని, హిందీ తెలిస్తేనే భారతీయులవుతామా అన్నదే శోచనీయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే కనిమొళికి హిందీ భాష వచ్చునని, దివంగత మాజీ డిప్యూటీ ప్రధాని చౌదరి దేవీలాల్ హయాంలో ఆమె హిందీ అనువాదకురాలిగా వ్యవహరించారని బీజేపీ నేత హెచ్.రాజా ట్వీట్ చేశారు. కానీ దీన్ని కనిమొళి ఖండిస్తూ.. నాకు హిందీ భాష రానే రాదని, స్కూల్లో తను తమిళం, ఇంగ్లీష్ లోనే చదువుకున్నానని తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అన్ని రాష్ట్రాలూ హిందీని అమలు చేయాలని నిర్దేశించిన సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు వంటి రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.