PM Modi Cabinet: జనవరి 14 తర్వాత మంత్రివర్గ విస్తరణ.. మోడీ క్యాబినేట్‌లో భారీ మార్పులు?
ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ కేబినెట్ లో పునర్వ్యవస్థీకరణ, విస్తరణ చర్చలు జోరందుకున్నాయి. జనవరి 14 తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండనుందని భావిస్తున్నారు.
త్వరలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వ మంత్రివర్గంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మోడీ మంత్రి మండలిలో విస్తరణ సందడి మొదలైంది. జనవరి 14 తర్వాత మంత్రివర్గంలో విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని భావిస్తున్నారు. బడ్జెట్ సెషన్ కంటే ముందే విస్తరణ, మార్పు జరిగే అవకాశం ఉంది.
దీంతో పార్టీ సంస్థాగతంగానూ పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం జనవరి 20తో ముగియనుంది. అదే సమయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా జనవరిలో జరగనుంది. కాగా, వచ్చే ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు 2024లో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నాయి.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్పులు..
ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంలో, పార్టీలో మార్పుపై చర్చలు జోరందుకున్నాయి. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీలో, ప్రభుత్వంలో విస్తరణ ఉంటుందని కూడా భావిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన కొంతమంది కొత్త ఎంపీలకు మంత్రివర్గంలో అవకాశం లభించవచ్చని తెలుస్తోంది.
గతేడాది జులైలో 12 మంది మంత్రులను డిశ్చార్జ్..
దీంతో పాటు పనితీరు ఆధారంగా మరికొందరు మంత్రులను తొలగిస్తారనే చర్చ కూడా సాగుతోంది. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది జులై 7న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ తర్వాత 12 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు. ఇప్పుడు రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉంది. అయితే పార్టీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభిందంట.
ఈ ఏడాది యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో బీజేపీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం పునరావృతమైంది. తాజాగా గుజరాత్‌లో కూడా భారీ మెజారిటీతో మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పరాజయం పాలైంది. ఇప్పుడు కొత్త సంస్థ ఏర్పాటు, ప్రభుత్వం మారే అవకాశాలను పార్టీ పరిశీలిస్తోంది.